సీత, రామారావు ప్రేమించుకున్నారు. ఇద్దరూ సహోద్యోగులే . వారి ప్రేమ గురించి వారి వారి ఇళ్ళల్లో చెప్పారు.
ఆమె అమ్మమ్మా తాతయ్యా, అతడి తల్లిదండ్రులూ ఈ కాలపు కుర్రకారు తీరు జోరు తెలుసు గనుక ఆశ్చర్యపడలేదు.
తమ పరువు, గౌరవం, మర్యాద మిగిల్చినందుకు సంతోషించారు.
ఏ చిన్న అడ్డుపుల్ల వేసినా తమని త్రోసిరాజానేయొచ్చని భయపడ్డారు. అహాల గోల, గొడవలు లేకుండా ఒకర్నొకరు బాగా అర్ధం చేసుకున్నామని బల్లగుద్ది మరీ చెప్పారు గనుక వారిద్దర్నీ ఒకటి చేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. సంబంధం కలుపుకోవడానికి సమ్మతించారు. అంతేకాదు, పిల్లల అభిప్రాయాలు మారిపోకుండానే నాలుగు అక్షింతలు వేసేయాలని తొందరపడ్డారు.
“మీకెప్పుడు సెలవు దొరుకుతుందో చెబితే ఆ రోజుల్లోనే ముహూర్తాలు పెట్టించేస్తాం “ అన్నారు.
అదిగో అప్పుడు చిన్న సైజు బాంబు పేల్చింది సీత. .
ముందు జాగ్రత్తగా , పెళ్లి సంప్రదాయప్రకారం జరిగేట్లు చూస్తాననీ , అందుకు పూర్తిగా సహకారిస్తాననీ రామారావు దగ్గర్నుంచి మాట తీసుకుంది సీత.
దానికి కొనసాగింపుగా అంది “నా కన్నవాళ్ళు, రామారావు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి!”
రామారావే కాదు , ఆమెను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ తాతయ్య కూడా కంగారు పడ్డారు. ఇక రామారావు తల్లిదండ్రులు సరేసరి. భయభ్రాంతులై చూసారు. ఆపైన గుటకలు మింగారు.
“ ఇది అసాధ్యం. మీ నాన్నా మీ అమ్మా ఎప్పుడో విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ వేరే వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు .
ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి కలిసి పీటల మీద కూర్చుని ఎలా కన్యాదానం చేస్తారు? అబ్సర్డ్!”
“పెళ్లి ఎలా జరిగినా పెళ్లే. పెళ్లి జరగడం ముఖ్యం గాని సంప్రదాయాలు కాదుగా!”
నచ్చచెప్పడానికి ప్రయత్నించారు కానీ సీత వినలేదు. తన పట్టు కించిత్తు సడలించదానికీ సిద్ధంగా లేదు .
“మా పెళ్లి 100% సంప్రదాయబధ్ధంగానే జరగాలి. పెళ్లి జీవితంలో ఒకేసారి వచ్చే అత్యద్భుత ఘట్టం” అంటూ మొండికేసింది. అలా జరక్కపోతే అసలు పెళ్లే చేసుకోనని కుండ బద్దలు కొట్టేసింది.
దిక్కూ దరీ కనిపించక తల్లడిల్లిపోయారు తప్ప ‘మీ పెళ్లి మా చావుకు వచ్చింది ‘ అనలేదు. అనుకోలేదు!
కొందరు బంధుమిత్రులను తీసుకెళ్లి సీత అమ్మగార్ని కలిశారు. “ ఇది నీ కన్నబిడ్డ పెళ్లి . నువ్వు దగ్గరుండి కన్యాదానం చేయటం సంప్రదాయం. అది నువ్వు నిర్వర్తించాల్సిన ధర్మం” అన్నారు.
“అది నిజమే కావచ్చు. కానీ నా మాజీ మొగుడితో కలిసి ఒకే పీట మీద కూర్చుని ఎలా కన్యాదానం చేయగలను? ఇది అన్యాయం. అధర్మం. అసాధ్యం . మా ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారో నాకెన్ని సమస్యలొచ్చిపడతాయో ఆలోచించండి”
ఆలోచించారు. ఆమె మాటల్లో నిజమూ నిజాయితీ వున్నాయనిపించింది .
అయినా ఆశ చావక వెళ్లి ఆమె కన్నతండ్రిని కలిశారు. అతడు పెద్దగా నవ్వేశాడు. “ నా పెళ్ళాన్ని పక్కనే ఉంచుకుని, మాజీ పెళ్ళాంతో కలిసి కన్యాదానం చేయాలా! ఇంతకంటే పెద్ద జోక్ ఉండదు. ఇలాంటి పిచ్చి ఆలోచన మీకు ఎలా వచ్చింది? దానికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండాలిగా!” అంటూ ఎగిరాడు.
అంతా తలలు బద్దలు గొట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.
రామారావు పెద్దలు, పట్టు విడవని విక్రమార్కులై సీతకు నచ్చచెప్పడానికి మరో ప్రయత్నం చేశారు.
