“బ్రతుకు బాట” (కథ)

Advertisement
Update:2023-06-07 13:50 IST

బ్రతుకు బాట (కథ)

డాక్టర్ కరుణ సిటీ నుండి 80కి.మీ. దూరంలో ఉండే తన సొంత ఊరు ‘గుమ్మిడిదల’ అనే గిరిజన గ్రామానికి బయలుదేరింది. నగరంలో మంచి పేరుపొందిన హాస్పిటల్‌లో పెద్ద జీతానికి పనిచేస్తూ హస్తవాసిగల డాక్టరమ్మగా ఖ్యాతి తెచ్చుకుంది.

తన తండ్రికిచ్చిన మాటప్రకారం ప్రతి ఆదివారం తన పల్లెకి వెళ్ళి అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని వారికి అవసరమైన మందులను ఇచ్చి, అమ్మ చేతివంటను తిని, మరునాడు ఉదయమే తిరిగి ఉద్యోగానికి వస్తూండటం అలవాటు చేసుకుంది.

ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగార్డ్‌గా పనిచేసే శీనయ్య, చదువుపై శ్రద్ధపెట్టని కొడుకు రాముకు కారుడ్రైవింగ్ నేర్పించి, లైసెన్స్ వచ్చిందని చెప్పటంతో ఆరోజు నుండే అతనిని తన కారుకు డ్రైవర్‌గా నియమించుకుంది.

కారులో కరుణను గ్రామానికి తీసుకు వెడుతున్న రాము, ”అమ్మా! ఆ మారుమూల గూడానికి ఇలా వారంవారం వెళ్ళి మీరు వైద్యం చేయడమేమిటమ్మా? అక్కడ ఆరోగ్యకేంద్రం లేదా? దానికి ప్రభుత్వం వారు డాక్టర్‌ను పంపటం లేదా? ‘డబ్బు కోసమా?’ అంటే చేసేది ఉచిత సేవ. దానికితోడు మందుల ఖర్చు ఒకటి. ఆదివారంనాడు కూడా విశ్రాంతి తీసుకోకుండా మీరు శ్రమ పడుతున్నారు. అమ్మానాన్నలనే మన సిటీకి తీసుకువచ్చి మనతోనే ఉంచుకుంటే వారికి ఎక్కువ సంతోషం కదమ్మా! మీఊరికి రోడ్డు కూడా అద్దంలా ఉంది. ఆటోలు. బస్సులు బాగానే తిరుగుతున్నాయి కదా. జనాలు సిటీకొచ్చి వైద్యం చేయించుకోవచ్చు కదా” అని అడిగాడు రాము.

“రామూ! ఈరోడ్డు ఇలా ఉంది కాబట్టే నేనీ మారుమూల గూడెం నుండి సిటీ కొచ్చి చదువుకోగలిగాను. నా చిన్నతనంలో అంటే నేను మూడవతరగతి, అన్నయ్య అయిదవ తరగతి చదివే రోజులలో చదువుకోవడానికి మేమెన్ని బాధలను పడ్డామో నాకు ఇంకా గుర్తుంది. నీకు శ్రమ తెలియకుండా ఈ రహదారి ఇలా ఉండటానికి మా నాన్న పడిన తపన గురించి చెపుతాను. విన్న తరువాత నేను ఈపనిని ఎందుకు చేస్తున్నానో నీకే అర్ధమవుతుంది” అన్న కరుణ, తన గతంలో జరిగిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ చెప్పటం మొదలుపెట్టింది.

"చూస్తున్నావుగా రాము, ఇలా కొండలలో, గుట్టలలో, అడవుల మధ్యనున్న మాఊరిలో అప్పట్లో 100 గడపలుండేవి. 5ఏళ్ళకోసారి వచ్చే ‘ఓట్లపండుగ’ అదే ఎన్నికలకోసం పెద్దపెద్ద రాజకీయ నాయకులు రావడం ‘మీకవి చేస్తాం, ఇవిచేస్తాం’ అంటూ వాగ్దానాలు చేయటం, గొఱ్ఱెల మందలాంటి మా ఊరి జనాలు వారి కల్లబొల్లి మాటలకు ‘ఊ’ కొట్టడం, ఓట్లను దండుకుని మరి ముఖం చూపించని ఆ నాయకుల వైఖరికి మానాన్న విసిగి పోయారు.

ఊరికి రహదారిని ఏర్పరచమని, నీటివసతి కల్పించమని ఈయన ఎన్ని ఆఫీసులకెళ్ళినా, ఎంతమంది నాయకులను కలసినా, ఎందరు అధికారులతో మొరపెట్టుకున్నా ప్రయోజనమేమీ కనిపించలేదు.

