వీడని గ్రహణం

Advertisement
Update:2023-10-14 23:35 IST

కొందరు బురద జల్లారు మంచితనంపై మంటతో..

చంద్రుని కమ్మేసిన

కరి మబ్బుల గెలుపు శాశ్వతమా..!?

నీతికి పుట్టినదేనా?

నీ గొంతు దిగుతున్న

ప్రతి మెతుకు...

నిజాయితీ అంటే గిట్టదుగా..!

నీ అవినీతి అస్త్రానికి అన్యాయంగా బలైందిగా..

నిప్పుల కొలిమిలో మౌనంగా తన అస్తిత్వాన్ని

శుద్ధి చేసుకుంటుంది.

గుడిలో పొర్లు దండాలు

నీ అపరాధ భావనా మనస్సాక్షిని

ఏమని సమాధానపరుస్తాయో!

పది అవినీతి జలగల మధ్య నిజాయితీ పావురం భయంతో ఎగిరి పోవాల్సిందేనా...!?

నిశీధి నీడలో చెట్టు చాటుకి చేరే వ్యభిచారికీ నీకు

పెద్దగా తేడా ఏముంది?

లేదు లేదు

అలా అనుకోకండి సుమా!

పెద్ద తేడానే ఉంది.

ఆమెది కడుపాకలి..

వీరిది స్వార్థాకలి.

నా దేశానికి ఎప్పుడో అవినీతి పుండు పుట్టింది.

దానికి అవినీతి శాఖ దాడులతో పెన్సిలిన్ పూస్తున్నా

గాయం మానడం లేదు.

ఎందుకో తెలుసా..

నా దేశానికి అంతకు మునుపే దేశ ద్రోహుల స్వార్థపు షుగర్ తగిలింది.

ఈ అవినీతి పుండుకి ఏ మందూ పనిచేయడం లేదందుకే!

అంతు లేని అవినీతి ఆకలికి నా దేశంలో ఎన్నో ఎన్నెన్నో జీవితాలు

బలి పశువులు అవుతున్నా...

మేమింతే అంటూ దోచుకుంటున్న

ఈ స్వార్థ జీవులు ఈ దేశానికి పట్టిన వీడని గ్రహణం.

-చేసెట్టి వరాహ కృష్ణ

వలసపాకల గ్రామం, (కాకినాడ)

Tags:    
Advertisement

Similar News