"ఏంది రామారావు గారు ఇయ్యాల మాంచి జోరుగా ఉన్నావ్... సర్లే ఈ సిమెంటు లోడు తీసుకెళ్లి గేటవతల షాప్ దగ్గర దించెయ్" అన్న సేటు మాటలకు సమాధానంగా ఎప్పుడూ అలవాటైన నవ్వుతో ఆ బస్తాలను రిక్షా మీదికి ఎక్కించుకుని, పరధ్యానంగా లాక్కుపోతున్నాడు రామారావు. చుట్టూ అంతా హడావిడిగా ఉంది. రైలు గేటు పడినా కూడా ఆగకుండా బండిని అష్టవంకర్లు తిప్పి గేటు కిందనుండి అటువైపుకు వెళ్లేందుకు పోటీ పడుతున్నారు అందరూ. "లాక్ డౌన్ టైం కదా! ఇంతకముందులా ఎక్కువసేపు అగాల్సిన పనిలేదు. కేవలం 10ని లేదా పావుగంట. ఆ మాత్రం కూడా ఆగలేరా? ఇప్పుడు ఒకటి కాదు రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఎదురెదుగా ఒకేసారి వెళ్తాయి. ఏమాత్రం తేడా జరిగినా శవం కూడా దొరకదు. కాస్త ఆగి గేటు తీసాకే వెళ్ళండి" అంటూ ఆ గేటుదగ్గర పనిచేసే రైల్వే వర్కర్ వాళ్ళను అరుస్తున్నాడు. కానీ అతని వాగుడు అరణ్యరోదనే అయ్యింది.
(2)
ఆయనొక ప్రయివేట్ తెలుగు టీచర్. వయస్సు 50 దాటినా చూపులకు మాత్రం ఇంకా 40 ఏళ్ల వాడిగానే కనిపిస్తాడు. పేరు రామారావు. రామారావు సర్ అంటే ఆ ప్రాంతంలో తెలియనివాళ్ళు బహు అరుదు. Lockdown వల్ల schools మూతబడి తాను కుటుంబంతో సహా వీధిన పడ్డాడు. అందరూ అయ్యో అనేవారేగాని రామారావు గారి ఆత్మాభిమానాన్ని దాటుకుని సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏదైనా పని చేద్దామన్నా కొందరేమో "అయ్యో మీరు మా పిల్లలకు పాఠాలు చెప్పిన గురువుగారు, మీతో అలా ఎలా కూలిపనులు చేయించుకుంటాము చెప్పండి!" అంటే మరికొందరు "నువ్వు చూస్తే నవనవ లాడుతున్నావ్ ఈ మోటుపనులు నీవల్ల కావయ్యా" అన్నారు. స్మార్ట్ ఫోన్లు ఉన్న ఉపాధ్యాయులు online క్లాసులపేరుతో సగం జీతమైనా పొందుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేనందువల్ల తనకు ఆ భాగ్యం కూడా లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసిన వాడు గనుక ఎదో పద్దులు రాసే ఉద్యోగం దొరికిందని ఇంట్లో చెప్పి ఇలా రిక్షా లాగుతున్నాడు తనకుటుంబాన్ని తనే పోషించుకోవలనే సంకల్పంతో.
(3)
Lockdown కాలంలో ప్రభుత్వం మీడియా సాక్షిగా పంచిన బియ్యం, రొక్కం 15వందలు, గొప్పవాళ్ళు సెల్ఫీల సాక్షిగా పంచిన కూరగాయలు, పచారి సరుకులతో కడుపులైతే నింపుకున్నారు గానీ మిగతా అవసరాలు మాత్రం అలానే ఉండిపోయాయి. దాదాపు 3నెలల తరువాత జాబ్ కి వెళ్తున్న రామారావుకు "నాన్నా నా చెప్పులు తెగిపోయి నెలరోజులు కావొస్తోంది" అని కొడుకు, "నాన్నా నాకు ఉన్న రెండుజతల బట్టలు పిగిలిపోతున్నాయి... బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది" అంటూ చిన్నకూతురు. "అమ్మ ఒక 2వేలుంటే నాన్నని సర్దమను. Lockdown పూర్తవగానే ఇచ్చేస్తాను అంటున్నారు మీ అల్లుడుగారు" అంటూ పెద్దకూతురు. ఇక మిగిలింది తన భార్య మాత్రమే. ఆమె అవసరాలేంటో భర్తగా తనకు బాగా తెలుసు. అయినా ఆమేమి అడుగుతుందో అని తనవంక చూశాడు. ఏమయ్యా! అంటూ బయటకు వచ్చిన భార్యతో "చెప్పు లక్మి నీకేం కావాలి?" అన్నాడు ఆమె గోముగా "ఆ ఏదడిగినా క్షణాల్లో తెచ్చిచ్చే మొగుడివని అన్నీ చీటీ రాసి తెస్తున్నా... చాల్లెగాని నీ సంబడం నాకేమొద్దు. ముందు కాస్త ఆ గడ్డం తీసేసి మనిషిలా కనబడు అదేచాలు" అంది ఆమె. లక్మమ్మకి చూపు సరిగా లేక పనులుచేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. నోట్లో పిప్పన్ను నిద్రకూడా పోనివ్వకపోయినా ఏవో చిట్కాలతో నెట్టుకొస్తోందే కానీ నోరుతెరిచి ఒక్క మాత్రయిన అడగలేదు. సరిగ్గా ఒక్కపూట కూడా కడుపునిండా తిని ఎరుగదు. అలాంటిది అవేమి కాకుండా తన గడ్డం అడ్డమైంది ఆమెకి. ఒక్కసారిగా నవ్వుతో కళ్ళు చెమర్చాయి తనకి. ఇంట్లోంచి బయటకు అక్కడినుండి రిక్షా అడ్డాకు వెళ్ళాడు. మొహానికి తుండు గుడ్డను మాస్క్ లా చుట్టుకుని అద్దె రిక్షా తీసుకుని బయలుదేరాడు.
