నాన్నతో నేను

Advertisement
Update:2022-12-24 15:18 IST

నాన్నతో నేను

"ప్లీజ్ నాన్నా.. నేను మీ మాట వినడం కాదు.. మీరే

నా మాట వినండి.. నా నిర్ణయాన్ని తప్పు పట్టకండి

అమ్మతో చర్చించటం అంటూ ఏమీలేదు..అమ్మా మీరు సరే అనండి అంతే.. నాకు కోడలికి బిజీ వర్క్స్ ఉన్నాయి.. మళ్లీ కాల్ చేస్తాను.. ఉంటాను నాన్నా"

అమెరికా నుండి మా అబ్బాయి చెప్పిన నిర్ణయానికి ఆలోచనలో పడిపోయాను నేను. నాకు మా నాన్నగారు గుర్తుకువచ్చారు.

* *

నాది డిగ్రీ అయింది పై చదువులు చదవటం నాన్నకు ఇష్టంలేదు..బ్యాంక్ జాబ్ చేయాలన్న నా కోరిక అణగారిపోయింది..

"నాన్నా..రాజన్నా.. నేను పై చదువులు వద్దన్నానని

బాధపడకు. అమ్మ ఆరోగ్యం నా ఆరోగ్యం అంతంత

మాత్రమే.. ఇంత వ్యవసాయం నా ఒక్కడి వల్ల కాదు..మనం మొదటినుంచీ వ్యవసాయాన్ని నమ్ముకున్నవాళ్లం..ఏ ఉద్యోగం చేసినా పంట పండించే రైతే కదా ముఖ్యం..ఒక్కగానొక్క కొడుకువి.. మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళకురా మేం ఉండలేము" నాన్న మాటలకు ఎదురు చెప్పలేకపోయాను.. చెల్లెలు పార్వతి డిగ్రీ చేయటంతోనే పెళ్లయిపోయింది. నాన్న కోసం వ్యవసాయాన్నే నా వృత్తిగా తీసుకున్నాను. ఒకరోజు నాన్న నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు.

"పై చదువులు ఉద్యోగం వద్దన్నానని బాధపడుతున్నావా? అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు..ఉన్న ఒక్క అన్నయ్యకూడా చనిపోయాడు..ఆ అన్నయ్య పేరు నీకు పెట్టుకొని రాజన్నా అంటూ ప్రేమగా పిలుచుకుంటూ

అన్నయ్య నాతోనే వున్నాడు అనుకుంటున్నాను

మాకు ఎవరూ తోడులేనట్లు ఒంటరిగా

బ్రతుకుతున్నామన్న ఆలోచనే మాకు రానీయకు. అమ్మ కూడా నిన్ను వదిలి వుండలేదురా" అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు నాన్న..నాన్నను దగ్గరకు తీసుకొని నేను ఎక్కడికీ వెళ్లనని చెప్పాను. అలా నా బ్యాంక్ జాబ్ ఆలోచన ముగిసింది.

నాకు పెళ్లయింది. నా భార్య పేరు రమాదేవి..మాది చాలా అన్యోన్యమైన దాంపత్యం. అమ్మానాన్నను దేవి ఎంతో ప్రేమగా చూసుకునేది. తనూ డిగ్రీ దాకా చదువుకోవటంతో పుట్టిన ఇద్దరు పిల్లలకు తనే తొలి గురువు అయింది. అమ్మ నాన్న ప్రతి క్షణం ఆనందిస్తూ వుంటే నేను వాళ్లకు దూరం కాకుండా వుండటం ఎంత మంచిదైంది అని ఎన్నోసార్లు అనిపించేది. పిల్లల విషయంలో నేను దేవి వాళ్లకు ఇష్టమైన చదువులు చదివించాలని అనుకున్నాము. తరతరానికి మార్పు రావటం అన్నది చాలా చాలా సహజం. పిల్లలని ఎమ్మెస్ చేసేందుకు అమెరికా పంపి వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతుంటే మేము తృప్తి చెందాం.పిల్లల పెళ్ళిళ్ళు చూడకుండానే అమ్మ నాన్న చనిపోయారు. చాలా బాధ అన్పించింది మాకు.

* *

పిల్లలిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి.. అల్లుడు కోడలు మాకు నచ్చినట్లుగానే వచ్చారు.. నలుగురూ మంచి ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇంతకంటే మేము కోరుకునే ఆనందం ఇంకేం ఉంటుంది అనుకున్నాం

మేము అమెరికా వెళ్ళటం వాళ్ళు ఇండియా రావటం జరుగుతూనే వుంది. అలా అలా కొన్ని సంవత్సరాల కాలం గడిచింది. ఎప్పటిలా ఆరోజు మా కోడలు రాగ మాట్లాడిన తర్వాత కొడుకు విశ్వ మాట్లాడాడు.

