శ్లోకమాధురి: సూర్యకిరణ సందీప్తి

Advertisement
Update:2023-07-29 20:35 IST

“సంహృత్య ద్రాగ్ బహిః స్థం తిమిరకులమథాభ్యంతరం

హర్తుకామారంధ్రాలీభిర్గృహాణాముదరమనుదినం యే విశంకం వింశతిభానోస్తేsమీ హృషీకాణ్యఖిలతనుభృతాం హర్షయంతో హితేహా

హృద్రోగం సంహర్తానాం హిమమహిమాహృతో

హేమహృద్యాః కరా  నః”          

“ఏది బయట ఉన్న చీకటిని శీఘ్రంగా తొలగించి తర్వాత లోపల ఉన్న చీకటిని కూడా తొలగించాలనే కోరికతో, ప్రతిరోజు కూడా తన రంధ్రాల ద్వారా మన ఇంటి లోపలికి కూడా ఏమాత్రం బెరుకులేకుండా ప్రవేశిస్తుంటాయో , అలాంటివి, మంచు యొక్క మహిమను కూడా తీసిపారేసేవి, బంగారం రంగు వలె మెరిసిపోతూ మనోహరంగా ఉండే సూర్యకిరణాలు సమస్త ప్రాణుల ఇంద్రియాలను సంతోష పెడుతూ వారి శుభమును కోరుతూ, హితము కోరుతున్నవై మా హృద్రోగాన్ని తొలగించుగాక”

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే ప్రసిద్ధ వాక్యంలో చెప్పినట్టు ఆరోగ్యం కావాలనుకునేవారు సూర్యుణ్ణి ప్రార్థించాలి. సూర్యకిరణాలు కేవలం బయట ఉన్న చీకటినే కాక అంతరంగంలోని అంధకారాన్ని కూడా తొలగిస్తాయి. బాహ్యేంద్రియములకున్న రోగాలే కాక, లోపల ఉన్న అవయవమైన హృదయంలోని రోగాలను కూడా నశింప చేయగలవు అని కవి అభిప్రాయం.

సూర్యబింబం మధ్యలో ఒక బంగారు పురుషుని యొక్క వర్ణన మనకు ఉపనిషత్తులో లభిస్తుంది .అలా బంగారంపు రంగులో ఉండే పురుషుడు సర్వ పాపాలకు అతీతుడు. అటువంటి పురుషుని సేవించి బయట ఉన్న అజ్ఞానమే కాక లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించవలసినదిగా జగన్నాథ పండితులు ప్రార్థిస్తున్నాడు.

పై శ్లోకం జగన్నాథ పండితరాయకృత లహరీపంచకము గంగా లహరి(గంగా స్తవము)అమృతలహరి (యమునాస్తవము), సుధాలహరి (సూర్యస్తవము), లక్ష్మీలహరి (లక్ష్మీస్తవము), కరుణాలహరి (విష్ణుస్తవము)లోని సుధాలహరిలోనిది.

తెల్లవారగానే సూర్యకిరణాలు ముందు వాకిట్లోకి ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశించటం అన్నది చాలా సహజమైనది, ప్రతి నిత్యం జరిగేది. దానిని కవి ఏ విధంగా చమత్కరిస్తున్నాడంటే, సామాన్యంగా ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు ఎప్పుడూ బయటే ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. మనలోపల ఏమవుతున్నది అనే దానిపై మన దృష్టిని నిలపం , ఏ విధంగా నిర్మొహమాటంగా సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించగలుగుతున్నాయో అలా మనం మనలోపల వున్న వెలుగును మనం దర్శించాలి అని చక్కగా ప్రత్యక్ష నారాయణుడి స్వాభావికమైన చర్యతో ఉపమిస్తున్నాడు.

జ్యోతిశ్శాస్త్రం సూర్య స్థానం బలహీనంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి అని కూడా చెబుతుంది.. సూర్యుడు లేక జీవితం అసంపూర్ణం, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు జీవన ప్రదాత. సూర్యుని ఆరాధించడం వల్ల మానవులకు ఆరోగ్యం లభిస్తుంది అని  తన శారీరిక పాండురోగాన్ని తొలగించుకున్న మయూరుడి (మయూరకవి-సూర్య శతకం ) కథే తార్కాణం.

సూర్య భగవానుడిని వినమ్రంగా భక్తిశ్రద్ధలతో పూజించాలీ. సూర్యునిఆరాధించే వారికి ఎన్నడు అంధత్వము దారిద్ర్యము , దు:ఖము , శోకాలు కలుగవు అని తెలియజేశారు వ్యాసమహర్షి .

మన ఆలోచనను, చూపును లోపలికి మరలించు కొన్నామంటే అజ్ఞానాంధకారం పటాపంచలై జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది.

ఇలా సామాన్య సూత్రం ద్వారా ఆరోగ్య భక్తి ఆధ్యాత్మికతలను సరాసరిగా అర్థక్లిష్టత లేకుండా మధురంగా మేళవించాడు మన తెలుగువాడైన జగన్నాథ పండిత రాయలు.

- డా.భండారం వాణి

Tags:    
Advertisement

Similar News