(4)
మూడు రోజులనుండి రిక్షా బండి లాగుతూ రోజుకు 500 చొప్పున 1500 వందల రూపాయలు దాచాడు. ఈరోజుతో 2000 అవుతాయి. కానీ ఆ డబ్బు ఇంట్లోవాళ్ళ అవసరాలు తీర్చడానికో, అల్లుడికి ఇవ్వడానికో దాచడంలేదు. నెలక్రితం ఓ ఉపాధ్యాయ మిత్రుడివద్ద తనపేరుమీద కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాడు. అందుకోసం చేసిన అప్పుతీర్చడానికి అతనా డబ్బు దాస్తున్నాడు. ఉదయమే ఆ అప్పుకుడా తీర్చేసాడు. ఇంటిల్లిపాది తినడానికే కష్టంగా ఉన్నా కూడా అప్పుచేసి మరీ ఇన్సూరెన్స్ కట్టడానికి గల కారణం తను సహజంగా గాని, ప్రమాదవశాత్తు గాని మరణిస్తే హెల్త్ coverage 5,00,000 దాకా వస్తుందట. మన చావుని మనవారికి సొమ్ముచేసి పెట్టె విచిత్రమైన అవకాశాన్ని అందించే ఇన్సూరెన్స్ ని తలచుకుంటే రామారావుకు మహా సరదాగా ఉంటుంది. 5 లక్షలు తనాభార్యకు అందితే చాలు కుటుంబం ఒడ్డున పడుతుంది. చాలీ చాలని జీతం డబ్బులతో కుటుంబాన్ని గౌరవంగా నెట్టుకొచ్చిన తనభార్య సమర్ధతపై తనకామాత్రం నమ్మకం ఉంది.
(5)
సిమెంటు బస్తాలు వేసిన రిక్షా లాగుతూ మద్యగేటు కిందనుండి పట్టాలపైకి వచ్చాడు. అలవాటు లేని పని, విపరీతమైన ఎండ, కళ్ళు తిరుగుతున్నాయి. అప్పటికే ఒకరైలు వచ్చేసింది... రామారావు ఆ రైలు సమీపానికి వెళ్లి ఆగాడు. అంతలొకే మరో రైలు వ్యతిరేక దిశలో వచ్చేసింది. రామారావుకు ఏమి జరుగుతుందో తెలిసేలోపు రిక్షాతో పాటు రెండు రైళ్లమధ్యలో నిలిచిపోయాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు అరుస్తున్నారు. క్షణాల్లోనే రెండు రైళ్లు వెళ్లిపోయాయి. రామారావు రిక్షాను రైలు బోగీలు చాలదూరం లాక్కెళ్లి ఒదిలేసాయి. రామారావు శవం మాత్రం రక్తపు ముద్దగా, గుర్తించలేని స్థితిలో పట్టాలపై పడి ఉంది. రైలు వెళ్లిపోయింది. గేట్లు ఎత్తేసారు. అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు కంగారుగా వెళుతున్నారు. కొందరు నడిచివెళ్ళేవాళ్ళు రామారావు శవాన్ని చూస్తూ అయ్యోపాపం అనుకుంటూ ముందుకు నడుస్తున్నారు. రామరావుది హత్యేనని రైలు పట్టాలు, కాదుకాదు ఆత్మహత్య అని రామారావు శవాన్ని వాసనచూసిన కుక్క, కాదు అదో ప్రమాదం అని రామారావు రక్తంతో తడిచిన కంకర రాళ్లు తమలోతాము వాదులాడుకోసాగాయి.
-S. విద్యా సాగర్