లోపలి గుంజాటన( కథ)

Advertisement
Update:2022-12-27 14:48 IST

యాదగిరి తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుస్తూ తన ఆలోచనలలో ములిగిపోయాడు . పేదవాడిని అనే ఆలోచనే అతన్ని దీనంగా ఉంచుతోంది..

అతనో ఆటో డ్రైవర్, రోజూ ఆటో నడపగా సంపాదించేది చాలా తక్కువ .సొంత ఆటో లేకపోవడం ,దానిని అద్దెకు తీసుకోవటం వల్ల దాని బాడుగ చెల్లించాక మిగిలింది ఇంటికి తీసుకుని పోవడం .దీని కోసం రోజంతా కష్ట పడటం .అయినా అది ఏమూలకీ సరిపోదు .మాములు కన్నా కొంత ఎక్కువ సేపు నడిపినా ఆ డబ్బు కూడా సరిపోవటంలేదు.

ప్రతిరోజూ చిన్నవారి నుండి పెద్దల వరకు అన్ని రకాల ప్రయాణీకులనీ చూస్తున్నాడు.. కొంతమంది పాసెంజెర్స్ అయితే చీప్ గా నిజంగా అసహ్యంగా ప్రవరిస్తూ ఉన్నారని తెలుస్తోంది., కొందరు ఒక్క రూపాయికి కూడా బేరం ఆడుతున్నారు కొందరు మాత్రం మీటర్ ఛార్జీల ప్రకారం చక్కగా చెల్లిస్తారు మరియు కొందరు కొన్నిసార్లు సలహాలు కూడా ఇస్తూవుంటారు ..

ఈ రోజు ఒక పాసెంజేర్ అయితే జీవితం ఎలా నడుపుకోవాలో కొన్ని సూచనలు చేసాడు .అయితే అవన్నీ అన్నీ అమరిన భోజన పళ్ళెం ఉన్న వారికే గానీ తన లాంటి వారికి అది ఏ మాత్రమూ సరిపోదు అనుకున్నాడు.

భార్య స్వరూపతో ఎప్పటికప్పుడు తమ పరిస్థితి గురించి చెప్పేవాడు యాదగిరి .

ఒక రోజు అనిపించింది .తను పని చేసే యజమాని నుండి కొంత డబ్బు అప్పుగా తీసుకోవాలని, అయితే, ఎలాగూ యజమాని ఇవ్వడానికి ఒప్పుకోడని తెలుసు. ఒక వేళ దయ తలచి ఇచ్చినా తను ఆ డబ్బు తీసుకున్నప్పటికీ, దానిని ఎలా తిరిగి ఇవ్వాలా అనే ప్రశ్న కళ్ళముందు భూతం లా నిలుచుంది.

ఎప్పటిలా ఆటోని యజమాని దగ్గర పెట్టేసి ఆలోచనలతో నడుస్తున్నాడు యాదగిరి .ఫుట్‌పాత్‌పై ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక బిచ్చగాడిని దాటాడు. మంచి నిద్ర కోసం తహతహలాడుతున్న యాదగిరికి అసూయ కలిగింది అతన్ని చూసి.

ఇంతలో వెనకాలే ఒక కారు హరన్ మోగింది. దారి ఇచ్చేందుకు పక్కకు తప్పుకున్నాడు. పెద్ద ఖరీదైన కారు. కొంతమంది యువకులు బిగ్గరగా నవ్వుతున్నారు. అజాగ్రత్తగా నడుపుతూ వెళ్ళిన, వాళ్ళని చూసి అతని లో నిస్సహాత. కోపం తార స్థాయికి చేరాయి...

మూడు నెలలు గడిచాయి

యాదగిరి చాలా రోజుల పని తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు రోజుకన్నా ఎక్కువ పాసెంజెర్స్ ని ఎక్కించుకున్నాడు విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువ దూరం కూడా ఆటో తిప్పాడు . అలా రోజంతా ఆటో రిక్షా నడుపుతూ, వేడి కాలుష్యాన్ని భరిస్తూతిరిగి తిరిగి అలసిపోయాడు.

ఇంటికి చేరేసరికి మగతగా అనిపించింది.

యాదగిరి ఇల్లు భోలక్ పూర్ బస్తీ లో ఉంటుంది.

ఇటుకలతో నిర్మించిన చిన్న ఇంటికి సరైన కిటికీ తలుపులు కూడా లేవు . వాటి స్థానంలో గోనె గుడ్డ కప్పబడి ఉంది. వర్షాలకు గోడలు, గడ్డి పైకప్పు నుంచి నీరు కారుతోంది.

ఇంటి దగ్గర ఒక మురికి నాలా ఉంది, దాని నుండి రోజంతా దుర్వాసన వస్తూనే ఉంటుంది.

అతని ఆరేళ్ల కొడుకు శంకర్

దగ్గర లోని స్కూల్ లో

చదువుతు న్నాడు.

"ఇదో నీకే చెబుతున్నా వచ్చే వారంలోగా స్కూల్ ఫీజు కట్టాలి" స్వరూప ఆత్రుతగా, యాదగిరి ఇంట్లోకి అడుగుపెడుతుండగానే చెప్పింది..

భార్య మాటలు విని చిరాకు పడ్డాడు. తీవ్ర నిరాశతో చేసేదేమీ లేక మాట్లాడకుండా నేలపై పడుకున్నాడు.

