ఆమె (కథ)

Advertisement
Update:2023-09-28 16:31 IST

“ఏయ్ ! నిన్నే! నీకెన్ని సార్లు చెప్పాలి? ఇలా డ్రెస్ లు వేసుకోవద్దని, చక్కగా చీర కట్టుకోలేవూ?”

“మరే! కొంచెం ఒంట్లో బాలేదు. ఆఫీస్ కి నడిచి వెళ్ళేప్పుడు ఇది కొంచెం సౌకర్యంగా ఉంటుందని..” భయంగానే నసిగింది శారద.

అసలే నెలసరి వల్ల వచ్చిన చిరాకు, కాళ్ళు లాగడం, ఏదీ తినబుద్ది కాకపోవడం, తినకపోవడం వల్ల, ఇంటా బయట తీరిక లేకుండా చేసిన పనుల వల్ల వచ్చిన కోపం . ఎవరి మీద తీర్చుకోలేని అసహాయత. అన్నీ కలిసి ఆమె కళ్ళు నీటి చెలిమె లయ్యాయి.

“ఒక్క మాటంటే చాలు నీటి కుండ తలమీదే ఉంటుంది. అయినా నీకు భయం లేకుండా పోతోంది. ఆ ఎదురింటి వాడితో నీకేం పని? తగుదునమ్మా అని ఇకిలిస్తూ మాట్లాడుతున్నావు”

“ఆఫీస్ నుండి వస్తుంటే ,’ వాళ్ళావిడ ఇంకా రాలేదని, ఇద్దరం ఒకే ఆఫీస్ కదా’ అని అడుగుతున్నారు. ‘నాకు బాలేక త్వరగా వచ్చాను, తను మరో అరగంట లో వస్తుంది’ అని చెప్పాను”

“ఆ..చెప్పు! నీకు ఒంట్లో ఎందుకు బాలేదు?, ఏమయ్యిందో అన్నీ చెప్పు... బుద్ది లేదు.... ఆ కులం తక్కువ జనంతో ఫ్రెండ్షిప్ వద్దన్నా నువ్వు వినవు కదా! అసలు వద్దు మొర్రో అన్న నిన్ను ఉద్యోగం లో జాయిన్ చేసాను చూడు. అది నాదే తప్పు..”

“ఇవాళ, రేపు ఎవరైనా కులం గురించి పట్టించు కుంటున్నారా? అంత ఇష్టం లేకపోతె ,మరి ఇప్పుడు మానేయించండి . వాళ్ళల్లో మనలో ఒకే రక్తం కదా!” అసలే చిరాకు పై ఉన్న శారద లో కోపం కట్టలు తెంచుకుని, ధైర్యంగా ఆ మాట అనేలా చేసింది.

నిజానికి ఇంట్లో పిల్లలు, ‘ ఇద్దరూ, చిన్న పిల్లలు కాబట్టి ఉద్యోగం ఇప్పుడే చేయను, ‘ అంటే పట్టుబట్టి , ‘వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఇంట్లో నీ బాబు సంపాదించిన మూట ఉందా ’ అంటూ చేర్పించాడు. చచ్చి చెడి, రెండు బస్సులు ఎక్కి, దిగి , ప్రయాణం లో ఎక్కడ వాష్ రూమ్ అవసరం అవుతుందో నని నీళ్ళు తాగకుండా , పొద్దున్న ఇంట్లో పని, పిల్లల స్కూల్ కి , తమకి బాక్స్ లు పెట్టుకుని , తినీ తినక, సమయానికి బస్ రాకపోతే, టెన్షన్ తో ఎక్కడ ఆఫీస్ లో మాట పడాల్సి వస్తుందో ననే గాభరా తో వెళ్లి వస్తే , రాగానే ఇదీ తనకు జరిగే సత్కారం. రాగానే కనీసం , ‘అయ్యో..పాపం’ అనే ఒక్క మాట చాలు , మరో రోజంతా లేని ఓపిక తెచ్చుకుని ఉత్సాహంగా పని చేయడానికి.

“ఏంటి? నోరు లేస్తుంది. ఉద్యోగం చేస్తున్నానని పొగరా.? నాకు తిక్కరేగితే అంతా దించుతా..”ఇంకా ఏం అనేవాడో గాని ఫోన్ రావడంతో బయటకు వెళ్ళిపోయాడు.

