" డియర్ మీనా! నీ మీద చాలా కోపంగా ఉంది. రాదా మరి? మనం కలిసి మాట్లాడుకుని ఎన్నిరోజులైంది? నాలుగు రోజులనుండి సరిగా నీ దర్శనమే లేదు. పొద్దున వాకిట్లో ముగ్గు వేస్తూ కనిపించావు. మాట్లాడదామని వస్తుంటే గబుక్కున లోపలికి వెళ్ళిపోయావు. పోనీ పెరట్లోనైనా అవకాశం ఇస్తావనుకుంటే, వెనకాలే ఆ బుజ్జిగాడు. అసలు నీ ముగ్గులతోనే మన పరిచయం కదా! ఆ రోజు నువ్వు వాకిట్లో ముగ్గు వేస్తుంటే చూసి ముందు ముగ్గునీ, ఆ తర్వాత నిన్నూ చూసి మనసు పారేసుకుంది. అప్పటినుండీ నా మనసులో తిష్ట వేసుకునే ఉన్నావు.
ఇప్పుడేమో ఎప్పుడూ మనం కలుసుకునే చోటికి వస్తావనుకుంటే, ఇంటినిండా జనం, ఎలా కుదురుతుంది? అంటావు. మరి నాకు కోపం రాదూ! నీకు అనిపించటం లేదా అయ్యో పాపం నాకోసం ఎంత ఎదురు చూస్తుంటాడో అని. నీకంటే పండగ హడావుడితో చేతినిండా పని. మరి నాకేం పని? నిన్ను చూడటమే కదా! ఇదిగో అమ్మాయ్! ఈరోజు చీకటి పడ్డాక డాబా మీదకి మనం కలుసుకునే చోటుకి రా. వాళ్లూ వీళ్లూ చూస్తారని వంకలు పెట్టకు. వెన్నెల్లో నీ కళ్ళలో వెలుగులు చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని ఆశ. ఇంకో విషయం. నువ్వు వచ్చావనుకో, నీకు ఓ మంచి బహుమతి ఇస్తాను. నీకోసం ఎదురు చూస్తుంటాను. మర్చిపోకు. బహుమతి గుర్తుంచుకో. ఆ పైన నీ ఇష్టం.
నీ
సుందరం "
పెరట్లో తులసి కోట గట్టుమీద ఉత్తరాన్ని చూసి మీనాక్షి గుండె గబగబా కొట్టుకుంది. ఈ ఉత్తరం ఎవరి కంటైనా పడితే ఇంకేమన్నా ఉందా! పరువు పోదూ? వెనక్కి, పక్కలకీ చూసింది. సుందరం కనిపించలేదు. ఇంకా ఎవరూ కూడా లేరు. బతికిపోయా ననుకుంటూ ఉత్తరం జాగ్రత్త గా కొంగు చాటున పట్టుకుని సామాన్ల గదిలోకి వెళ్లి చదువుకుంది. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి.
అమ్మో! ఇంతమంది జనం ఇంట్లో ఉంటే ఎలా వెళ్ళటం. వెళ్ళకపోతే తను చిన్న బుచ్చుకుంటాడే. అయినా ఏదో బహుమతి అన్నాడు. ఏమిస్తాడో? అందరికీ కనబడకుండా ఎలా తెస్తాడు? జేబులో పట్టేదా! అయితే ఏమై ఉంటుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది మీనాక్షికి, మరీ చిన్న పిల్లలా ఆలోచిస్తున్నందుకు.
సరే అడుగు ముందుకే అని అనుకుంది.
సాయంత్రం ఇంట్లో జనాభా అందరూ అల వైకుంఠపురంలో సినిమాలో మునిగి పోయారని నిశ్చయించుకున్నాక పెరటివైపు మెట్లెక్కి డాబా మీదకి వెళ్ళింది. ఎప్పుడు వచ్చాడో సుందరం అక్కడ ఉన్న ఒకే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైనా డాబా మీద కూర్చోవటానికి ఏర్పాటు చేసుకున్న ఓ మాదిరి అరుగు దగ్గర కుర్చీలో కూర్చున్న అతని దగ్గరకెళ్లి అరుగుమీద కాళ్ళు కిందకి
వేళ్లాడేసుకుని కూర్చుని "రమ్మన్నావు కదా వచ్చాను. ఇప్పుడు చెప్పు " అంది.
" ఇప్పటికి తీరికైందన్నమాట. పోనీలే వచ్చావు సంతోషం. " ఆమె చేతిని తన చేతిలోనికి తీసున్నాడు. నాలుగు రోజుల తర్వాత కలయిక ఆమెకీ సంతోషం గానే ఉంది. ముందుగా తన పక్కనే ఉన్న సన్నజాజి మాలని ఆమె జడలో తురిమాడు.
