తను వెలగగానే
మా పేదింటి చీకటి చూరుకు
వెలుగు మల్లియలు పూసేవి!
అమ్మ కలల నక్షత్రాలన్నీ
దోసిట్లో పోసి చిమ్నీ అడ్డుపెట్టేది!
నాన్న చెమట చుక్కల కిరోసిన్
నట్టింట్లో గుప్పున వెలిగేది!
ఆగ్నేయం మూలలో అమ్మ
ముగ్గుస్నానం చేయించి
గాజువస్త్రం చుట్టగానే
వెన్నెలై విరబూసి
తెల్లవార్లూ నవ్వుతుండేది!
పుస్తకాలపై నిద్ర వాలినప్పుడల్లా
జోగే తలకు మసి మొట్టికాయలు వేసి
చదువుల పీటపై చక్కగా కూర్చోబెట్టేది!
బువ్వపూలు పూసే
పైరుని పలకరించేందుకు
నాన్న చెయ్యెక్కి వేగుచుక్కయి సాగిపోయేది!
పొద్దస్తమానూ సూర్యుడై కష్టపడి
చూపుల్ని చీకట్లో పారేసుకున్న
తాతయ్యకు తోవ చూపుతూ
రాత్రేళ చెయ్యట్టుకు ఇల్లు చేర్చేది!
నేడు మేమంతా
విద్యుత్ దీపాలమై
ఇల్లంతా పరుచుకున్నా
ఒకప్పటి మా చీకటిని
పారద్రోలిన నేస్తం
మా ఇంటి లాంతరు!
అలసి గోడెక్కిన
తాత పటం పక్కనే వేళ్ళాడుతూ
మాకిప్పటికీ వెలుతురుపాఠాలు చెబుతూనే ఉంటుంది!
---డి.నాగజ్యోతిశేఖర్