సున్నిత స్పృహాత్మకి ప్రణమిల్లుతూ ....

Advertisement
Update:2022-12-10 14:15 IST

నా అణువణువూ ఒక అనంత మహాశక్తి నిర్మితమై

భూమిపై సూర్యశక్తిని ఆస్వాదిస్తూ

నేనొక వీర్యవిలసితమైన

సంపూర్ణ స్వతంత్ర యంత్రంగా

పరిఢవిల్లుతున్నానని

ఈ మధ్యనే తెలుసుకున్నాను

ఒంటినిండా అణువణువూ

నిండిపోయిన ఆ శక్తి

నాలో ప్రవేశించ సాహసిస్తున్న

ప్రతి రోగక్రిమినీ

అప్రతిహత వీరత్వంతో

ఎదుర్కుంటో వుందని

ఈ మధ్యనే నేను గ్రహింపగలిగాను

విషతుల్యం అయిన మందులతో

వికృత విపరీత ధనదాహ విరహంతో

విశ్వ వ్యాపారాన్ని సాగిస్తూ

పట్ట పగలే దోపీడీ చేస్తున్న

రక్తపిపాస రాక్షస పిశాచసమూహాన్ని

ఈ మధ్యనే పోల్చుకోగలిగాను

సమాజమా చతికిల పడిపోయింది

ప్రభుత్వాలన్నీ భ్రష్టు పట్టిపోయాయి

వ్యక్తిస్వార్థం విచ్చలవిడిగా

విశ్వాన్నంతటినీ లోబరుచుకుంటోంది

వొంటరితనాన్ని

బంగారు సింగారు వస్త్రంలా

పైపైన కప్పుకొoటున్న సామాన్య జనం

ఏం చెయ్యాలో తెలీక

బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారని

ఈ మధ్యనే

సున్నితాత్మ ప్రసాదించిన స్పృహతో దర్శించ గలిగాను

అనంతమైన దుఖంతో

బాధలు భరించలేక

శరీరాన్ని మనసును

అదుపులో పెట్టుకోలేక

కృంగి కృశించి పోతున్న జనం

ఆత్మ హత్యలకి పాల్పడటందర్శిస్తూ

వీళ్లంతా అమాయకంగా తమకి

ఆ శక్తి సమకూర్చిన ఆత్మని దుర్మార్గంగా హత్యగావిస్తూ ఆత్మాపహరణ అనే పాపానికి

ఒడి గడుతున్నారని

ఈ మధ్యనే నా మనసు హెచ్చరించింది

ప్రశాంత హృదయం కోసం

విశ్వమంతా వెదుకుతూ

ప్రయాణిస్తున్నాను

పూలూ పళ్లూ ఆకులూ అలములూ మధ్య

మానవత్వపు పరీమళం కోసం

అన్వేషిస్తున్నాను

మనసునిండా

అద్వితీయ ఆనందాన్ని నింపుకోవాలని

ఆరాటపడుతున్నాను

ఈ మధ్యనే

అద్భుత కాంతి సౌందర్యం కోసం

నేత్రాలు బార్లా తెరిచి

నిరీక్షిస్తున్నాను

- సుమనశ్రీ

Tags:    
Advertisement

Similar News