సాగిపో... (కవిత)

Advertisement
Update:2023-05-12 12:28 IST

నువ్వెక్కడన్నా

వాళ్లకు తారస పడితే

పిల్లకుంకవంటూ గేలి చేస్తారు

హేళనగా నవ్వుతారు

శైలీ శిల్పమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు

పద గాంభీర్యత అంటూ పళ్ళికిలించి పోతారు

ఆడంబరతకి ఆమడ దూరం అంటూ

అందలాల వైపు మొగ్గుతారు

పారదర్శక పదార్థాలమంటూ

లోగుట్టుల్లో నీచపు ఆలోచనలకు బీజం వేసుకుంటారు

నువ్వు సామాజికమంటే

వాళ్ళు ఆత్మగతం అంటారు

నువ్వు వైయక్తికమంటే

వాళ్ళు వ్యవస్థీకృతమ్ అంటారు

నువ్వు రసస్ఫోరకమైతే

వాళ్ళు భావ ప్రాధాన్యతను లేవనెత్తుతారు

నువ్వు అనంతాన్ని

ఔపోసన పట్టాలని చూస్తే

వాళ్ళు శూన్యపు దిక్కువైపు

చూపు సారిస్తారు

నువ్వు సరళత వైపు మొగ్గు చూపితే

వాళ్ళు సంక్లిష్టత ఇష్టమంటారు

నువ్వు సంక్షుభిత వైతే

వాళ్ళు సమృద్ది ని వల్లె వేస్తారు

నువ్వు అభ్యుదయమంటే

వాళ్ళు సంప్రదాయాన్ని పలవరిస్తారు

నువ్వు ప్రాకృతమంటే

వాళ్ళు నవీనమంటారు

అందుకే

నేనంటాను

నువ్వు నీలానే వాక్యమవ్వమని

నీలానే మిగిలి పొమ్మని

సిసలు కవిత్వానివై బతికిపొమ్మని

- సుధామురళి

Tags:    
Advertisement

Similar News