"నేనంటే, నువ్వు, నేను, వాడూ,
నా గొడవ మనస్థితి వైనం.
నేనంటే భారత పౌరుడు
నా గొడవ ఆ పౌరుని మనఃస్థితి, నేనంటే ఒక ఓటరు.
నా గొడవ ఓటరు మనఃస్థితి,
నేనంటే ఒక తిరుగుబాటు దారు,
నా గొడవ మన తిరుగుబాటు"
- అని కాళోజీ తన నా గొడవలో చెప్పుకున్నట్లు,ఆ నేను లేదా పౌరుని తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ, పౌరుని ఆయా కాలాల్లోని మనఃస్థితిని, ఆయా కాలాల్లో వివరిస్తూ తన జీవితకాలమంతా, పౌరుని గొడవను తన గొడవగా వివరించిన సామాన్య మానవుని లేదా పౌరుని తరఫున పోరాటం చేసిన ప్రజా వకీలు కాళోజీ నారాయణ రావు .అందుకే కాళోజీ ప్రజాకవి !
ఆనాడు హైద్రాబాదు సంస్థానం లోని మహారాష్ట్ర ప్రాంతం నుంచి, చౌథ్ వసూలు చేయడం కోసం నిజాంచే నియమింపబడ్డ మహారాష్ట్ర కుటుంబాలు కొన్ని ఉద్యోగ రీత్యా తెలంగాణాలో స్థిరపడ్డాయి. అట్లా స్థిరపడ్డ వాళ్ళల్లో కాళోజీ కుటుంబం ఒకటి . అసలు వాళ్ళ ఇంటి పేరు కాలే - జీ పోయి పోయి కాళోజీ అయింది .
1914, హైదరాబాదు సరిహద్దులోని బీజాపూరు జిల్లాలోని రట్టహళ్ళలో అమ్మమ్మగారింట్లో కర్ణాటకలో సెప్టెంబర్ 9 వ తేదీన కాళోజి పుట్టారు. తల్లిదండ్రులు: రమాబాయమ్మ, రంగారావు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాస్ రాంరాజా కాళోజీ.
మడికొండ,వరంగల్లు,హైద్రాబాదుల్లో విద్యాభ్యాసం చేసి,వకాలతు పాసై,సర్కారు కోర్టులో కంటే, ప్రజాకోర్టుల్లోనే ప్రజల తరఫున ప్రాక్టీసు చేసారు. తండ్రి ద్వారా
ఉర్దూ సాహిత్యంతో పాటు జీవితంలో క్రమశిక్షణ, తల్లి చిన్నపుడు చెప్పిన ప్రహ్లాదచరిత్ర ద్వారా, అధికార దుర్మదాంధతను ఎదుర్కోవడంలో ఆసక్తి ఏర్పడితే, వానమామలై సోదరులు,అన్న రామేశ్వరరావు, పల్లాదుర్గయ్య, బిరుదురాజు రామరాజు వంటి సాయితగాండ్ల ద్వారా తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడ్డాయి.
ఈ లక్షణమే తాను చదువుకునే రోజుల్లో ప్రతి ఏటా వచ్చే గణేశ ఉత్సవాలకు ఇచ్చే సెలవు ఇవ్వకపోవటంతో 1600 మంది విద్యార్థులతో తిరుగుబాటుకు నాయకత్వం వహించేటట్టు చేసింది. అధికారుల ఏకపక్ష చర్యలను, అదీ ప్రజలకు వ్యతిరేకమైతే తప్పనిసరిగా వ్యతిరేకించే,నిరసించే, ప్రశ్నించే తత్త్వం అలవాటైంది.
తెలంగాణకు కోడి పుంజై వెలుగు జాడ జూపిన సురవరం ప్రతాపరెడ్డి పత్రిక గోల్కొండలో తొట్టతొలి కవిత్వం రా సారు కాళోజీ."నా గొడవ" ప్రకటించ నాందియైన వారు అని సురవరంను స్మరించారు కాళోజీ.
కాళోజీ బతుకంతా తెలంగాణ లోపటి సాహిత్య , సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలన్నిటి తోటి ముడిపడి వున్నది.వారిని ఉదహరించకుండ తెలంగాణ సాహిత్య,సామాజిక చరిత్ర లేదంటే అతిశయోక్తి కాదు.