కొంచెము సేపు అయ్యాక స్వరూప అతనికి టిఫిన్ తెచ్చిలేపింది. కళ్ళు తెరిచి "అక్కడ పెట్టేసి పో" అన్నాడు .

"సర్లే" ఆకలేస్తే తనేతింటాడు లే అనుకుని నిద్రకు ఉపక్రమించింది.

తెల్లారింది

స్వరూప ఉదయం లేచి చూసేసరికి యాదగిరి చుట్టుపక్కల కనిపించలేదు.

వేలేసి ముట్టని టిఫిన్ ప్లేట్‌ని చూసి ఉసూరుమంది

యాదగిరి ఎప్పటికి లాగే తన ఆటో ఏజన్సీ ఆఫీసుకి వచ్చి తాళాలు తీసుకుని ఆటోరిక్షా దగ్గరకు వెళ్లాడు. అక్కడ నుంచి పక్కనే ఉన్న ఆటోరిక్షా స్టాండ్‌కి వెళ్లాడు. వెంటనే, అతన్ని ఒక పాసేంజేర్ ఆపాడు .అతను వెళ్లాల్సిన చోటు చెప్పి చేతిలో వాకింగ్ స్టిక్ తో ఆటో యెక్క బోయాడు. ముసలతను కావటం తో చేత కాలేదు అది చూసి యాదగిరి అతన్ని జాగ్రత్తగా ఆటోరిక్షాలో కి ఎక్కించి కుర్చోపెట్టాడు.

మరో వారం రోజులు యాదగిరికి మరింత గడ్డుగా మారింది. ఒక పక్క కొడుకు స్కూల్ ఫీజు కోసం డబ్బులు కట్టలేక బాధతో ఉంటే మరో పక్క భార్య స్వరూప నిత్యం అతనితో గొడవ పడుతుండేది. ఒక్కోసారి ఆమె తమ పరిస్థితి ఎలా ఉంటుందో, డబ్బులు ఎలా సమకూరుతాయో తెలియక ఆలోచిస్తూ ఏడ్చేది.

రోజు ఎంత కష్ట పడినా విఫలమవుతున్నాడని యాదగిరికి దిగులుగా ఉంది..

రోజులు గడిచే కొద్దీ యాదగిరి మరియు స్వరూపల మధ్య చిరాకు పెరుగుతూ వచ్చింది.

చివరకు ఫీజు కట్టేందుకు ఒక్కరోజు మిగిలిపోవడంతో ఇద్దరూ ఇంక ఆశలు వదులుకున్నారు.

ఆ రోజు యాదగిరి రోజుకన్నా ఎక్కువ ట్రిప్స్ వేయలేదు.రాత్రి కి యాదగిరి ఆటో రిక్షా పార్క్ చేయడానికి ఆఫీస్ కి తిరిగి వెళ్ళాడు.

ఆటో రిక్షా పార్క్ చేసి సీట్లు శుభ్రం చేయడంమొదలుపెట్టాడు.

ప్యాసింజర్ సీటు శుభ్రం చేస్తుండగా సీటుపై పర్సు పడి ఉంది.

పర్సు తీసుకుని తెరిచాడు.

పర్సులోనివి చూడగానే అతని కళ్లు పెద్దవయ్యాయి.

పర్సులో భారీ మొత్తంలో డబ్బు ఉంది. యాదగిరికి అది చూసి ఏమనాలో, ఏం చేయాలో తోచలేదు.

అతని ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు తన సమస్యలన్నీ తీరిపోయాయని భావించాడు.

పర్సు తెరిచి చూస్తే ఎవరైనా చూశారా అని తన చుట్టూ చూశాడు.

చుట్టూ ఎవరూ లేరు.

అతను జాగ్రత్తగా పర్సు జేబులో పెట్టుకుని, తిరిగి తన ఇంటికి నడవడం ప్రారంభించాడు

రోడ్డు మీద నడుస్తూ తనలో తానే నవ్వుకున్నాడు.

అతని మనసు ఆలోచనలతో నిండిపోయింది. తన కొడుకు స్కూల్ ఫీజు కట్టగలననే ఆలోచనలు, ఇంటి ఖర్చులు చూసుకోగలననే ఆలోచనలు, మంచి ఇంట్లో ఉంటూ స్వరూప కోరుకున్నదంతా అమర్చి కావలసినవన్నీ కొనుక్కోవాలనే ఆలోచనలు.

నడుస్తూనే ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాడు.

"ఈ డబ్బు గురించి తన కొడుకు కి, స్వరూపకు ఏమి చెబుతాడు?

తన కొడుకులో ఎలాంటి విలువలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు? తనేమో ఎప్పుడూ కొడుకుతో నిజాయితీ గురించి మాట్లాడేవాడు మరి ఇప్పుడు ఇలా చేస్తే ? " అతని లో అంతర్మధనం మొదలయింది.

ఇలా ఆలోచనలు తో మురికి కాలవ దాటంగానే నరసన్న పాన్ డబ్బా కనిపించింది. "అన్నా !ఒక ఫోన్ చేసుకోవాలె"అని జేబులోంచి పర్సు తీసి అందులో ఉన్నవిజిటింగ్ కార్డు తీసి అక్కడ రాసి ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసాడు.

అవతలి కంఠం నుంచి "ఎవరూ" అంటూ దగ్గుతూ అనడం వినిపించింది.

అప్పుడే యాదగిరి మీదుగా చల్లని గాలి వీస్తూ పోయింది.

- మణి వడ్లమాని

Tags:    
Advertisement

Similar News