పాదయాత్రతో ప్రజల వద్దకు కేటీఆర్
కాంగ్రెస్ హామీల మోసంపై ప్రజల్లోనే తేల్చుకోనున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమౌతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలనుకుంటున్నారు. సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు. నెటీజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కేటీఆర్ పాదయాత్ర ప్రకటనపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమౌతున్న నేపథ్యంలో కేటీఆర్ ప్రజల్లోకి వెళ్తాననడం కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తవుతుంది. పది నెలల కాలంలోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు రేవంత్ పాలనపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చివరికి గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి అవవికాని హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతోనే పది నెల్లలోనే ప్రజలంతా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నది. చట్టసభల వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నది. దీంతో అటు ప్రధాన ప్రతిపక్షంపై, నిరసనలు చేస్తున్న నిరుద్యోగులపై, ఆందోళన బాట పట్టిన రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, మహిళలపై ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపుతున్నది. ప్రజాపాలనలో ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఏది పెట్టినా జైలే. సోషల్ మీడియాను నమ్ముకుంటే జైలుకే అన్న సీఎం హెచ్చరికలకు కొనసాగింపుగా కొన్నిరోజులుగా తెలంగాణలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. నెటీజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ సంభాషణలో అనేక అంశాలపై నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అప్పటివరకు సమయం ఇచ్చారు. కానీ రేవంత్ సర్కార్ మూడు నెలల తర్వాత ప్రశ్నిస్తే ఎదురుదాడి, కేసులు పెట్టడం, నిత్యం పదేళ్ల కేసీఆర్ పాలనపైనే అసత్యాలు నిత్యం ప్రచారం చేయడం మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా కేసులు పెడుతాం. రోడ్లపైకి వస్తే లాఠీలు ఝుళిపిస్తాం. వాట్సప్ స్టేటలు పెడితే జైళ్లో వేస్తామన్నట్టు ప్రభుత్వం ఒకరకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధాన్ని అమలు చేస్తున్నది.
ఈ క్రమంలో కేటీఆర్ ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి భరోసా కల్పించాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల ఇప్పటికే రైతులు, చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నది. దీంతో అనేకవర్గాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురవుతున్నారు. కేటీఆర్ పాదయాత్ర ద్వారా ఈ వర్గాలన్నింటికి ధైర్యాన్ని కల్పించనున్నారు. రేవంత్ ప్రభుత్వ పాలనలో పది నెలల కిందట ఎలా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉన్నదో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రజల ముందు పెట్టనున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకతపైన ప్రజల తరఫున పోరాటం చేయనున్నారు. మూసీ పేరుతో ప్రభుత్వం చేస్తున్నలూటీ గురించి ఇప్పటికే పార్టీ తరఫున ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. మూసీ రివర్ బెడ్ బాధితుల వద్దకు వెళ్లి అండగా ఉంటామన్నారు. మమ్మల్ని దాటే బుల్డోజర్లు మీ ఇంటిమీది రావాలన్నారు. అసలు మూసీ వెనుక ఉన్నమర్మాన్ని ప్రజలకు వివరించనున్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌లలో నాణ్యత లేదని, వేల కోట్లు ప్రజా ధనాన్ని వృథా చేశారని విమర్శించిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటున్నది. దీనిపై ప్రశ్నిస్తే అదంతా ప్రజాధనంతో నిర్మించిందని బుకాయిస్తున్నది. ఈ ద్వంద్వ విధానాన్ని ప్రజల్లో ఎండగట్టనున్నారు. అసలు మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న దందాను ప్రజల ముందు పెట్టనున్నారు. తమ హయాంలో అప్పలు చేశారన్న కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండానే, ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే దాదాపు పది నెలల కాలంలోనే రూ. 90 వేల కోట్లు అప్పులు చేసిందని, ఆ సొమ్మంతా ఎటు వెళ్లిందో వివరించనున్నారు.
రేవంత్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తున్నదనే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. రైతుబంధు రాని రైతులు, పింఛన్ పెరగని అవ్వాతాతలు, రెండు లక్షల ఉద్యోగాల ఇస్తామని హామీ ఇచ్చి ఉన్న కొలువులనే ఊడగొడుతున్న వైనాన్ని, పది నెలల కిందట మంచిగా నడిచిన గురుకులాలను ఎలా నిర్వీర్యం చేస్తున్నది. పదేండ్లు సక్కగా వచ్చిన విద్యుత్ ఇప్పుడు ఎందుకు సంక్షోభంలో కూరుకపోయింది. పంట కొనుగోలు కేంద్రాల పెట్టక రైతులు ఎలా గోస పడుతున్నారు? పత్తి రైతులు దళారుల చేతిలో ఎలా చిత్తవుతున్నారు? ఇలా ప్రభుత్వ వైఫల్యాలన్నీ పాదయాత్ర ద్వారా ప్రపంచానికి తెలియజేయనున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఉనికి లేకుండా చేస్తానని, కేసీఆర్‌ను ఏడాదిలో మాయం చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రజల వద్దకే నేరుగా వెళ్లి బీఆర్‌ఎస్ బలమేమిటో చూపెట్టనున్నారు.