కులం ప్రసక్తి రాగానే ఆమెకు పొద్దున్న వాత్సప్ లో వచ్చిన మెస్సేజ్ గుర్తు వచ్చింది.

“ అతను ఆమెనడిగాడు... మీది ఏ కులం?

ఆమె సమాధానం "మహిళ"గా చెప్పాలా "అమ్మ"గా చెప్పాలా?

రెండిటినీ కూర్చి చెప్పండి, అన్నాడతడు.

పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది... "తల్లి కాగానే స్త్రీ కులాతీతురాలౌతుంది"!

అదెలా సాధ్యం! ఆశ్చర్యపోతూ అడిగాడతడు...

ఆమె సమాధానం...

తల్లి తన పిల్లల మలమూత్రాదులను శుభ్రపరచేటప్పుడు తల్లిది శూద్ర జాతి

పిల్లలు పెద్దవాళ్ళైయ్యే తరుణంలో వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ఆమె క్షత్రియ వనిత

పిల్లల ఎదుగుదలతోపాటు ఆమె కులం కూడా మారుతుంది. వారికి విలువలు నేర్పిస్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పించి బ్రాహ్మణ వనిత అవుతుంది.

చివరగా...

పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చి సంపాదనపరులైన తరువాత, తల్లి వారికి ధనం యొక్క విలువను, ఆదా చేయడాన్ని నేర్పించి వైశ్య ధర్మాన్ని ఆచరిస్తుంది.

ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారనుకుంటాను... స్త్రీ కులాతీతురాలని!

గౌరవంతో, వినమ్రతాభావంతో నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడతడు... “

ఎవరో గాని మహిళ గురించి ఎంత బాగా చెప్పారు. కులం ది ఏముంది? అందరిలో అదే రక్తం. అందరం ఒకే కులం, మానవ కులం.

గడియారంతో పందెం వేసుకున్నట్లు , పొద్దున్న అయిదు గంటలు లేచింది మొదలు, రాత్రి పదకొండు వరకు అలుపెరుగని యంత్రం లా పని చేయడం కేవలం అతివలకే చెల్లుతుందేమో?

పిల్లలు స్కూల్ నుండి వచ్చాక చేసిన అల్లరి , చెల్లా చెదురైన వస్తువులతో రణరంగం లా తయారైన ఇల్లు ను చూడగానే తెలిసిపోయింది శారదకు. ‘అమ్మా’ అంటూ చుట్టేసిన ఇద్దరినీ అక్కున చేర్చుకుంది.

***

“ఏంటి ? నీకు పర్సనల్ మెస్సేజ్ లు, గుడ్ మార్నింగ్ లు కూడా పెడుతున్నారా?” భర్త అరుపుకు పిల్లలకు స్నాక్స్ చేస్తున్నదల్లా దెబ్బకు ఒక్క ఉదుటున ముందు గదిలోకి వచ్చింది.

“ఏంటిది?” ఆమె సెల్ ముందుకు చాపుతూ ఆన్నాడు .

“రేపటి అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్బంగా , శుభాకాంక్షలు పెట్టారు కొలీగ్ శ్రీనివాస్”.

అంటే తను రాగానే తన సెల్ రోజూ చెక్ చేస్తున్నాడన్న మాట. అందుకేనా కొన్ని కొన్ని వంకర మాటలు మాట్లాడుతుంటే , తన సెల్ కి వచ్చిన ఆ విషయాలు అతనికి ఎలా తెలిసి ఉంటుందని తను బుర్ర బద్దలు కొట్టుకుంది. అయితే ఇదన్న మాట సంగతి. సంస్కారం లేని అతన్ని చూసేసరికి ఆమెకు కోపం నషాళానికి అంటింది.

“అలా ఒకరి సెల్ ని , వారు లేనప్పుడు చూడడం ఎంత సంస్కార హీనం”‘ కోపంగా అంది శారద.

“అంటే నీ బండారం బయట పడింద ని భయమా?” వంకరగా నవ్వుతూ అన్నాడు .

