“మెల్లగా చేయండి” అందామె.
అతడు వినలేదు.
“నాకిలాగే ఇష్టం” అన్నాడు వగరుస్తూ.
“బయట పాప ఉంది. వింటుంది”
“వింటే విననీ. నాకిలాగే చేయడం ఇష్టం అని చెప్పానా” అతని మొహంలో చిరాకు.
ఆమె ఇంకేమీ మాట్లాడ లేకపోయింది.
అతడు తన పని తనకిష్టం వచ్చినట్టు కానిచ్చేశాడు.
కాసేపటికి ఇద్దరూ అలసి సొలసి పోయారు. ఆనందపుటంచులు చూసారు.
అతడు పైకి లేచాడు. బట్టలు వేసుకున్నాడు. ఆమె కూడా లేచింది. చీర సర్దుకుంది. రేగిన జుట్టు సరిచేసుకుంది.
తలుపులు తెరిచారు. ఆమె భయపడింది. తలుపు దగ్గర పాప ఉంటుందేమో అని. కానీ లేదు. ఆమె మొహంలో సంతృప్తి.
“మళ్ళీ ఎప్పుడు?” అన్నాడు అతడు జేబులోంచి పర్సు పైకి తీస్తూ.
ఆమె మనోహరంగా నవ్వింది. చెప్పింది.
“మీ ఇష్టం”
అతడు ఇచ్చిన నోట్లు తీసుకొని జాకెట్లో పెట్టుకుంది. అతడు వెళ్ళిపోయాడు.
ఆమె పాప కోసం వెదికింది. పాప ఎక్కడా కనిపించలేదు.
“అమ్మా, పాప ఏది?” అడిగింది వాళ్ళమ్మను.
“అతడు రాగానే నేనే పాపను బయటికి పోయి ఆడుకోమన్నాను. ఎక్కడో ఉంటుందిలే” అంది ఆమె ముసలి అమ్మ.
“సరే ఆయన డబ్బులిచ్చారు. ఇంట్లోకి బియ్యం నిండుకున్నాయి. తెస్తాను” అంటూ ఆమె బయటికి వెళ్ళింది.
బయట పార్కులో ఆడుకొని పాప వచ్చింది. దాని మొహం విషాదంతో నిండిపోయింది. దాని మొహంలో ఎన్నో ప్రశ్నలు! ఎవెరెవరో తమ ఇంటికి వస్తుంటారు. ఆ సమయంలో అమ్మ కానీ, అమ్మమ్మ కానీ తనని ఇంటి దగ్గర ఉంచరు. “బయటికి పోయి ఆడుకో” అంటారు. ఎందుకో తనకి తెలియదు.
తమ ఇంటికి చుట్టాలు ఎవరూ రారు. తమకి చాలామంది చుట్టాలు ఉన్నారని అమ్మ ఎన్నో సార్లు చెప్పింది. కానీ ఒక్కరూ తమ ఇంటి గడప తొక్కరు. తను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, నాన్న బతికి ఉన్నప్పుడు అత్తయ్య, మావయ్య, పిన్ని, పెద్దమ్మ ఇంకా వాళ్ళ పిల్లలు వస్తూండేవాళ్లు. తనకి బాగా గుర్తు. తను వాళ్ళతో ఎన్నో ఆటలు ఆడేది. తన ముద్దు ముద్దు మాటలకి వాళ్లంతా పడి పడీ నవ్వే వాళ్లు.
నాన్నతో అనేవారు –
“ఒరేయ్, నీ కూతురు మంచి మాటకారి. ఇది ఇప్పుడే ఇలా మాట్లాడుతుంది అంటే, ఇక పెద్దయ్యాక ఇది ఇంకా బాగా మాట్లాడుతుంది. ఇది చాలా తెలివయిందిరా. దీన్ని బాగా చదివించరా” అంటుండేది అత్తయ్య.
నాన్న తనని చూసి గర్వంగా భుజాలెగరేసేవాడు.
“చిన్నతల్లి ఎవరనుకున్నావు? నా కూతురు. నా బంగారం!” అంటూ తనని ముద్దులతో ముంచెత్తేవాడు. తను ఎంతో సంతోష పడిపోయేది. ఆ రాత్రి తనకి సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు. నాన్న తనని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తనకి కావాల్సినవన్నీ కొనిపెట్టేవాడు.
