సాయంత్రం కొలువు నించి ఇంటికి వచ్చిన శ్రీధర్ కి అతని తమ్ముడి వ్రాసిన ఉత్తరాన్ని అందించింది భార్య సుధ.
ప్రసాద్ సోమవారం ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ కి తాను వస్తున్నట్లు, వీలయితే స్టేషన్ కి రమ్మంటూ వ్రాశాడు. చాలా ఏళ్ల తరువాత వస్తున్న తమ్ముడి రాక ఆనందాన్ని కలిగించినా అంత ప్రొద్దున్నే లేచి స్టేషనుకి టైమ్ కి వెళ్ళగలనా అన్న సందిగ్ధంలో పడ్డాడు శ్రీధర్!
అసలే తనకు మతిమరపు! దానికి తోడు కంగారు! అందుకే ఉత్తరం వచ్చిన దగ్గర్నుంచీ ప్రతిరోజూ తనని టైమ్ కి లేపమనీ, గుర్తు చేయమనీ భార్యకు చెప్పేవాడు!
_
అనుకున్న రోజు రానే వచ్చింది.
సుధ తెల్లవారు ఝామున నాలుగు గంటలకే అలారం పెట్టింది!
అలారం కొట్టిన గంటకి లేపగా లేపగా గబగబా లేచి ఆదరా బాదరాగా బట్టలేసుకుని తన మోటార్ బైక్ మీద స్టేషన్ కి బయల్దేరాడు శ్రీధర్!
తన కంగారుకి తగ్గట్టు రైలు ఒక గంటలేటుగా వస్తున్నట్లు స్టేషనుకి చేరాక తెలిసింది!
కొంచెం కుదు టపడ్డాడు. ఈ గంటసేపు ఎలా గడపాలో అర్థం కాలేదు. రెండు సార్లు టీ తాగాడు! పుస్తకాల షాపు దగ్గరకి చేరి కాస్సేపు దినపత్రికలు తిరగేసాడు. వేచి చూడటం అంటే పరమ చిరాకు శ్రీధర్ కి. దానికి తోడు అవిశ్రాంతంగా కారుతున్న నాసిక! దానితో ముక్కుని పదే పదే తుడుచుకోవాల్సి వస్తోంది!
ఇంతలో రావాల్సిన రైలు ప్లాట్ఫారం మీదకి రానే వచ్చింది. ప్రసాద్ వ్రాసిన వివరాలని గుర్తు తెచ్చుకుని అతను దిగాల్సిన బోగి దగ్గర నిలబడ్డాడు శ్రీధర్.
అప్పటికే తమ్ముడు ప్రసాద్ తన సామాను దించుకుంటూ కనబడ్డాడు.చాలా కాలం తర్వాత కలిసిన అన్నదమ్ములు అది స్టేషన్ అన్న సంగతి కూడా మరిచిపోయి ఒకళ్ళనొకళ్ళు గాఢంగా
కౌగి లించుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుచుకున్నారు!
సామానుతో అన్నదమ్ములు ఇద్దరూ స్టేషన్ బయటికి బయల్దేరారు! ముందుగా ప్రసాదు గేట్ దగ్గర టికెట్ చూపించి బయటికి వెళ్ళాడు!
శ్రీధర్ కి గేట్ దగ్గర టి.సి టికెట్ చూపించమని అడిగేటప్పటికి కంగారు మొదలైంది! జేబులన్నీ వెతికాడు!
ఎక్కడా కనిపించలేదు! అసలు కొన్నాడో లేదో గుర్తు లేదు .లేదా బహుశా రుమాలు పదేపదే బయటికి తీస్తుoడగా ఎక్కడో క్రింద పడిపోయి ఉంటుంది. ఎంతగా వెతికినా దొరకలేదు.
మళ్లీ జేబులన్నీ వెతుక్కున్నాడు.
చొక్కా పైజేబులో ఒక టికెట్ దొరికింది, అది తీసి టి.సి కి ఇచ్చాడు. టి.సి దాన్ని అటూ ఇటూగా తిప్పి చూసాడు! అది ప్లాట్ఫాం టికెట్ కాదు. రెస్ట్ రూంలో బరువు తెలిపే మెషీన్ ఇచ్చిన టికెట్!
టీ.సి దాన్ని గుర్తించి తిరస్కరిస్తూ శ్రీధర్ ని ప్లాట్ఫారం టిక్కెట్ ఎక్కడ అని గద్దించి అడిగాడు!
మీరు అసలు రిసీవ్ చేసుకోడానికి వచ్చారా లేక ప్రయాణం చేసి వస్తున్నారా ?ట్రైన్లో టికెట్ లేకుండా ప్రయాణo చేయడం నేరమని తెలీదా! అని అడిగాడు! టికెట్ లేకపోతే 500
రూపాయలు ఫైన్ కట్టాలి, కట్టండి! లేకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది! అని శ్రీధర్ని హెచ్చరించాడు.
శ్రీధర్ కి వొళ్ళoతా చెమటలు పట్టడం మొదలయ్యింది! జేబులో ఏభై రూపాయిలు మాత్రమే ఉన్నాయి! తమ్ముడేమో బయట ఉన్నాడు,
ఎలారా బాబూ అనుకుంటూ వుండగా తమ్ముడు గేట్ దగ్గరకి వచ్చి తన జేబులోంచి 500 రూపాయలు తీసి టీ.సి కి ఇచ్చాడు. అమ్మయ్య బ్రతికిపోయాను అనుకుంటూ తమ్ముడితో బయటికి వచ్చాడు శ్రీధర్!
"ప్లాట్ఫారం టికటే కదా లేకపోయినా పర్లేదనుకుంటే వెధవది పది రూపాయలతో పోయేది ఐదువందలు వదిలేయి! ఖర్మరా బాబూ "అనుకుంటూ గట్టిగా అరిచాడు శ్రీధర్!
శ్రీధర్ ఆరుపుని విని పక్కనే పడుకున్న సుధ గాభరాగా లేచి
భర్తని కుదిపి కుదిపి నిద్రలోంచి లేపి, 'ఏంటి అలా అరిచారు, పీడ కలగాని వచ్చిందా' అని అడిగింది.
శ్రీధర నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి స్టేషన్ కు వెళ్ళడానికి ఇంకా టైమ్ కాలేదని ఇదంతా కలేనని తెలుసుకొని స్థిమిత పడ్డాడు.
హ్యాపీ గా అనిపించింది శ్రీధర్ కి! అమ్మయ్య ఇంక ఏం ఫర్వాలేదు!
స్టేషన్ కు వెళ్ళగానే ముందు ప్లాట్ ఫారం టికెట్ కొనడం మరిచిపోకూడదు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి ! 'అంతా ఆ దేముడి దయ' అనుకుంటూ లేవడానికి ఇంకా టైముంది అలారం కొడుతోంది అని నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు!
- శ్రీమతి చెళ్ళపిళ్ళ వెంకట రమణ