కోపంలో మాటా మాటా పెరిగింది. ఎదురు మాట్లాడు తున్నందుకు చేయి చేసుకున్న అతనితో,

“భార్య ను అడుగడుగునా అవమానించి, అనుమానించే నీతో ఇన్నేళ్ళు కాపురం చేయడమే నా బుద్ది తక్కువ . ఆకాశంలో సగం, అవనిలో సగం అంటూ , ఉద్యోగాలు చేస్తూ మేము ఇంకా ఎదుగుతున్నామో, దిగజారుతున్నామో తెలియకుండా బతుకుతున్నాం. కాలానికి రాత్రి పగలు రెండు రెక్కలు అన్నట్లు, దేశ ప్రగతికి, సంసార రధానికి ఆడ, మగ ఇద్దరూ రెండు చక్రాలు. ఒక్క రెక్కతో పక్షి ఎలా ఎగరలేదో, ఒక్క చక్రం తో సంసార రధం సాగదు . ఇక దినదిన గండం నూరేళ్ళ ఆయుశ్శులా నేను ఉండలేను. మీకు నా మీద ఎప్పుడు గౌరవం వస్తే అపుడే వస్తాను...” అంటూ పిల్లలతో బయటకు వచ్చేసింది శారద.

చిత్రంగా ఆమెకు ఇప్పుడు కన్నీళ్లు రావడం లేదు. పంజరం నుండి విశాల విశ్వం లోకి స్వేచ్చగా ఎగిరే విహంగం లా ఉంది ఆమె పరిస్థితి.

అలా వచ్చిన ఆమెను తల్లి అక్కున చేర్చుకుంది. ఒక ఆడవారి మనసు మరొక ఆడదే అర్ధం చేసుకుంటుంది అన్నట్లు, ఆమె కు పూర్తి సహకారం అందించింది. తన చదువుకు పదునుపెట్టి , మంచి కార్పోరేట్ కంపనీలో ఉద్యోగం సంపాదించింది.

సకాలం లో ఆఫీస్ కి వెళ్ళాలంటే డ్రైవింగ్ నేర్చుకుంటే ఉపయుక్తంగా ఉంటుందని ,డ్రైవింగ్ నేర్చుకుని , సొంతంగా కారు కొనుక్కుని ఆఫీస్ కి వెళ్ళడం మొదలు పెట్టింది. కొందరు ఆకతాయిలు అడ్డొచ్చి ఆమెను గేలి చేయడం చూసి, పట్టుదలతో డ్రైవింగ్ లో పట్టు సాధించి, కారు రేసింగ్ పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. అలా జాతీయ స్థాయి లో విజేత గా నిలిచింది. ఆమెలో విశ్వాసం రెట్టింపయ్యింది. పేపర్లలో ఆమె గురించి రాసారు.

మహిళా దినోత్సవం రోజు భర్త పనిచేసే ఆఫీస్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానం అందుకుంది. ఆరోజు ఆఫీస్ లో ఆమె స్వీచ్ విని అంతా ఆమెను ఆకాశానికి ఎత్తేసారు. భర్త ఆమె అప్పాయింట్ మెంట్ తీసుకుని వచ్చి, తనను క్షమించమంటూ అడిగాడు.

“ ప్రపంచం అంతా ఏకమై ఎదురుతిరిగినా , నా వెన్నంటి , నీకు నేనున్నాననే ధైర్యం చెప్పేవాడే భర్త. కాని మీరు కష్టకాలం లో అండగా ఉండక, ఇప్పుడు నా అభివృద్ది చూసి వచ్చారు. కాబట్టి మీకు కొంత సమయం ఇస్తున్న, మీ ప్రేమ ఇలాగే ఈ ఏడాది అంతా ఉండి , నిజంగా మీ ప్రవర్తన మారింది అనుకుంటే అప్పుడు వస్తాను..”’ అంటున్న ఆమె, ఆకాశమంత ఎదిగి కనపడగా నిశ్చేష్టుడై పోయాడు అతను. మహిళా విజయాన్ని అభినంది స్తున్నట్లు దూరంగా గుడిలోని జే గంటలు మంగళ కరంగా మోగాయి.

- నామని సుజనాదేవి

Tags:    
Advertisement

Similar News