ఒకే ఒక సంఘటనతో తమ జీవితాలే మారిపోయాయి. ఒకరోజు కూలి పనికి వెళ్లిన నాన్న లారీ కింద పడ్డాడు. చచ్చిపోయాడు. ఎప్పుడూ పండగలకు, పబ్బాలకు వచ్చే బంధువులంతా అప్పుడు కూడా వచ్చారు. నాన్నని అంగరంగ వైభవంగా స్మశానానికి తీసుకు పోయారు. అమ్మని ఆపడం ఎవరి తరం కాలేదు. గుండె బద్దలయ్యేలా ఏడ్చింది. ఏడ్చి, ఏడ్చి అమ్మ కళ్ళు ఉబ్బి పోయాయి.
కర్మకాండలు ముగిసాక బంధువులంతా వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా బంధువులు అప్పుడప్పుడు అమ్మను చూడ్డానికి వచ్చేవారు. తర్వాత అమ్మ గురించి తెలిసి రావడం పూర్తిగా మానేశారు.
అమ్మ ఏం చేస్తుందో తనకి తెలియదు. కానీ తను ఊహించగలదు. అమ్మ చేస్తుంది మంచి పని మాత్రం కాదు అని! ఎవరెవరో తమ ఇంటికి వస్తుంటారు. వాళ్ళను చూచి అమ్మ నవ్వుతుంది. అమ్మమ్మ మాత్రం అప్పుడు తనని బయటికి పంపిస్తుంది. అంటే అమ్మ చేస్తున్న పని అమ్మమ్మకి కూడా తెలుసు. అయినా అమ్మని ఏమీ అనదు. తను బయటకు వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి.
సాయంత్రం వరకు తను పార్కులోనే గడుపుతుంది. తర్వాత అమ్మ కాని అమ్మమ్మ కాని తనని వెదుక్కుంటూ వస్తారు. అంత వరకు విచారంగా ఉన్న అమ్మ మొహంలో ఆనందం కనిపిస్తుంది.
“చిన్నతల్లీ! ఈరోజు మనం కడుపు నిండా అన్నం తిందాం. ని కిష్టమైన కూరేంటో చెప్పు. బజారుకి వెళుతున్నా తెస్తాను” అంటుంది. అంటే అమ్మ చేతుల్లో ఇప్పుడు డబ్బులు గల గల మంటున్నాయి.
ఎవరో అమ్మకి ఇచ్చిన డబ్బులు!
అమ్మను చూసి ఇచ్చిన డబ్బులు!!
అమ్మ కష్టాన్ని సుఖంగా మార్చుకొని ఇచ్చిన డబ్బులు!!!
వాళ్ళిచ్చిన డబ్బులతో తమకి మూడు పూటలా, నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళతాయి. అవి అయిపోయాక మళ్ళీ పస్తులే!
అమ్మకి తమ్ముడు, తనకి మావయ్య లాంటోడు ఒకడున్నాడు. వాడే ఎవరో ఒకర్ని తెస్తుంటాడు. ఆ వచ్చేవాడు అమ్మను చూస్తాడు. బాగుందని అంటాడు. మావయ్య కి కొంత డబ్బులు దొరుకుతాయి. వాడు పోతాడు. అమ్మా అతడు ఇద్దరూ గదిలోకి దూరి తలుపు లేసుకుంటారు. మళ్ళీ ఎప్పట్లా తనకి తమ ఇంటికి దగ్గర్లో ఉన్న పార్కే గతి! అమ్మ చేస్తున్న పనులు తనకేవీ తెలియవు అనుకుంటారు అమ్మా, అమ్మమ్మ. అన్నీ కాకపోయినా తనకి కొన్నయినా తెలుస్తుంటాయి.
