భంక్తుం ప్రభుః వ్యాకరణస్య దర్పం పదప్రయోగధ్వని లోక ఏషః శశో యదస్యాస్తి శశీ తతోs య మేవం మృగోsస్యాస్తి మృగీతినోక్తః (నై.22.82)
ప్రజలు వాడుకునే పదాలు వ్యాకరణం సూత్రాల ద్వారా సాధింపబడతాయని వ్యాకరణం లేనిదే భాషే లేదని, పదాలకు వ్యాకరణమే శరణ్యం అని, ప్రథమోహి విద్వాంసా: దర్పంగా అనుకునే వైయ్యాకరణులపై శ్రీహర్షుడు తన నైషధీయచరితం 22వ సర్గలోని 82 వ శ్లోకం నలుని ద్వారా సున్నితమైన చమత్కారబాణం వేశాడు.
ప్రకృతి ప్రత్యయ విభాగంతోనే సకల శబ్దముల ప్రయోగము అనే వ్యాకరణ శాస్త్రం యొక్క గర్వాన్ని అణచడానికి ఈ కవిలోకమే సమర్థవంతమైనది . అలా లోకము సమర్ధము కానిచో శశ అస్య ఆస్తీతి శశీ (శశము కుందేలు ఉన్నది కనుక శశీ) అన్న శబ్దం(పేరు) ఏర్పడినట్లు
మృగ అస్థితి మృగీ (మృగము లేడి ఉన్నది కనుక మృగీ) అని శబ్దము వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించే ఏర్పడాలి కదా మరి!
శబ్దాలన్నీ వ్యాకరణ నియమాలకి లోబడి ఉండాలి అంటే లోకంలో అలాంటి వాడుక లేదు. శశి అన్న ప్రయోగం ఉన్నది కానీ మృగీ ప్రయోగము లేదు మృగలాంఛనుడు అనే పదం వాడుకలో ఉంది .
అందువల్ల లక్ష్యమును ఉద్దేశించి లక్షణం ప్రవర్తించాలే కానీ లక్షణాన్ని ఉద్దేశించి లక్ష్యం ప్రవర్తించదు అని గ్రహించాలి. “ప్రయోగం మూలం వ్యాకరణం” అనే వాక్యాన్ని అనుసరించి లోకమే శబ్ద ప్రయోగంలో బలవంతమైనది అని తెలియాలి.
మాయాబజారులో ఎస్. వి. రంగారావు అన్నట్లు పాండిత్యం కన్నా జ్ఞానమే మేలు. శంకరాచార్యులవారూ అన్నారు”నహి నహి రక్షతి డుకృకరణే “. ఈ విధంగా వ్యాకరణ శాస్త్రం వల్ల సాధించి ప్రయోగించడం కాదు అని భావన.
వ్యాకరణం వల్ల పదాలు కాదు లోక ప్రయోగం వల్లే వ్యాకరణ సిద్ధాంతాలు అని హర్షుడు ఇక్కడ మనకి వ్యాకరణశాస్త్రవేత్తల గర్వమును భంగపరచుటకు సామర్థ్యముగా కలది కవుల కలం అని ఉదాహరణతో సహా నిరూపించాడు.
- భండారం వాణి