రేవ్ పార్టీలకు పాము విషం.. హిందీ బిగ్‌బాస్ విన్నర్‌పై కేసు నమోదు

ఎల్విష్ యాదవ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని, ఈ కేసులో అన్ని సాంకేతిక అంశాలపై విచార‌ణ చేప‌డుతామ‌ని అన్నారు.

Advertisement
Update:2023-11-03 18:40 IST

రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేశారనే ఆరోపణలతో యూట్యూబర్, హిందీ బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్‌‌పై కేసు నమోదయ్యింది. గత కొంత కాలంగా డ్రగ్స్ మాఫియాపైన దృష్టి సారించిన నోయిడా పోలీసులు గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ శివారులో జరుగుతోన్న రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీలో పాము విషం, డ్రగ్స్ వంటివి వాడుతున్నట్టు వెల్లడయ్యింది. 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ అనే స్నేక్‌చామర్ దగ్గర 20 ఎంఎల్ విషాన్ని పోలీసులు గుర్తించారు. కాగా ఆ విషాన్ని విచారణ నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 120బీ, వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 9, 39, 49, 50, 51 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు.




నిందితులను విచారించగా పలువురు వ్యక్తులు వీరి నుంచి పాము విషాన్ని కొనుగోలు చేసిన‌ట్లు తేలింది. అయితే ఈ కొనుగోలు చేసిన వ్యక్తుల లిస్ట్ లో బిగ్ బాస్ OTT-2 విజేత ఎల్విష్ యాదవ్ పేరు కూడా ఉందని.. అతను పరారీలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఘటనా స్థలంలో ఐదు నాగుపాములు, రెండు తలల పాములు, ఒక రెడ్ స్నేక్, కొండచిలువ సహా తొమ్మిది సర్పాలు, 20-25 ఎంఎల్ పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ఎల్విష్ యాదవ్ తోసిపుచ్చారు. అందులో ఎటువంటి నిజం లేదని, పోలీసులు విచారణకు తాను సహకరించేందుకు సిద్ధమని ప్రకటించాడు. ‘ఒకవేళ ఈ కేసులో నా ప్రమేయం 0.1 శాతం ఉన్నట్టు తేలినా.. పూర్తి బాధ్యత వహిస్తాను’ అని అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.




ఈ విషయంపై నోయిడా డీసీపీ విశాల్ పాండే కూడా స్పందించారు. ఎల్విష్ యాదవ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని, ఈ కేసులో అన్ని సాంకేతిక అంశాలపై విచార‌ణ చేప‌డుతామ‌ని అన్నారు. పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ (పీఎఫ్ఐ)‌కు చెందిన గౌరవ్ గుప్తా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఫామ్‌హౌస్‌లో ఎల్విష్, మిగతా కంటెంట్ క్రియేటర్లు పాములు, పాము విషంతో వీడియోలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల సమాచారం ప్రకారం.. రేవ్ పార్టీలలో ఎక్కువగా నాగుపాము విషయాన్ని ఉపయోగిస్తారు. ఆ విషం నుంచి ఒక పొడిని తయారు చేయడం లేదా నేరుగా గానీ తగినంత మాత్రంగా డ్రింక్స్ లో కలుపుతారు. అరలీటర్ పాము విషం అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులు అంచనా. ఒకసారి వినియోగించిన తర్వాత తీసుకున్న ఔషధం యొక్క పవర్ పరిమాణంను బట్టి దాని ప్రభావం గంటల నుండి రోజుల వరకు ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News