అప్పుడప్పుడు అమ్మ తనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. నిజానికి అమ్మ చాలా మంచిది. తనని చాలా ముద్దు చేస్తుంది. తనని బళ్ళో చేరుస్తాను అంటుంది. తనని బాగా చదువుకోమని చెబుతుంది. అమ్మలా కాక తను బాగా బ్రతకాలి అని చెబుతుంది. పరిస్థితులు తారుమారు అవ్వడానికి నాన్న లేకపోవడమే కారణం అంటుంది. ఏది ఏమైనా అమ్మ చేస్తున్నది తప్పు. ఆ పనులు మానేయమని తను చెబుదాం అనుకుంటుంది. కానీ తను చెప్పలేదు. తనకి అంత పెద్ద పెద్ద మాటలు కూడా రావు. అందుకే అమ్మని తన కళ్ళతోనే ప్రార్ధిస్తుంది. తన భావాలు అర్ధం చేసుకుంటున్నట్టు అమ్మ నవ్వుతుంది.
రేపే తన పుట్టినరోజు. ఇప్పటికి పది పుట్టిన రోజులు వెళ్లిపోయాయి. నాన్న బతికి ఉన్నప్పుడు తన పుట్టిన రోజు చాలా గ్రాండ్ గా చేసేవాడు. చుట్టుపక్కల అందర్నీ పిలిచేవాడు. తనతో కేక్ కట్ చేయించేవాడు. భోజనాలు పెట్టేవాడు. తనకి బొమ్మలు కూడా కొనేవాడు. నాన్న కొనిచ్చిన బొమ్మల్లో చాలా మటుకు చిరిగిపోయి పోయాయి. తన దగ్గర ఇప్పుడు ఒకే ఒక బొమ్మ ఉంది. రబ్బరుతో చేసిన బార్బీ పాప! ఆ బొమ్మంటే తనకెంత ఇష్టమో తను చెప్పలేదు. దానికి రోజూ నీళ్లు పోస్తుంది. జడలు వేస్తుంది. పౌడర్ రాస్తుంది. చిన్ని బట్టలు కూడా వేస్తుంది. బొమ్మని ముద్దు పెట్టుకుంటుంది. బొమ్మ మెళ్ళో చిన్న దారం కూడా కట్టింది. ఆ దారంతో బొమ్మను ఆడించుకుంటూ తనొక్కతే పార్కులో, ఇంట్లో ఆడుకుంటుంది. ఆ బొమ్మకి తను పెట్టిన పేరు లిల్లీ. లిల్లీ తన ప్రాణం!
మరికొద్ది రోజుల్లోనే అమ్మ తనని ఏదైనా స్కూల్లో వేస్తాను అంటుంది. అందుకు డబ్బులు కూడా పోగెడుతోంది. ఈ మధ్య కొన్ని రోజులుగా అమ్మ ఖాళీగా ఉంటుంది. ఎవరూ పెద్దగా రావటం లేదు.
అమ్మ మావయ్యని అడిగితే –
"చూస్తాన్లే అక్కా, ఎవరో ఒకర్ని తీసుకొస్తాన్లే" అంటున్నాడు.
అమ్మా మావయ్య మాట్లాడుకుంటున్న మాటలు తను దుప్పట్లో దూరి అన్నీ వింది.
“చిన్నతల్లిని ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు. అది పెద్దది అవుతుంది. దానికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. దాన్ని స్కూల్లో చేర్చడానికి సరి పడా డబ్బులు కూడబెడుతున్నాను. మరి కొంత కావాలి. ఎవరినయినా చూడు” అంటుంది అమ్మ. "అలాగే" అంటున్నాడు మావయ్య.
మర్నాడే మావయ్య ఒకతన్ని తెచ్చాడు. అతడు కొంచెం డబ్బున్నవాడిలాగానే కనిపిస్తున్నాడు. అనుకోకుండా తనని చూసాడు. “నీ కూతురా?” అన్నాడు వెకిలిగా నవ్వుతూ. అమ్మ ఇబ్బందిగా మొహం పెట్టి, “అవును. పదండి లోపలికి వెళదాం” అంది. “బాగుంది. నీకు వారసురాలు అవుతుందేమో చూడు...” అంటూ వెకిలిగా నవ్వాడు.
అమ్మ అతనికేసి కోపంగా చూసింది. ఆరోజు తనకి జ్వరం! వంటగదిలో ముసుగుతన్ని పడుకుంది. అమ్మమ్మ తనని పార్క్ కి పంపలేదు. కాసేపటికి అమ్మా అతడు బయటకొచ్చారు. అమ్మకి అతడు డబ్బులు ఇచ్చాడు. అమ్మ మొహంలో ఆనందం. కొన్ని రోజులు బియ్యానికి లోటుండదు అనుకుంది అమ్మ.