ఆరోజులలో ఈ ప్రాంతానికి కరువొచ్చిపడింది.రెండుసంవత్సరాల

పాటు పంటలు పండలేదు. పనుల్లేక ప్రజలు అల్లాడిపోయారు. త్రాగేనీరు కూడా గుట్టలు దాటుతూ, రాళ్ళను, ముళ్ళను తొక్కుకుంటూ, మైళ్ళ దూరంలోవున్న చెఱువులనుండో, బావులనుండో తెచ్చుకోవలసి వచ్చేది. అంత శ్రమపడి నీటిని తెచ్చుకోలేక, నడుచుకుంటూ పక్కనున్న గ్రామానికెళ్ళి పనులుచేసి తిరిగి గూటికి చేరలేక, మా నాన్న, మరో అయిదారు కుటుంబాలవారు తప్పితే మిగిలిన అందరూ నగరానికి వలసలొచ్చేశారు.

మానాన్న మాత్రం ఆశావహ దృక్పథంతో “ఇంకొంత కాలం చూద్దాం. నేను పుట్టిన ఈభూమిని వదిలి ఎక్కడికో పోయేది లేదు” అంటూ ఊళ్ళోనే ఉండిపోయాడు. మాకున్న కొద్ది పొలం బీడుభూమిగా మారిపోగా నాన్న నడవటానికి కూడా వీలుకాని బాటలో సైకిల్‌పై 15మైళ్ళ దూరంలో ఉన్న టౌనుకెళ్ళి కూలిపని చేసి కుటుంబ అవసరాలను తీర్చేవాడు.

మానాన్నకు చదువంటే ఎనలేని ఇష్టం కావటంతో అన్నను, నన్ను తాను పనికి వెళ్ళే సమయంలో సైకిల్‌పై ఎక్కించుకుని స్కూలు దగ్గర దింపేవాడు. సాయంత్రం మిగిలిన పిల్లలందరూ ఇళ్ళకు వెళ్ళిపోయినా, మేమిద్దరం స్కూలులోనే హోంవర్కులు పూర్తిచేసుకుని, పాత పాఠాలను చదువుకుంటూ కూర్చునేవాళ్ళం. తన పని పూర్తి చేసుకున్న తరువాత నాన్న మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా ఓసంవత్సరం గడిచింది.

స్కూలుకు ఎండాకాలం సెలవలిచ్చారు.

ఓరోజు రాత్రివేళ మా అందరి భోజనాలు పూర్తయ్యాక, “నేను ఇక్కడినుండి జాతీయ రహదారిదాకా రోడ్డు వేసే పని మొదలుపెట్టాలి అనుకుంటున్నాను. మన నలుగురం కొంచెం కష్టపడితే పని పూర్తిచేయటం పెద్ద విషయమేమీ కాక పోవచ్చు. మీరు నాకు సాయం చేస్తారా?” అంటూ అడిగాడు నాన్న.

“నాన్నా! రోడ్డుపడితే మన పక్కింటి పద్మత్త, మామ, తాత ఇలా ఊరంతా తిరిగొస్తారు కదా. అప్పుడు పిల్లలంతా చక్కగా సైకిళ్ళపై స్కూలుకెళ్ళవచ్చు. పెద్దవాళ్ళంతా తాము పండించిన పంటలను కిందనున్న ఊరిలోని సంతలో అమ్ముకోవచ్చును కదా” అన్నాడు అన్నయ్య.

“ఔవునురా చిన్నవాడివైనా బాగా చెప్పావు” అంది అమ్మ.

అన్నయ్య మాటలకు మురిసిపోయిన నాన్న “నీవు చెల్లాయిని సైకిల్‌పై తిప్పాలన్నా మనం ఈకష్టం చేయాల్సిందేరా” అన్నాడు.

అలా నాన్న పొలం పనులను పక్కన పెట్టి, తానే సుత్తి, పలుగు, పార తీసుకుని కొండ రాళ్ళను పగుల కొడుతూంటే, వచ్చిన చిన్నచిన్న రాళ్ళను, మట్టిని తట్టలతో మోసుకొచ్చి గుంటలలో వేస్తూ, మేము నాన్నకు సాయం చేశాము. ఉదయం ఆరు గంటలకే మొదలుపెట్టిన పనిని సాయంత్రం ఆరైనా ఆపేవాడు కాదు నాన్న. ఈమధ్యలో చిన్నపాటి వానలు రావటంతో అమ్మను పొలంపనులను చూసుకోమని నాన్న ఒక్కడే రోడ్డు గురించి కష్టపడేవాడు. అలా వర్షాకాలం వచ్చేసరికి నేలను చదును చేయటం పూర్తయ్యింది. వానకు చదును చేసిన రోడ్డులోని మట్టి అటుఇటు బెసక్కుండా పెద్దపెద్ద ఎండిన చెట్లను వేసి సర్దేవాడు.