"మీతో ఒక విషయం మాట్లాడాలి.. మీరు ఒప్పుకోవాలి కాదు అనొద్దు"

"నేను ఏది కాదన్నాను నాన్నా.. మీరు ఏది కోరినా ఏది చెప్పినా సరే అనే అంటాను" అంటూ నవ్వాను.

"మేము.. చెల్లి వాళ్ళు ఇండియా వద్దామని అనుకుంటున్నాం"

"అవునా? ఎప్పుడు? వెరీ హ్యాపీ" నా ఆనందాన్ని

దాచుకోలేకపోయాను.

"అంటే.. అలా కాదు నాన్నా..పూర్తిగా వచ్చేస్తున్నాం

మేము ఇండియా రావాలని అనుకుంటున్నాం నాన్నా మేము మీ దగ్గరే ఉండాలని మా కోరిక"

"మీ ఎదుగుదలను మీ భవిష్యత్తును వదిలేసుకొని ఎందుకిలా రావటం"

"మేము బాగానే సంపాదించాం..నాకు తెలుసు మీ ఆలోచన.. మీరు పొలం ఇల్లు అమ్మి మా కోసం ఇక్కడికి రావాలనుకున్నారు..అలా మాకు అస్సలు ఇష్టంలేదు..అప్పుడు కొడుకుగా మీ అవకాశాలు త్యాగం చేసుకొని తాతగారి మాటను గౌరవించారు. ఇప్పుడు నాన్నగా మరోసారి మీఇష్టానికి వ్యతిరేకంగా అన్నీ అమ్మేసి మా దగ్గరికి రావాలని అనుకుంటున్నారు..దాని బదులు మేం వచ్చేస్తే అంతా అక్కడే వుండొచ్చు..అలా ఉండటమే మీకు కూడా సంతోషం అని మాకు తెలుసు.. మీకోరిక ప్రకారం ఇదిగో మీరు అనుకున్నట్లు ఈ స్థాయిలో ఉన్నాం..మనకు వ్యవసాయం వుంది..మా చిన్నప్పటిలా మీతో మళ్ళీ వుంటాం..ప్లీజ్..మీరు అస్సలు కాదనకండి.తాతగారి పేరు నాకు పెట్టారు విశ్వనాథం అని..నాలో తాతగారిని చూసుకోండి తాతగారు మిమ్మల్ని రాజన్న అని పిలుస్తూ మీలో వారి అన్నయ్యను చూసుకునేవారు. ఈ బంధాలు మీలా మాకూ ఎంతో ఇష్టం"

అది కాదు నాన్నా"

"ఆర్థికపరంగా ఎంతో బాగున్నాం.. సంపాదిస్తూపోతే తీరని దాహంగానే వుంటుంది. దాహం తీర్చుకోవాలి అనే తపనలో అన్ని మర్చిపోతుంటాం..మనం ఎంత

మందిని అలా చూడలేదు? నాన్నా..మనం కలిసి ఉందాం..సంతోషంగా ప్రేమగా ఉందాం..మీరు బ్యాంక్ జాబ్ చేయలేకపోయారు బాధపడ్డారు.. కానీ అమ్మ నాన్నను చూసుకుంటున్నాను అన్న ఆనందం కొన్ని వందల రెట్లు అనుభవించారు.. అన్ని నేను చెల్లి చూసాం నాన్నా..అప్పట్లో మీ పై చదువులు ఉద్యోగానికి తాతగారు మిమ్మల్ని దూరం చేసుకోలేక మీమీద వున్న ప్రేమతోనే వద్దన్నారు ఇప్పుడు అదే ప్రేమతో మేము వద్దామనుకుంటున్నాం..ఈ కొద్ది సంవత్సరాలకే మేము రాలేకపోతే ఎన్నో సంవత్సరాలు అక్కడే వున్న మీరు ఇక్కడకు వచ్చి ఎలా ఉండగలరు? విధానాలు కొంచెం తేడాగా అనిపించవచ్చు..మనమంతా ఇక్కడి కంటే అక్కడే కలిసివుంటే మీరు అమ్మ ఇంకా ఆనందంగా వుంటారు.మీరు అమ్మ మాట్లాడుకుని ఓకే చెప్పండి. మేం నలుగురం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం".

* *

తెల్లవారి రాత్రి విశ్వ నుండి ఫోన్ వచ్చింది..అప్పటికే

దేవితో విషయం చెప్పటం జరిగింది.

"నాన్నా..నా నిర్ణయానికి మీరు ఓకే కదా"

"రండి నాన్నా అంతకంటే భాగ్యం మాకేముంటుంది? మీకోసం ఎదురుచూస్తూ ఉంటాం" అలా అనకుండా వుండలేకపోయాను నేను.

-కోటమర్తి రాధా హిమబిందు

Tags:    
Advertisement

Similar News