"ఏయ్. ఏమిటీ పని? ఎవరైనా చూస్తే.
"ఏం పర్వాలేదు. నేనే ఇచ్చానని చెప్పు."
"సిగ్గులేకపోతే సరి. అయినా ఇదేనా నీ బహుమతి " అడిగింది.
" అప్పుడేనా! ఇప్పుడే ఇచ్చేస్తే నువ్వు వెళ్ళిపోతావు. కాసేపు కబుర్లు చెప్పుకోవాలి కదా "
" ఊఁ చెప్పు. వింటాను. "
" నాకే కాని కబుర్లు నీకు లేవా! నిజం చెప్పు. నీకు కూడా వెలితి గా లేదా! "
అంటూనే ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుని మెల్లిగా ఒత్త సాగాడు అతను.
"ఏమిటిది? ఏం పని?"
"అవును మరి. పండగ పేరుతో అవీ ఇవీ చేస్తూ పొద్దుగూకులూ ఆ వంటింట్లో పడి కొట్టుకుంటూనే ఉన్నావు. ఏమన్నా అంటే పండగ, పిల్లలూ, మనవలూ వచ్చారు, వాళ్లకింత చేసిపెట్టుకోవాలి అంటావు. వంట మనిషిని మాట్లాడదామంటే ఒప్పకోవు. ఈ మాత్రం ఓపికపోతే ఎలాగూ తప్పదు అంటావు. నిలబడి నిలబడి నీ కాళ్ళు నెప్పులు పుడితే చూస్తూ ఊరుకోగలనా? అందుకే నీ సేవ చేసుకుని తరిద్దామని. చూడు. ఇలా ఒకరికొకరుగా ఉంటే ఎంత బావుంటుందో కదా! దేవిగారికి నా బహుమతి నచ్చలేదా! " చిలిపిగా అడుగుతున్న డెభై ఏళ్ల సుందరరావు ని అరవై ఎనిమిదేళ్ల మీనాక్షి అపురూపం గా చూస్తోంది. ఆమె కళ్ళలో వింత మెరుపుతో బాటు ముత్యాల్లాంటి కన్నీళ్లు.
" ఇదిగో బంగారం. ఈ కాలం కుర్రాళ్ళు ప్రేమ దోమ అంటూ పెళ్లిళ్లు చేసుకోవటం, ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకు అభిమానపడి చిలికి చిలికి గాలివానలు చేసుకోవటం, ఆ పైన మనస్పర్థలతో విడిపోయే దాకా తెచ్చుకోవటం. ప్రేమంటే ఏమిటంటావు? ఒకరికొకరు నచ్చుకోవటం మెచ్చుకోవటం.ఇలా ఒకరికొకరు సహకరించుకుంటే ఎంత బాగుంటుంది. అయినా అన్నిటినీ సమర్ధించుకోగల
నీలాటి భార్య దొరకటం నా అదృష్టం కదూ. అందుకే ఈ వయసులో నీ సేవ కంటే నాకేం పని ఉంటుందోయ్. దానికి కూడా వీలు కావటం లేదు. "
మృదువుగా తన పాదాలు అతను నొక్కుతుంటే కాళ్ళనొప్పులు మాయమై పోయినట్లే హాయిగా ఉంది ఆమెకి. ఒకింత తృప్తి, మరింత గర్వంగానూ
అనిపించింది.
" మొదట్లో నాకూ ఇందులోని ఆనందం అర్థం కాలేదనుకో. ఇప్పుడే ఈ ప్రేమలోని అర్థం బాగా అర్థమైంది. నిన్ను విడిచి ఉండలేనని ఇంకా అర్థమైంది. " ఆయన తమకంగా మాట్లాడుతూ ఆమె ఒడిలో ముఖం దాచుకున్నాడు. ఇంతకంటే ఏ ఇల్లాలికైనా బహుమతి ఏం ఉంటుంది. ఆయన తలమీద చెయ్యివేసి అలాగే ఉండిపోయింది మీనాక్షి (మీనాక్షమ్మ. )
కొన్ని నిమిషాలు అలాగే గడిచాయి.
"చాలాసేపైంది. వాళ్లంతా నన్ను వెదికే లోపు కిందకి వెళ్ళాలి. మరి వెళ్ళనా?"
" మళ్ళీ రేపు ఇలాగే"
నవ్వుతూ చెయ్యి వదిలాడాయన "
ప్రేమికులకి ఒకటే రోజు మరి పెళ్లయిన వాళ్లకి ప్రతిరోజూ ప్రేమికుల రోజే అర్థం చేసుకోగలిగితే.
-మద్దాళి నిర్మల