ఇంకా 7 మైళ్ళ రోడ్డును వేస్తే పెద్ద రోడ్డుకు కలుస్తుంది.ఇలా నాన్న పడుతున్న కష్టం చూసిన ఒకరిద్దరు గ్రామస్తులు తాము కూడా నాన్నకు సాయం వచ్చారు.

ఒకరోజు ఎఱ్ఱటి ఎండలో నాన్న రోడ్డు కోసం చేస్తున్న శ్రమను చూసిన ఒక పత్రికా విలేఖరి, నాన్న ఫొటోలను తీసుకున్నాడు. నాన్నని అడిగి విషయం తెలుసుకొని తాను చేసే న్యూస్‌పేపర్‌లో మంచి సెన్సేషన్ కలిగించేలా ఆ విషయం వ్రాశాడు. టి.వి.లో బ్రేకింగ్ న్యూస్‌లా వచ్చిందా వార్త.

“ఒక సామాన్య వ్యక్తి తన ఊరి ప్రజలను తిరిగి ఊరికి రప్పించాలనే ప్రధానమైన తలంపుతోను, తన పిల్లల చదువుకోసం, ఒక్కడే కష్టపడుతూ ‘రహదారి’ని నిర్మించటం కోసం కొండల్ని పిండి చేసి, తన రక్తాన్ని స్వేదంగా మార్చి 10 కిలో మీటర్లపైన నిర్మాణం పూర్తిచేయటం సామాన్యమైన విషయం కాదు. కానీ ‘గోవిందు’ అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు. అధికారము, డబ్బు చేతిలో ఉన్నా, సర్పంచ్‌లు, MLAలు, MPలు, అధికారులు చేయని కార్యాన్ని, ఒంటిచేత్తో భార్యాపిల్లల సాయంతో రెండునెలలలో అంత దూరం రోడ్డు వేయటం అసాధారణం, అద్భుతం” అంటూ గొప్పగా వార్తలు వచ్చాయి.

ఇక చూడు !మరునాటి నుండి అన్ని ప్రాంతాలనుండి ప్రజలు తీర్ధంలా వచ్చి చూసి పోయారు.

ఆవార్తను చదివిన జిల్లా కలక్టర్ ప్రభావతిగారు, జిల్లా అధికారుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. “ఇది మన యంత్రాంగానికి తలవంపులు తెచ్చే విషయం. ఇప్పుడే నేను బయలుదేరి వెళ్ళి ఆవ్యక్తిని కలుసుకోవాలి. అతని ద్వారా ఆఊరి విషయాలను తెలుసుకుని, అతనికి అవసరమైన సహాయాన్ని అందించాలి” అన్నారు.

“మేడం ఆఊరికి ఇంకా సరయిన దారి ఏర్పడలేదు. అతనిని మన ఆఫీసుకు రమ్మనమని కబురుచేద్దాం” అని అన్న అధికారులతో “ఎంత కష్టమైనా మనమే అక్కడికివెళ్ళాలి. ఒక్క వ్యక్తి శ్రమపడి అంత పని పూర్తిచేయటానికి నడుం కడితే మనం ఇంకా రోడ్డులేదు, వాహనాలు వెళ్ళవు అని తాత్సారం చేయటమేమిటి?” అంటూ జీప్‌ను తీయమన్నారు.

అలా జిల్లా కలక్టర్‌గారు మా ఊరు వచ్చి నాన్నతో “గోవింద్‌గారూ !మీరు ఇంత సింపుల్‌గా ఉన్నా మీరు చేసిన పని మాత్రం అత్యున్నతంగా ఉంది. డబ్బు, అధికారం అన్నీ ఉన్నా మావాళ్ళంతా మీగ్రామానికి కావలసినవేవీ చేయలేదిన్నాళ్ళుగా. అవేమీ లేని మీరు కండబలం, గుండెబలం, సంకల్పబలంతో మాకు కనువిప్పు గావించారు. ఆదర్శంగా నిలిచారు” అంటూ నాన్నను సత్కరించారు. “మీరు మొదలు పెట్టిన పనిని మేము పూర్తిచేస్తాం” అంటూ నాన్న వేసిన కచ్చారోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చే ప్రతిపాదనలను వేయించి ఆరునెలలు గడిచేసరికి ఇదిగో ఇలా అద్దం లాంటి రహదారిని పట్టణానికి అనుబంధంగా వేయించారు.

నాన్న ఆశయం -మమ్మల్ని బాగా చదివించటం అనే విషయాన్ని తెలుసుకున్న ప్రభావతి మేడం నన్నూ, అన్ననూ గురుకుల పాఠశాలలో చేర్పించారు. నేను మెడిసిన్ చదవటం ఒకరకంగా ఆవిడ పుణ్యమే. నాన్న చేసిన ఆగొప్ప పని మూలంగా మా చదువులు ఉన్నతంగా సాగాయి. అన్నయ్య సిటీ కాలేజిలో ప్రిన్సిపాల్‌గా చేస్తున్నాడు.

“మేమెంతటి ఉన్నత స్థితికి వెళ్ళినా జన్మభూమిని మరిచిపోమని, అలాగే ఈరోడ్డు విలువను కూడా మర్చిపోం” అని నేను అన్నయ్య నాన్నకు మాటనిచ్చాం. ఆమాటకు విలువనిచ్చే ప్రతివారం నేను, అన్నయ్యా ఇక్కడకు వచ్చి మాఊరి ప్రజలకు విద్య, వైద్యం అందేలా కృషిచేస్తున్నాం.

మరిప్పుడు చెప్పు! నాన్నావాళ్ళను సిటీకు తీసుకురావటం కన్నా, నేనే వారానికోసారి ఇక్కడకు రావటంలో ఆనందం వుందిగా. అంత కష్టపడి మాకింత గొప్ప జీవితాన్ని అందించిన నాన్నకు కానుకగా ఈమాత్రం చేసేపనినే కష్టమనుకుంటే ఎలా? నాన్న సాధించిన విజయం త్రోవంతా పరచుకుని మమ్మల్ని ఆదిశగా నడవమంటూ స్ఫూర్తిని నింపుతోంది” అంది కరుణ.

“నిజమేనమ్మా! ఊరిప్రజలకోసం, పిల్లలకోసం ఆతండ్రి మనసు అంత గొప్పగా ఆలోచించబట్టే కదా ఈరోజు మీరు డాక్టర్‌గా అందరికీ వైద్యం అందించగలుగుతున్నారు. చదువుకున్న గొప్పగొప్ప వాళ్ళు ఆలోచించలేని విషయాన్ని, మారుమూల గిరిజనగూడానికి చెందిన చదువులేని సామాన్య వ్యక్తి ఆలోచించి, ‘ఎవరో రావాలని, సాయం చేయాలని’ ఎదురుచూడక స్వశక్తితో రహదారినేర్పరచి పదుగురికి మార్గదర్శిగా మారి ప్రభుత్వాన్నే కదిలించటం.. అబ్బో! తొందరగా వెళ్ళి మీనాన్నగారి పాదాలకు నమస్కరించాలమ్మా” అంటూ గోవిందు గొప్పతనాన్ని కొనియాడాడు రాము.

ఊరిలోకొచ్చిన కారు కరుణ వారింటిముందు ఆగింది. రాము కారుదిగి, కరుణ బ్యాగ్ తీసుకుని లోపలకు తీసుకొచ్చాడు. కరుణకు ఎదురొచ్చిన తల్లి “ఏమ్మా! ప్రయాణం బాగా జరిగిందా?” అని అడిగింది.

కరుణ జవాబు చెప్పేలోగా “మీ ఊరిమారాజు మాదొడ్డ మనస్సుతో బంగారు బాట వేసారుగదమ్మా. అమ్మాయిగారికి ఏకష్టం కలుగకుండా తీసుకొచ్చానండీ” అన్నాడు రాము.

“అమ్మా! నాన్న ఏరి? కనిపించటంలేదు” అని అడిగింది కరుణ.

“ఎందుకడుగుతావులే? ఊరిని చక్కబెట్టటానికి వెళ్ళారు. నువ్వూ, అన్నయ్యా వస్తారని చెప్పి వైద్యమవసరమైన వారిని, చదువుకునే పిల్లలను తీసుకుని ఇంకాసేపట్లో వస్తారు. ఈలోగా నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో” అని అన్న తల్లితో “ఎందుకమ్మా నాన్నను అలా అంటావు. ఆయన చేసిన మంచి పనులే మమ్మల్ని ఇంత ఉన్నతంగా నిలిపాయి కదా” అంది కరుణ.

“నాన్నపై ఈగ వాలనీయవు కదా” అంటూ కూతురి తలనిమిరింది ఆ తల్లి.

“రామూ! అలా వరండాలో కూర్చో. అందరి కష్టసుఖాలను విచారిస్తూ, వారిని వెంటబెట్టుకొచ్చే పెద్దాయనే మా నాన్న గమనించు” అంది కరుణ.

“గుళ్ళో దేవుడి దర్శనమైనా త్వరగా అవుతుందేమోగానీ మీ ఊరి మారాజు దర్శనానికి చాలా సమయమే పట్టేలా వుందే” అంటూ నవ్వాడు రాము.

-ఉప్పలూరి మధుపత్ర శైలజ

Tags:    
Advertisement

Similar News