మధురము
నీ నామమే రామా
మదినిండా
నెరపుకొందు రామా
మనిషిగ మహి
వెలసిన రామా
మానవ ధర్మము
నెరపినావు రామా
మహి అసురుల
మర్ధించి నీవు రామా
మహితాత్ముడవయినావు
రామా ... !
చైత్రశుద్ధ నవమిన
వెలసిన ఓ రామా
చైతన్యమూర్తి వే
నీవు రామా
విశ్వామిత్రుని వెంట
నడచి రామా
అడవుల యాగములే
కాచినావు రామా
మిథిలా పురికి నడచి నీవు
సీతను పరిణయ మాడి రామా
సీతారాముడ వైనావు
రామా ... !
అయోధ్య ఆశల
హరివిల్లు వై రామా
ఇక్ష్వాకుల కీర్తి
నిలిపి నావు రామా
సూర్య వంశ
శౌర్యవుడవై రామా
ఇన కుల
తిలకుడవైనావు రామా
ఇల ధర్మము
నెరపిన నీవు రామా
దశరథతనయుడవై రామా
దశ దిశల మెరసినావు రామా
నీ నామ గానమున
గోపన్న రామా
రామదాసుడై
ఖ్యాతి నొందె రామా
నీ నామ కీర్తనముల
త్యాగయ్య రామా
ఇల శాశ్వత కీర్తి
నొందె రామా
నీ నామ ఫలమున
గద రామా
హనుమ చిరంజీవి
అయినాడు రామా
వెరసి నీ నామమే
మా రాతల రామా
శ్రీకారపు చుట్ట యాయె రామా !
రమ్యము
నీ నామము రామా
భవ్యము
నీ గుణములు రామా
నవ్యము
నీ నడతలు రామా
రామాయణ చరిత మాయె రామా
నీ నామ జపము చేసి
శివుడు రామా
పరమశివుడే
అయినాడు రామా
వెరసి నీ నామమే గదా
రామా
జగతికి తారక మంత్రమాయె
రామా...!
- కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి