జూన్ 24వ తేదీకి పుల్లెల శ్రీరామచంద్రుడుగారు కన్ను మూసి తొమ్మిదేళ్లు అయిపోయాయి . ఒక్క చేతిమీదుగా ఆయన సంస్కృత విజ్ఞానాన్ని పదిమందికి బోధపడే తెలుగులో వ్యాఖ్యానించి మనకిచ్చారు. ఇది చిన్న పని కాదు. ఆయన రాసిన దాదాపు రెండు వందల పుస్తకాలలో అలంకారశాస్త్రం, వ్యాకరణశాస్త్రం, వేదాంతం, ధర్మశాస్త్ర గ్రంథాలు, దాదాపుగా అన్నీ వున్నాయి. భరతుడి నాట్యశాస్త్రం పరమ ప్రామాణికంగా మూలంతో సహా చక్కని వివరణతో మనకందించారు ఆయన. అభినవగుప్తుడి వ్యాఖ్యానంతో కూడిన ఆనందవర్ధుని ధ్వన్యాలోకం ఆయనవల్లే సుష్టుగా మనకందింది. దండి కావ్యాదర్శం, భామహుడి కావ్యాలంకారం, వామనుడి అలంకారసూత్రవృత్తి, కుంతకుడి వక్రోక్తి జీవితం, మమ్మటుడి కావ్యాదర్శం, రాజశేఖరుడి కావ్యమీమాంస ఇవన్నీ ఆయన చేతి చలవ వల్లే మనకు వచ్చాయి. ప్రధానమైన శాస్త్ర గ్రంథాలలో కౌటిల్యుడి అర్థశాస్త్రం ఆయన సాధికారంగా తెనిగించారు.
ఆయన రాసిన గ్రంథాలన్నీ అచ్చుతప్పులు లేకుండా చక్కగా అచ్చయ్యాయి. వాటికి ఆయన రాసిన ఉపోద్ఘాతాలు, చేసిన వ్యాఖ్యలు ఇటు ఆధునిక రచనా సంప్రదాయల్ని, ప్రాచీన శాస్త్ర సంప్రదాయాలని రెంటినీ సమర్ధంగా అనుసరిస్తాయి. సమాచారాన్ని బాధ్యతగా ఇవ్వటం లోను, అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పటం లోను ఆయన మార్గం నాకు తెలిసినంతలో ఎవరూ అనుసరించలేదు. వ్యాఖ్యానం రాసేటప్పుడు, పుస్తకానికి ఉపోద్ఘాతం రాసేటప్పుడు ఆయన క్లిష్టమైన శాస్త్ర విషయాలని స్పష్టమైన వచనంలో చెప్పగలిగే వారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే ఆయన అభినవగుప్తుడి వంటి పరమ ప్రామాణికుడైన సాహిత్యశాస్త్ర నిర్మాతని కూడా నిస్సందేహంగా కాదనగలిగేవారు. మమ్మటుడి కావ్యప్రకాశకి ఆయన రాసిన ఉపోద్ఘాతం ఎన్ని సార్లు చదివినా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే వుంటాయి.
జగన్నాథపండితరాయల మీద ఆయన ఇంగ్లీషులో రాసిన రెండు భాగాల మహాగ్రంథం ఆయనకి అటు జగన్నాథ పండితుడి మీద, ఇటు సర్వ అలంకారశాస్త్రం మీద ఆయనకున్న అధికారానికి ఒక చిన్న ప్రదర్శన. ఆయన రాసిన ప్రతి శాస్త్ర గ్రంథం లోను తాను స్వతంత్రంగా ప్రతిపాదించిన కొత్త సమన్వయాలు, తనకన్నా ముందు గొప్ప వాళ్లయిన వారి అభిప్రాయాలతో సున్నితంగా, అయినా స్పష్టంగా నిష్కర్షగా చెప్తూ విభేదిస్తూ రాసిన విశేషాలూ, ఈ వ్యాసంలో వివరించడానికి వీల్లేనంత పెద్దవి. బ్రహ్మసూత్ర శాంకరభాష్యం వేదాంత విదులకి తప్ప ఇతరులకి బోధపడటానికి వీలులేనంత గహనమైనదైనా, ఆయన వ్యాఖానం తోడు తీసుకుని కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే నాలాంటివాళ్లకి కూడా బోధపడుతుంది.
