పల్లకిలో పెళ్లి కూతురుగా
సిగ్గు దొంతరలు ఒలికించి
వధువుగా నాఇంట
మెట్టెల సవ్వడితో అడుగిడి
పలకరింతల పులకింతల
పంట పండించిన నాడు
జీవితంలో నవవసంతం
కురిపించిన నేడు
కష్టసుఖాల కలయికలో
నా చేదోడు వాదోడు
కలకలమని గలగలమని నవ్వులు పూయించిన దేవేరి
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఏ జన్మ బంధమో
ఈ జన్మ బంధమయి మూడుముళ్లబంధంతో ఒక్కటై
నాగుండె గుసగుసలు వింటూ
నాఆశల బాసలుకంటూ
ఊహల్లో విహరించిన నాకు
ఉల్లాసాల వేదికై
కనుమరుగయిన నా కలలను
ఒడిసి పట్టుకొని
కలల వెన్నెల జలతారు పరదాలలో ఊరిగించి
కుటుంబ చుక్కానివై బిడ్డల ముద్దుమురిపాలకై
భావి భవితకు పునాది వేసి...
మనిషిగా నిలబెట్టి
అనురాగ బంధాలు పెనవేసుకున్న
మన బంధం
జన్మజన్మల బాంధవ్యం మూడుముళ్లబంధం కదా
ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధమై
పచ్చనిపందిరి జీవితoలో
పచ్చపచ్చని బ్రతుకుచందమై
కొత్తబంధాలు జతగూడి
కోటి కోర్కెల రూపమై
పసుపు పూసిన పాదాలు
నట్టింట నడయాడి
నా జీవితపు పూదోటలో
ఆకుపచ్చని నేస్తానివై
కలల రెక్కలు సాచి
బ్రతుకు బాటను వేచి
కన్న కలల రూపం నీవై ....
మెట్టెల సాక్షిగా
చిరునవ్వులతో ..
నా సతికి చితి దాకా తోడుంటా!!
- రెడ్డి పద్మావతి.
(పార్వతీపురం)