ఆ పాట ఒక పురాజ్ఞాపకం
విన్న ప్రతిసారీ
ఏదో పోగొట్టుకున్న భావన
పోయింది తిరిగి రాదనే వేదన
రూపంలేని జ్ఞాపకాల లోయల్లోకి విసిరివేయ బడుతుంటాను అనామకంగా..
విలాపంలోంచి ఆలాపన
స్వప్న కాసారాల్లోకి పరుగెడుతూ
ఎన్నో కోల్పోతూ
ఎన్నింటికో దూరమవుతూ..
నాకు నేను దగ్ధమవుతూ వ్యధపడుతూ...
నిస్సందేహంగా
నన్ను నాకు దూరం చేసే
ఆ పాట కోసం ఎన్నాళ్లైనా ఇంతే..
బహుశా ఆ పాట పుట్టిన క్షణంలోనే నా మనసుతో ఏదో
రహస్య ఒప్పందం చేసుకుందేమో..
పాట వినక ప్రాణం ఆగదు
వింటే జీవితమే నన్ను విడిచి పోతుందేమోనన్న ఆతురత
క్షణాలు జ్ఞాపకాల దూలానికి
ఉరి వేసుకున్నంత ఉద్వేగం
కన్నీరు గుండె కవాటాలు తెరిచి
వెలికి జారటం మరిచిన విభ్రాంతి.. మౌనం..
నిదురను దాటి కల
ఎటో దూకిన చప్పుడు
అంతా కొన్ని క్షణాల్లోనే..
చివరగా రెండు కన్నీటి బిందువులు తలగడ కింద నలిగిన రేయిలో మిగిలిపోతాయి రేపటి ఆనవాలుగా..
- మొదలి పద్మ