ప్రపంచానికి తలమానికం భారతీయసంస్కృతీ సంవిధానం!
సౌభాతృత్వ భావనే మన మంత్రం! విశ్వమానవాళికి దాతృత్వం
చేసే విద్వత్తు మన సొంతం!
సమక్షంలో గెలవలేని
తెర వెనక వైరులు
పటిష్టమైన మూలాలను
కబళించే విషబీజాలను వెదజల్లుతున్నారు
ప్రపంచీకరణ సాక్షిగా!
ఆకర్షణీయమైన తాయిలాలను
ఎరగా వేస్తూ
కట్టుదిట్టంగా
అమలు చేస్తున్నారు
దేశాన్ని నిర్వీర్యం చేసే నిబంధనలను!
కార్పొరేట్ సంస్థల కర్కశ
పద ఘట్టనల కింద
నలిగి నశించిపోతూ
హాహాకారాలు చేస్తోంది
వ్యవసాయ రంగం!
ఛిద్రమైపోతున్నాయి
చేతివృత్తులు!
ఆహారం,ఆహార్యం,కళలు,భాషలు కనుమరుగైపోతున్నాయి
కన్నీళ్ళ పర్యంతమై!
విచ్ఛిన్నమైపోతోంది
వివిధత్వంలో ఏకత్వం!
విదేశీ సాంస్కృతిక జీవనశైలి
నరనరాన జీర్ణించుకున్న వ్యవస్థ ఎప్పటికైనా అడుగేస్తుందా
పునర్వైభవ సాధన దిశగా!
-మామిడాల శైలజ.
(వరంగల్)
Advertisement