సంస్కృత గ్రంథాలు, వాటి సమయ సందర్భాలు తెలియని అజ్ఞానం కారణం గానూ, భారత దేశానికి పాశ్చాత్య ప్రపంచం కన్నా గొప్ప నాగరికత వున్నదని అంగీకరించడానికి తమ నాగరికతా గర్వం అడ్డు రావడం కారణం గానూ, కొందరు పాశ్చాత్యులు చేసిన దుర్వ్యాఖ్యానాలని సహేతుకంగా కాదనగలగడం శ్రీరామచంద్రుడుగారు చేసిన మహోపకారం. ఈ పని, భారత దేశంలో ప్రతిదీ గొప్పది, పాశ్చాత్యమైనది ప్రతిదీ చెడ్దది అనే చెక్కపడి పద్ధతిలో కాకుండా, సహేతుకంగా, సున్నితంగా చెయ్యడం ఆయన ప్రత్యేకత. దీనికి తోడు ఆధునికులమని చెప్పుకునే భారతీయులు కూడా పాశ్చాత్య ప్రభావంలో పడి సంస్కృత గ్రంథాలని తప్పుగా అర్థం చేసుకోవడం ఆయన గమనించారు. భారతీయ వ్యాఖ్యాతల చేతిలోనే సంస్కృత గ్రంథాలు దెబ్బ తినడం చూసి, ఆయన ఆ లోపాలని నెమ్మదిగా సరిదిద్దారు. వలసవాద ప్రభావం మన మీద ఎంత గాఢంగా వుందో ఆయనకి నిజంగా అర్థం అయింది.
కౌటిల్యుడి అర్థశాస్త్రం పేరు చెప్పగానే 15వ శతబ్దిలో మాకియవిల్లి రాసిన ‘ది ప్రిన్స్ ‘అనే రాజనీతి గ్రంథాన్ని పోలిక తెస్తారు. మాకియవిల్లికీ కౌటిల్యుడికీ పోలిక లేదని చక్కని ఉపపత్తులతో నిరుపించారు శ్రీరామచంద్రుడు.
మానవుడెప్ప్పుడూ స్వార్థపరుడే అనీ, ఎప్పుడు తన లాభం కోసమే ప్రయత్నిస్తూంటాడనీ, వంచన, కృతఘ్నత, పిరికితనం, దురాశ, మానవుడి సహజ లక్షణాలనీ, అవసరం కొసమే మంచితనం చూపిస్తూంటాడనీ, రాజు ఎప్పుడూ ప్రజల్ని భయపెట్టి పరిపాలించాలనీ మాకియవిల్లి రాశాడు. ఇలాటి నిరాశావాదం కౌటిల్యుడిలో లేదనీ, కౌటిల్యుడిలో ధర్మం వ్యక్తిలో వున్న మంచిని పెంపొదించేది అనీ శ్రీరామచంద్రుడు గారు వివరించారు.
ఆయన పరమ సంప్రదాయజ్ఞుడు, అయినా సంప్రదాయనికి దాసుడు కాదు. పరమ ఆధునికుడు, అలా అని ఆధునికతావ్యామోహితుడు కాదు. ఇటు కావ్య స్వారస్యాన్ని వ్యాఖ్యానించగల శక్తీ, అటు తర్కకర్కశమైన శాస్త్ర విషయాల్ని ప్రపంచించగల సామర్ధ్యమూ, అన్నిటికన్నా మించి అచ్చమైన, అందమైన తెలుగు వాక్యాలు రాయగల రచనా ప్రావీణ్యమూ, ఇవన్నీ కలిసిన ఒక మహావ్యక్తి శ్రీరామచంద్రుడుగారు.
ఇంత చేసి కూడా ఆయన ప్రతి పుస్తకంలోను దేవతల అనుగ్రహము, తల్లిదండ్రుల తపస్సు, తన గురువుల కృప ఇవే తన పుస్తకాలకి కర్తలనీ తాను కేవలం ఉపకరణం మాత్రమే అని సవినయంగా చెప్పుకోగల మహానుభావుడాయన.
ఆయన తెలుగువాడై పుట్టడం మన గొప్ప. ఆయన గొప్పతనాన్ని సంపూర్ణంగా బోధపరుచుకుని, ఆయన్ని ఇంకా ఎక్కువ గౌరవించ లేకపోవడం మన లోపం.
తొమ్మిదవ వర్థంతి సందర్భంగా వారి స్మృతిలో నివాళి .
వెల్చేరునారాయణరావు