అయితే వారు ఏమంటారంటే" నేను ఏ ఉద్యమానికి నాయకుణ్ణి కాదు. ఉద్యమాల వల్ల పాల్గొన్న ప్రజలతో పాటు ఒకడిని .నేను ఎవరికి నాయకుణ్ణి కాదు. "
"అవనిపై జరిగేటి
అవకతవకలు జూచి,
ఎందుకో నా హృదిని
ఇన్ని ఆవేదనలు,
పరుల కష్టము జూచి,
కరిగిపోయెను గుండె,
పతిత మానవు జూచి,
చితికిపోవును మనసు,
పరుల కష్టాలతో
పనియేమి మాకనెడి
అన్యులను జూచైన
హాయిగా మనలేను"
అని, కాళోజీ చెప్పుకున్నారు నా గొడవలో.
ఓ తీరుగ జూస్తే అది వారి ఫిలాసఫీ.1946లోనే కాళోజీ రైతేరాజు అన్నారు. రైతుగనక లేకపోతే సమాజంలోని ఏ వర్గం ప్రజలు గూడ బతుక లేరు అని కర్షకుని కర్రు కదిలినన్నాళ్ళే అన్న గేయంలో పేర్కొన్నారు
తన కవిత్వాన్ని కాళోజీ సామాన్య ప్రజలనుద్దేశించి "పది వుపన్యాసాలు చేయలేని పని ఒక వ్యాసం చేస్తది. పది వ్యాసాలు చేయలేని పని ఒక కథ చేస్తది. పది కథలు చేయలేని పని ఒక కవిత చేస్తది. పది కవితలు చేయలేని పని ఒక పాట చేస్తది . అందుకే నేను నా గొడవ రూపంలో కవిత్వాన్ని నా భావజాల వ్యాప్తికి ఎన్నుకున్న"అన్నారు
కాళోజీ ఉపన్యాసం రీతిగానే వారి కవిత్వం ఉండేది. ప్రజలకు దగ్గర కావటానికి అది వారికి ఒక సామాజిక వాహిక.వేమన చెప్పినట్లు సామాజిక వ్యత్యాసాలను చాలా అలవోకగా కవిత్వంలో చెప్పారు .
ఒకరు తన అవసరాల కంటే ఎక్కువ సంపాదించి పెట్టుకుంటే సామాన్యునికి అందుబాటులోనికి రాక ,వాని అవసరాలు ఎలా తీరుతాయి.
"అన్నపు రాసులు ఒకచోట –
ఆకలి మంటలు ఒకచోట
సంపదలన్ని ఒకచోట-
గంపెడు బలిగం ఒకచోట"
అన్న ఈ సంగతిని ఎంత అలవోకగా చెబుతారంటే
"కమ్మని చకినాలొక చోట -
గట్టి దవడలు ఇంకొక చోట" అని.
కాళోజీ భాష, సామాన్యుని భాష. "మనం ఏం చెప్తున్నామో, ఎవనికోసం చెబ్తున్నమో , వానికి తెల్వాలే గద , తెలిస్తేగద వారు ఆచరణలో పెడ్డారు. వాని బాసల , యాసల చెప్తే వానికి తెలుస్తది "అనేది కాళోజీ మాట .
అన్ని సంఘటనలకు స్పందించారు కాళోజీ.ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా కాళోజీకి కంటినిండా నీళ్ళే. అసలు మనిషిలో అశ్రువులే లేకపోతే వారు మనిషే కాడంటారు కాళోజీ .
"ఆశ్రువులు లేనట్టి
అసువులేలా నాకు
కన్నీళ్ళు నన్నెపుడు
ఆదుకుని వుండాలె"
అన్నారు .కాళోజీ కవిత్వంలో నిత్యసత్యాలు అనదగ్గ పంక్తులు చాలా ఉంటాయి. వేమన, కబీర్ చెప్పినట్లు సామెతలవలె మరల మరల చెప్పేటట్టుంటాయి.
"సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటెచావు.
బ్రతుకు పోరాటము-
పడకు ఆరాటము".
