"అమ్మా! రేపు రథ సప్తమి జిల్లేడు ఆకులు దొరికేయా?పంపమంటావా!? నాన్నగారు పళ్ళు తెస్తున్నారా , నేను తెప్పించి నా!? పెద్దకూతురు నవ్య ఫోన్.
"దొరికేయే! వాచ్మెన్ తెచ్చి ఇచ్చేడు" చెప్పింది జాహ్నవి. పేరు నవ్య కాని దానికన్నీ, పూర్వపు ఆచారాలు అమ్మమ్మ పోలికలు అనుకుంది జాహ్నవి.. అమ్మ అనగానే బాల్యం గుర్తుకు వస్తుంది జాహ్నవికి. పండుగ అంటే బాల్యం,బాల్యం అంటే అమ్మ జానకి గుర్తుకు రానిదెప్పుడు!!.
ధనుర్మాసం నెలపట్టడం మొదలు సాయంత్రం వాకిట్లో దట్టంగా పేడ నీళ్ళు జల్లించి పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దేది జానకి . పిల్లలూ కూడా వుండి చూసి నేర్చుకునే వాళ్ళు. ఆడపిల్లలేమో ఆవుపేడ తెప్పించి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు...అవి గోడలకు పిడకల గా కొట్టేవాళ్ళు...మధ్య కన్నం పెట్టి. దండగా గుచ్చి భోగి మంటల్లో కొన్ని, కొన్ని రథసప్తమికి, ఆ పిడకలతో జానకి సూర్యనారాయణ మూర్తికి పాలుపొగించేది.
మాఘమాసంలో వచ్చే సప్తమి రథసప్తమి. సూర్యుడు రథసంచారం మొదలుపెట్టేరోజు. ఆరోజు ఉదయమే లేచి, 7 జిల్లెడాకులతో తలమీద భుజాలమీద పెట్టుకుని రేగుపళ్ళు కూడా పెట్టి స్నానాలు చేసేవాళ్ళందరూ. ప్రత్యక్ష పరమేశ్వరుడు సూర్యభగవానుడు. అలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపం పోవడమే కాకుండా, ఆరోగ్యం చేకూరుతుంది అని నమ్మకం.
పూర్వం గూగుల్, వాట్సాప్ లు లేవేమో, పెద్ద లేమి చెపితే అవి చేసేవారు. ఇప్పుడు మీడియా వచ్చి ప్రతి పండుగ భక్తి కన్నా హంగామా ఎక్కువగా వుంటోంది. కొన్ని మంత్రాలు కూడా పిల్లకు తెలిసేవి కావు.
రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలని చెపుతారు.
* జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవి! సమస్తే సూర్య మాతృకే *
(సప్తాశ్యములు గల ఓ సప్తమీ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి, సూర్యుని తల్లివైన నీకు నమస్కారము)
జానకి మడితో తులసి కోట దగ్గర తూర్పు వేపు సూర్యకిరణాలు పడేలా ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి కుంపటి లో పిడకలతో పరమాన్నం...ఆవుపాలు బియ్యం బెల్లం, వేసి వండి, ఏడు చిక్కుడు కాయలతో రథం (చీపురు పుల్ల క్రొత్తది)చేసి చిక్కుడు ఆకుల్లో పరమాన్నం సూర్యుడు కి నివేదన చేసేది. ఆ రుచి మహాద్భుతంగా వుండేది.
రథసప్తమి కి ఇంకొక ముఖ్యమైన పూజ వుంది. అది పెళ్ళి అయిన ఆడపిల్లల చేత నోములు పట్టించడం. విఘ్నేశ్వరుడు పూజ చేసి ఏమేమి నోములు చేస్తారో ఆ కథ చదువుకుని అక్షింతలు వేసుకోవాలి. అది నాంది. 36నోముల పుస్తకాలు దొరుకుతాయి. గ్రామకుంకం, కైలాస గౌరి, నందికేశుడు, పదహారు ఫలాలు, పువ్వు,పండు నిత్యం తాంబూలం...ఇలా నోములు నోపించేవారు.
కాలక్రమేణా జీవన సరళిలో తేడాలొచ్చినా...మళ్ళీ పాత రోజులు వచ్చి, కనివిని ఎరుగని నోములు, వ్రతాలు చేసుకుంటున్నారు. పండు తాంబూలం కాకుండా వస్త్రదానం, ఖరీదైన బహుమతులు ఇచ్చి ఇలా రథసప్తమి కి నోము పట్టే వారి సంఖ్య దినదినమూ పెరిగి, విశిష్టత కూడా పెరిగిపోతోంది.
జాహ్నవి అత్తగారు ఏదీ చేయించేది కాదు. తల్లి జానకి కొడళ్ళతో అన్నీ చేయించేది. సంప్రదాయాలు తెలియజేయాలని. వదినలు నోములు నోచుకుంటుంటే ఆనందించడమే గాని, ఏదీ అడగడం గాని అత్తగారికి తెలియకుండా చేయడం గాని చేసేది కాదు జాహ్నవి. పిల్లికి బిచ్చం పెట్టకపోయినా, దానం చేయడానికి చేతులు రాకపోయినా ఇలాంటి నోములు పరమార్థం అదే అనుకుంటుంది జానకి. తన తరం ఇలా అయినా, తన కూతుర్లు కి. ఇవన్నీ తెలియాలనుకునేది. తను అదృష్టం నవ్య అమ్మమ్మ లా నోములు, పూజలు దానధర్మాలు అన్నింటా ముందే వుంటుంది.
అంతే కాకుండా తనతో పాటు జాహ్నవితోనూ అన్నీ చేయించడం మొదలు పెట్టింది. భర్త దేనికీ అభ్యంతరం చెప్పేవాడు కాదు. క్రొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోయి నట్లు పిల్లలు నవ్య,భవ్య తన అమ్మలా కనిపెట్టుకుని అన్నీ చూడడంతో క్రొత్త ఉత్సాహం తో రథసప్తమి కి ఉషారుగా అన్నీ సిద్ధం చేసుకుంటోంది. భర్త పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది జాహ్నవి.
" బజారు నుండీ ఏవో కావాలన్నావ్!? చెప్పు “అన్నాడు.
“రేపు రథసప్తమి పాలు పొంగించి, పదహారు ఫలాలు నోము, కైలాస గౌరి నోము పడతాను. పూలు, పళ్ళు,తమలపాకులతో పాటు , మూడు రకాల పళ్ళు 18 చొప్పున తీసుకురండీ ...రెండు నైవేద్యం కి 16 ఇవ్వడానికి ...పళ్ళు లిస్ట్ వ్రాసేను. ఏవి దొరికితే అవి తీసుకుని రండి” అంటూ లిస్ట్ ఇచ్చింది. జాహ్నవి లో పండుగ సంబరం,ఉత్సాహం అతనికీ ఆనందంగా అనిపించింది.
- సరస్వతి పొన్నాడ.