అక్కడంతా ఖాళీయే (కవిత)

Advertisement
Update:2023-05-12 12:53 IST

నాకన్నా ముందెళ్ళిన వాళ్ళని

నేనడిగాను

అక్కడెలా ఉందని?

ఇక్కడిలాగే వెనక్కి లాగే

వాళ్ళెవరైనా ఉన్నారా అక్కడని

ముందరి కాళ్ళ బంధం వేసే

వాళ్ళెవరైనా ఉన్నారా అక్కడని

నాకన్నా ముందెళ్ళిన వాళ్ళని

నేనడిగాను

అక్కడ ఓ అమృతధార

ఆకాశం మీంచి కురుస్తుందట నిజమేనా?

అలా అలా రెక్కలొచ్చి

ఆకాశంలో స్వేచ్ఛగా

ఎగిరి పోతారటగా

ఓ వెలుగులా వెలిగి

వెలుగుల మీంచి వెన్నెలలో

స్నానమాడుతారటగా అని

నాకన్నా ముందెళ్ళిన

వాళ్ళని అడిగాను

అక్కడ ఓ నిశ్చల సత్యం నిలబడి ఉందటగా

మంచీ చెడూ ,తప్పూ ఒప్పు ల్లేని

నిష్కామ కర్మలు

ఉంటాయటకదా! అని

నాకన్నా ముందెళ్ళిన వాళ్ళని అడుగుతూనే ఉన్నాను

వాళ్ళేమీ మాట్లాడటం లేదు

నోళ్లకు కళ్ళని అతికించుకున్నారు

నే మాట్లాడేదంతా గాలిలో కలిసిపోతున్నట్లుంది.

వాళ్ళు వినబడనట్లు నటిస్తున్నారు.

లేదు లేదు

వాళ్ళు గాలిలా చరిస్తున్నారు.

కొన్ని రంగులు

కన్నుల ముందు మత్తులా జల్లుతూ.

నవ్వులు కనబడవు.

ఏడ్పులూ వినబడవు.

దారి పొడవునా

మెత్తని అభౌతికాలే.

దేన్నీ పట్టుకోలేం,

మరి దేన్నీ చుట్టుకోలేం

నాకన్నా ముందెళ్ళిన వాణ్ణొకన్ని దొరకబుచ్చుకున్నాను

ముఖమంతా పాలిపోయి

అగుపడ్డాడతడు

ఏముందక్కడ? అని ఆదుర్దాగా ప్రశ్నించాను

అదో లోకం....

అక్కడంతా ఖాళీయే....

అన్నాడతడు అభావంగా.

- రాజేశ్వరరావు లేదాళ్ళ

(లక్షెట్టిపేట)

Tags:    
Advertisement

Similar News