"మేడం మీ కోసం ఎవరో వచ్చారు." చెప్పింది పి.ఏ శ్రావణి.
"పంపించoడి.." అంది అరుణ.
ఏభై యేళ్ళ వ్యక్తి వచ్చాడు.
"ఎవరు మీరు ఏం కావాలి."అడిగింది.
"నాకేమీ వద్దమ్మా ..పేపర్లో మీ ఇంటర్వూ చూసాను. ఒకసారి కళ్ళారా మిమ్మల్ని చూసి పోదామని వచ్చాను" చెప్పాడు. కాస్త సిగ్గు పడింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ పత్రిక తన గురించి తెలుసుకుని ఇంటర్వూ చేసింది.
కాఫీ తెప్పించింది. అతడు కాఫీ తాగుతుండగా "ఏం చేస్తుంటారు మీరు?" అడిగింది.
"వ్యవసాయం చేస్తుంటానమ్మా" చెప్పాడు.
కాసేపటి తరువాత వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడు ఏ విషయంలోనో ఏమూషన్ అవుతున్నాడని అర్ధం అయ్యింది.
"ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్" అంది.
"సాధ్యం కావటం లేదమ్మా, రోజూ నా కూతురు కల్లోకి వస్తుంది. నిద్ర పట్టటం లేదు" చెప్పాడు.
శ్రావణిని ఇంటర్ కంలో పిలిచి "వీరిని విజిటర్స్ రూంలో కూర్చో పెట్టు. మన కాన్ఫరెన్స్ అయ్యాక లంచ్ చేద్దాం" అంది.
"నేను వెళ్తాలేమ్మా." అన్నాడు.
"మీరు నాతో మీ బాధ గురించి చెప్పాలి. నేను వినాలి. పైగా మీరు నాతో లంచ్ చేస్తేనే సంతోషం పడతా.." అంది. మొహమాటంగా"సరే"అన్నాడు.
లంచ్ పూర్తయ్యాక .."పదండి మాట్లాడుకుంటూ వెళ్దాం" అంది.
"ఐదు దాటితే మా వూరికి బస్ లు వుండవమ్మా..." చెప్పాడు
"పర్లేదు నా కారులో మిమ్మల్ని ఇంటికి చేరుస్తా" అంది.
కూతురితో వచ్చిన అపరిచితుడ్ని చూసి నొసలు ముడి వేసింది తులసమ్మ.
"నిన్న నా ఇంటర్వూ చూసి కలవడానికి వచ్చారమ్మా.." చెప్పింది అరుణ.
చేతులు జోడించి నమస్కారం చేసి, "మీ త్యాగాలు వృధా పోలేదమ్మా.. అమ్మాయిని ఉన్నత స్థాయికి తెచ్చారు" అన్నాడు సోమయ్య.
ఎందుకో ఆమె ముఖం కాస్త గిల్టీగా కన్పించింది.
"మా అమ్మాయి ఇంటర్వూ ఎందుకు కదిలించింది?మిమ్మల్ని" అడిగింది.
కాసేపు అతడు యేమీ మాట్లాడ లేదు.
తర్వాత..
"నా బంగారు తల్లిని నేనే పొట్టన పెట్టుకున్నానమ్మా. బాగా చదివే పిల్లని చదువు ఆపు చేసి పెళ్లి చేసి పంపాను. 'నన్ను చదివించు నాన్నా...డాక్టర్ నవుతాను' అని బతిమాలేది. 'నిన్ను డాక్టర్ని చదివించే శక్తి నాకు లేదమ్మా' అని పాలేరు రావుడికి కట్ట బెట్టాను. 'చదువుకుంటాను స్కూల్ కెళ్ళి' అని పెళ్లయ్యాక కూడా నా బిడ్డ వాడితో గొడవ పడేది. రాక్షసుడు గొడ్డును బాదినట్టు బాదేవాడు. ఒక రాత్రి నా పిచ్చి తల్లి ప్రాణాలు తీసుకుంది." చెప్పాడు.
విషాదంగా చూసింది తులసమ్మ.
"నీ బిడ్డలా నా బిడ్డ ఎందుకో ఆలోచించలేక పోయిందమ్మా ..." అన్నాడు సోమయ్య.
"నీలాంటి నాన్నలే పెళ్లి పేరుతో మా కలల్ని చిదిమేస్తారు." అంది కాస్త కోపంగా అరుణ తను ఎంటరై. విస్తుపోయి చూసాడు సోమయ్య.
"నాన్న ఎవరో నాకు తెలియదు. అమ్మ కూడా చెప్పలేదు. నాలిగిళ్ళల్లో పని చేస్తే తప్ప మాకు కడుపు నిండని పరిస్థితి. అమ్మ ఆరోగ్యం దెబ్బ తినడంతో ఐదో తరగతికే నా చదువు కొండెక్కింది. అమ్మ చేసే అంట్లు తోమే పని నేను నెత్తికెత్తుకున్నాను. ఇక బడి నాకు సాధ్యం కాదని అర్ధం అయ్యింది. వయసొచ్చాక పెళ్లి చేసుకోమని అమ్మ నీకు లాగే పోరింది. చదువుకుంటానని చెప్పా.. 'ఈ వయస్సులోనా.' అని ఆశ్చర్యపోయింది. 'పెళ్లికి వయస్సు వుంటుందేమో కానీ చదువుకి కాదు కాదమ్మా' అన్నాను.
పదో తరగతి కట్టి పాసయితే నేను పనిచేస్తున్న ఇంటి ఓనర్ జగన్నాథం సార్ ఆశ్చర్యపోయాడు. అతడే ఖాళీ సమయంలో చదువు చెప్పేవాడు. నా శ్రద్ధ గమనించి నేరుగా ఇంటరు పరీక్ష రాయించాడు. ఇంటర్ కూడా పాస్ అయ్యాను. ఆ తర్వాత బి.టెక్. డే కాలేజ్ లో చేరిపించాడాయన.
ఒక వైపు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూనే బి.టెక్ పూర్తి చేశాను. ప్రభుత్వ సహకారంతోనే విదేశాలకెళ్ళి యం.ఎస్. చేశాను.
అక్కడ సంపాదిoచుకొచ్చిన డబ్బు తోనే ఇక్కడ చిన్న సైజ్ సాప్ట్ వేర్ కంపెనీ పెట్టాను. ఇప్పుడు నా కంపెనీ టర్నోవర్ వంద కోట్లు. ఇదే చదివి మీరు ఆశ్చర్యపోయారు. ఏతా వాతా అంట్లు తోమే అమ్మాయి ఒక ఐ.టి. కంపెనీకి ఎలా యజమాని అయ్యిందనేది అందరి సందేహం...
ఆయన నాకు జన్మ ఇవ్వలేదు. జీవన పోరాటం చేసే స్ఫూర్తినిచ్చాడు. ఆయనే నాన్న కాని మా నాన్న జగన్నాథం.
మీరు ఆయనలా తండ్రి స్థానంలో వుండి స్పందించి ఉంటే మీ అమ్మాయి లోకం విడిచి వెళ్ళేది కాదు" చెప్పింది అరుణ.
దుఖోద్వేగంతో చూసాడు సోమయ్య.
- తటవర్తి నాగేశ్వరి (కొవ్వూరు)