ఆ తర్వాత అతడు తన దగ్గరకొచ్చాడు.
“పాపా! నువ్వు బాగున్నావు. ఇదిగో ఈ డబ్బులుంచుకో.
ఏవైనా కొనుక్కో” అంటూ ఒక పెద్దనోటే ఇచ్చాడు. తను తీసుకోలేదు. అమ్మా అమ్మమ్మల బలవంతం పై తీసుకుంది. అది ఐదొందల నోట్! దాన్ని తీసుకుంటూంటే తనకి వళ్లంతా కంపరం అనిపించింది. అయినా తీసుకుంది.
అతడు వెళ్ళిపోయాడు. అమ్మ బజార్ కి వెళ్ళిపోయింది. బియ్యం పప్పులు ఉప్పులు తెచ్చింది. వారం పాటు తమకి తిండికి లోటు లేదు. తర్వాత డబ్బులు అయిపోయాయి. అమ్మ బాధ పడలేదు. తన దగ్గర కొచ్చింది. “చిన్నతల్లీ! అంకుల్ నీకు డబ్బులిచ్చాడు కదా! అవి ఇవ్వవే. బజారుకి వెళతాను. నీ కిష్టమైన కూర ఉండుతానులే” అంది అమ్మ.
"అదిగో ఆ చిన్న డబ్బాలో పెట్టాను… తీసుకో” అంది తను. అమ్మ ఆత్రంగా వెదికింది. చూసింది. డబ్బులు తన చేతిలోకి తీసుకుంది. తను చేసిన పనికి అమ్మ తనని చితక బాదింది. బాదితే బాదింది తనకి బాధ లేదు. భయమూ లేదు. దాన్ని చూస్తేనే తనకి అసహ్యం వేసింది. అందుకే దాన్ని ఆరోజు ముక్కలు ముక్కలు చేసి వాటిని డబ్బాలో పడేసింది. తన అసహనాన్ని అసహ్యాన్ని తగ్గించుకుంది.
ఇప్పుడు తనకి సంతోషంగా ఉంది. తనకి తిండి లేకపోయినా పర్వాలేదు.
“నువ్వు బాగున్నావు” అని అతడు చెప్పిన మాటలు తనకి కంపరం కలిగించాయి. తనని బాధ పెట్టాయి. తను చిన్న పిల్లే కావొచ్చు. తనకూ మనసుంది. దానికి ఆలోచనలున్నాయి. మంచీ చెడు గుర్తిస్తాయి. సరే తన మీద కోపంతో అమ్మా అమ్మమ్మ తనతో మాట్లాడ్డం మానేశారు. అయినా తను బాధ పడలేదు.
‘తనకు తోడుగా తనకు లిల్లీ బొమ్మ ఉంది చాలు’ అనుకుంది. అమ్మ చేస్తున్న నీచపు పనులు తనకు తెలియ కూడదు. తను వాటిని చూడ కూడదు. తన కొచ్చిన భాష తోనే అమ్మకి నచ్చచెప్పి చూసింది. అమ్మ వినలేదు. అమ్మ వినదు కూడా. మనం ఎలా బతుకుతాం అంటుంది. తన దగ్గర సమాధానం లేదు. చెప్పేటంత వయసు కూడా తనకు లేదు.
ఎందుకో ఆ రాత్రి తను చాలా బాధ పడింది. ఏడ్చింది. తన లిల్లీ తన కన్నీళ్లతో తడిసిపోయింది.
ఆ బొమ్మని మెళ్ళో ఉన్న దారంతో ఇంట్లో దూలానికి వేలాడదీసింది.
ఇప్పుడు అమ్మ చేసే పనులు తను చూడక్కర లేదు. తను పార్కుకి వెళ్ళక్కర లేదు. ఇప్పుడు హాయిగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎవ్వరి ఏడుపులు, బాధలు తనకు వినిపించవు. కనిపించవు.
ఎందుకంటే -
తనూ లిల్లీ పక్కనే పక్కనే ఉన్నారు! తోడు తోడుగా!!
- నన్ద త్రినాథరావు