“నీ తల్లిదండ్రులు, పెళ్లి ప్రమాణాలు మరిచిపోయి సంప్రదాయానికి భిన్నంగా విడిపోయారు. వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాంటి వారిని సంప్రదాయం పాటించమనడం పద్దతి కాదు. మర్యాద అసలే కాదు . కాలానుగుణంగా మనమూ మారుతూ మార్పులు చేసుకుంటూ ముందుకు పోవాలి. అదే ఈ కాలానికి సరిపడే పద్ధతి “ అని ఎన్నో చెప్పుకొచ్చి నచ్చచెప్పాలని చూసారు.
ఆమె ససేమిరా అంది. “ లేకపోతే నా పెళ్లి సంగతి మరిచిపోండి” అని భీష్మించింది.
‘ప్రేమ పెళ్ళిళ్ళల్లో పిల్లలు పెద్దవాళ్ళని బ్రతిమాలటం చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ మనం వాళ్ళని బతిమాలాల్సొస్తోంది కర్మ! ’ వాపోతూ తలలు పట్టుకున్నారు.
“ మన ప్రేమకన్నా, మన పెళ్లికన్నా ఆ లాంఛనం ఎక్కువా!” అని రామారావు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అయినా ఆమెదిగి రాలేదు. ఏదో ఒక బంధువుల జంట చేత కన్యాదానం చేయిస్తామన్నా రాజీపడలేదు.
“ఆ సీత పెళ్లి శివధనుస్సుతో ముడిపడితే, ఈ సీత పెళ్లి కన్యాదానంతో పీటముడి పడింది!” అనుకుని ముక్కు చీదారు.కాసేపు జుట్టు పీక్కుని ఎవరో, “ఫలానా శాస్త్రి గారిని కలవండి. శాస్త్రాలన్నీ ఔపోసన పట్టినాయన. ఏదో పనికొచ్చే,
గట్టెక్కే, గట్టి సలహా ఇవ్వకపోరు. ఆపైన మీ అదృష్టం !” అని ఓ ఉచిత సలహా పారేశారు.
తిన్నగా వెళ్లి శాస్త్రి గారి కాళ్ళ మీద పడ్డారు. విషయం సవిస్తరంగా వివరించి,” అయ్యా శాస్త్రి గారూ! మీరే ఏదో పరిష్కార మార్గం చూపించి ఆ ప్రేమికుల్ని ఒకటి చేయాలి. మమ్మల్ని ఒడ్డున పడెయ్యాలి!” అని వేడుకున్నారు.
ఆయన చిద్విలాసంగా నవ్వారు.
“కలికాలం అంటే ఇదే. రోజు రోజుకీ విడాకులు తీసుకునేవాళ్ళు ఎక్కువైపోతున్నారు . పిల్లల భవిష్యత్తు కన్నా పెద్దలకు ఈగో గొడవలు ఎక్కువైపోయాయి. సర్దుకుపోవడం అన్న మాటను జీవితాల్లోంచి పూర్తిగా తుడిచేసారు. తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమై కూర్చుంది. ఇక ముందు ముందు ఇలాంటి వంకర సంకర సమస్యలే ఎదురవుతాయి. సరే కానివ్వండి. ఈ అమ్మాయి, ఈమెను కన్నతల్లికే కాదు ఆమె రెండో భర్తకీ కూతురే అవుతుంది . అలాగే ఈమె కన్నతండ్రికే గాక సవతి తల్లికీ కూతురు అవుతుంది. అంచేత రెండు జంటలనూ పీటల మీద కూర్చోబెట్టి నలుగురి చేతా కన్యాదానం చేయించండి. సంప్రదాయం నిలుస్తుంది. అమ్మాయి కోరిక నెరవేరుతుంది . మీ బరువు దిగిపోతుంది. మీ బంధుమిత్రులకు భోజన సంతోషం దక్కుతుంది!”
ఆయన సలహా అందరికీ యమగా నచ్చేసింది. అయినా భయపడుతూ వెళ్లి సీతకు చెప్పారు. ఆమె ఎగిరి గంతేసింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
మరొక్క గంట ఆలస్యం చేయకుండా సీత కన్నవాళ్ళనీ , వారి జీవిత భాగస్వాముల్నీ కలిసి విషయం వివరించారు .
మొదట ముఖాముఖాలు చూసుకున్నా, తర్వాత సంబరంగా అంగీకరించారు.పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులు వింతగా చూస్తూంటే, రెండు జంటలూ కలిసి సీతను రామారావుకి ‘కన్యాదానం’చేశారు.
అప్పుడు సీత ఆకాశం అందినట్టు పరమానంద పడిపోయింది. అది చూసి ఆమె ఎక్కడ ‘బుల్లెట్ పెళ్ళికూతురిలా’ పెళ్లి
పీటలమీదే ఆనందనాట్యం చేసేస్తుందోనని హడలిపోయారు - అటు రామారావూ, ఇటు దగ్గరి బంధువులూ!
అందుకనే పురోహితుడికన్నా ముందే, “ మాంగల్యం తంతునానేనా .....” అని కోరస్గా చదివేస్తూ , “మమ అనవయ్యా పంతులూ “ అని చెప్పి, “భజంత్రిలూ ..!” అని గావుకేక పెట్టారు పెద్దలు!వాళ్ళు ఝామ్మంటూ అందుకున్నారు - ‘సీతమ్మ పెళ్లికూతురాయెనే..... !’
-సింహప్రసాద్