వృద్ధాప్య నెలవులు

Advertisement
Update:2023-06-03 16:11 IST

వృద్ధాప్య నెలవులు

బంధాలు భారమై బ్రతుకు హేయమై

కన్నవారు కడుపున పుట్టినవారు

కడు  హీనంగా దీనంగా చూస్తే

వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తాయి

వృద్ధాప్యం ప్రతీ ఒక్కరినీ పలకరిస్తుంది

ఏ ఒక్కరూ మినహాయింపు కాదన్నసత్యమది

దేహమనే దేవాలయంలో తమకోసం

ఒక అశ్రువు రాల్చే వాకిలి కోసం ఎదురుచూస్తూ

కనులు నిరీక్షణలో సోలిపోతాయి

అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు

అమ్మానాన్న అక్కరలేదని ఆవలకి పారేసినా

కన్నబిడ్డల కరుణా కటాక్ష వీక్షణాలకోసం

నిరంతర నిర్వేదాపరవశులు అవుతారు

ఖండాంతరాలు మారి.. దూరాభారాలు చేరి

సంపద సృష్టిస్తూ ... మమతలులేని బిడ్డలు

మరీచికలు సృష్టిస్తారు.

ఒంటరి హృదయావేదన పంచుకునే తోడుకోసం

కలవరిస్తూ వృద్ధాశ్రమాలలోగిలి ఎదురుచూస్తుంది

కడుపుకట్టుకుని కలోగంజో తాగి పెంచినబిడ్డలు

ఆస్తులు కావాలి గానీ బాధ్యతలు వద్దన్నపుడు

పుట్టుకొస్తాయి వృద్ధాశ్రమాలు

తమముచ్చట్లు మురిపాలుచూసి మురిసిపోయిన

తలిదండ్రులకు ముదిమి వయసులో హీనంగాచూసి

సేవచేయాల్సివచ్చినపుడు తొంగిచూస్తాయి వృద్ధాశ్రమాలు

తమస్వార్థం తమ కుటుంబం చూసుకునే బిడ్డలు

తలిదండ్రులు కూడా తమవారే అని మర్చిపోవడంతో

గుర్తుకు వస్తాయి వృద్ధాశ్రమాలు

ఒకనాటికి తమ పరిస్థితి అదేనని మర్చిన ప్రబుద్దులు

రెక్కలు వచ్చాక ఎగిరి పోయిన పక్షులు...

వలస వచ్చాక తాము చేరాల్సిన గూడు అదేనని

మరిచిన వలస పక్షులు 

-రెడ్డి పద్మావతి (పార్వతీపురం)

Tags:    
Advertisement

Similar News