ప్రజాస్వామ్యం లోపల ప్రజలే గొప్ప , సామాన్య ప్రజలకు కావల్సిందల్లా లేదా తీరవలసిందల్లా కూటి సమస్య, గూటి సమస్య, గూటి లోపలి గువ్వల జంటి సమస్య.ఈ సమస్య తీరందే కర్మయోగం, గీతా బోధలు దండుగ.
"గంటములెన్నో అరిగెను
కంటకాలు మాత్రం తరగలేదు.
లోకం తంటాలు తీరలేదు"
అని కాళోజీ బాధపడ్డారు
సామాన్యుని బ్రతుకు బాగుపడాలి అన్న కాళోజీకి మనిషి తర్వాత మనిషి బ్రతుకంటే గొప్ప విశ్వాసం. వారు అంటారు
"బతుకు తప్పదు
బతక్క తప్పదు.
శాస్త్రం తప్పుతుంది.
ధర్మం తప్పుతుంది.
న్యాయం తప్పుతుంది
గాని బతుకు తప్పదు,
బ్రతక్క తప్పదు"
అన్నది కాళోజీ మాట.
కాళోజీ ఎక్కడున్నా ,ఏం చేసినా ప్రజల మనిషి , ప్రజల గొడవే కాళోజీ గొడవ. వారి కవిత్వంలోని ప్రతి పేజీ అందుకు ఉదాహరణ . ప్రజల సమస్యలే ఆయన్ను కవిగా చేసాయి ప్రజల భాషలో ప్రజల హృదయాలను ప్రదర్శించిన అచ్చమైన తెలుగు , తెలంగాణ కవి కాళోజీ .
1969లో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అంతా కలయ తిరిగారు కవిత్వం చెప్పారు .తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కాళోజీ ప్రస్తావన లేకుండా ఏ సభ, ఏ ఉపన్యాసం లేదంటే అతిశయోక్తి లేదు.
తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆశీస్సులు పుష్కలంగా ఉండేవి భాష విషయంలో కాళోజీకి నిర్దిష్టమైన దృక్పథం ఉన్నది."బడి పలుకుల భాష గాక పలుకుబళ్ళ భాష గావలె " అన్నారు
."పుటుక నీది చావు నీది, బతుకంతా దేశానిది" అని లోకనాయక్ జయప్రకాశ్ గురించి కాళోజీ గురించి రాసింది ఆయన జీవితానికి కూడా వర్తించే సత్యమే.
ఖలీల్ జీబ్రాన్ 'ద ప్రాఫెట్ 'లో ఆల్ ముస్తఫను తానుండిన కాలానికి తానె ఉషస్సయిన వారు అంటారు . కాళోజీ గురించి ఎంత చెప్పినా వొడవని ముచ్చట. కాళోజీ నిరంతరం ప్రజల నాల్కల మీద నడయాడుతూ వాళ్ల మనస్సుల్లో చిరంజీవి అయ్యారు
2002 నవంబరు 13న వారు కాలం చేసే వరకు అవిచ్ఛిన్నంగా ఆయన కవితాధార సాగింది.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆయన పేరు మీద ఒక సాహితీ పురస్కారం ప్రతి ఏటా ఇచ్చే ఏర్పాటు చేయడమే కాక,ఆయన జన్మదినం అయిన సెప్టెంబర్ 9ని "తెలంగాణ భాషా దినోత్సవం" గా అధికారికంగా ప్రకటించింది. వరంగల్ లో కాళోజీ పేరిట ఆడిటోరియంవుంది
కాళోజీ కొన్ని కవితా పంక్తులు:
"అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తిప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు...."
"ఏ భాషనీది
ఏమి వేషమురా?
ఈ భాష ఈ వేష
మెవరికోసమురా ?
ఆంగ్లమందున మాటలాడ గలుగగనే
ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా ? ........."
"అన్య భాషలు నేర్చి
ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా ?"
"నా గొడవ" కవితా సంపుటి నేటి తరం తప్పకుండా చదివి తెలుసుకొదగ్గ అపురూప గ్రంథం!
_____
(ఆకరం :
తెలంగాణ ప్రభుత్వం
భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన
"తెలంగాణ తేజోమూర్తులు"
గ్రంథం )
కాళోజీ నారాయణరావు -తేజోమూర్తి