నాకు మనసంతా శూన్యంగా వుంది..ఎక్కడికైనా వస్తే ఏదో ఒక కొత్తదనంతో మరోలా అనిపించాలి.
నాకు అలా ఏమాత్రం లేదు..
ఒకలాంటి అసౌకర్యం.. వెలితి..మనసంతా దిగులు..
ఎందుకు వచ్చానా? అన్న అయోమయ స్థితి.. మనసు పంచుకోలేని ఒంటరితనం..
నా చెల్లెలు సులోచన 'రెండునెలలు ఖచ్చితంగా వుండాల్సిందే' అంటూ నన్ను బలవంతంగా తీసుకొని వచ్చింది. ఇక్కడకు వచ్చి వారంరోజులు అయింది. రేపు ఇంటికి వెళ్తానని రాత్రి సులోచనతో బావగారితో చెప్పాను. తెల్లవారి సాయంత్రం నేను బయలుదేరి రైల్వేస్టేషనుకు వచ్చి రైలు ఎక్కాను.
****
మరో రెండు నెలలు గడిచాయి. ఏదో అనుకున్నానే గాని కాత్యాయని లేని ఒంటరితనం నన్ను వేదించసాగింది. ఆ రాత్రి కలలో కాత్యాయని కనిపించే సరికి నేను ఎంతో ఆనందపడిపోయి నా మనసులో బాధ చెప్పుకున్నాను.
“కాలం ఒక మందులా పనిచేస్తూ మనసుకైన ఇలాంటి గాయాలను బాధలను తప్పకుండా మాన్పుతుంది. నెలలు గడుస్తున్నా కొద్దీ బాధ కాస్తా తగ్గుతుంది. ఇలా జీవించటం అలవాటైపోతుంది. మీరు ఆరోగ్యవంతులు..రోజంతా ఇంట్లో కాకుండా బయటకు వెళ్లి ఏదైనా పని పెట్టుకోండి. అలసిన శరీరానికి నిద్ర పడుతుంది” ఉలిక్కిపడి లేచాను నేను.
ఎదురుగా సన్నటి వెలుతురులో టేబుల్ మీద చిరునవ్వుతో నన్నే చూస్తున్న నా కాత్యాయని ఫోటో. పక్కనే అక్వేరియం.. అందులో రెండుచేపలు ఉత్సాహంగా ఈదుతున్నాయి.. రెండంగల్లో టేబుల్ దగ్గరికి వెళ్లి అక్వేరియంను ప్రేమగా నిమిరి ఫోటోని చేతుల మధ్యకు తీసుకొని గుండెకు హత్తుకుంటూ బెడ్ మీద వాలాను. టైం చూసాను. మూడయింది. నా కళ్ళు నిద్రకు ఆహ్వానం పలికాయి.
. *
“నమస్తే సార్.. నా పేరు గురుమూర్తి.. ఇక్కడే వుంటాను. కాలనీ వాళ్లంతా మీ గురించి చెప్పుకుంటుంటే మిమ్మలి పరిచయం చేసుకుందామని వచ్చాను” గుమ్మం అవతల నిలబడి చిరునవ్వుతో చూస్తూ అన్నాడు అతను.
“రండి సార్..రండి” ఆత్మీయంగా ఆహ్వానించి కూర్చోమన్నట్లు సోఫా చూపించాను.. కూర్చున్నాడు అతను.
“నేను కరెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాను. ఈమధ్యనే కాలనీలో ఇల్లు కొనుక్కున్నాను. నాకు ఒక్కతే అమ్మాయి. పెళ్లయింది. వాళ్లకో బాబు. వాళ్లు ముంబైలో ఉంటారు. నా భార్య చనిపోయి సంవత్సరం అవుతుంది. బుధ గురు శుక్రవారం నా భార్య సంవత్సరీకాలు ఉన్నాయి. మీరు తప్పక రావాలి” అంటూ కార్డ్ నా చేతికి ఇచ్చాడు.
కార్డ్ చూసాను.. స్తీమూర్తి ఫోటోతో మాటర్.. అడ్రస్..మొబైల్ నంబర్ వున్నాయి. అతను మౌనంగా ఉండేసరికి నేను వెళ్లి టీ పెట్టుకుని వచ్చాను. అతను కప్పు అందుకుంటూ నన్నే పరీక్షగా చూశాడు.
“మీకు ఎలా టైం పాస్ అవుతుంది సార్”? నా దినచర్య గురించి చెప్పాను నేను......
“ఏముంది సార్.. టీవి.. మొబైల్..ఫ్రెండ్స్ తో టైంపాస్..అవికాక ఈ మధ్య మనకు దగ్గరలో ఉన్న బ్యాంకులో రెండు మూడు గంటలు పని కూడా చేస్తున్నాను. బ్యాంకు మేనేజర్ నాకు బాగా తెలుసు. బ్యాంకుకు వచ్చే కస్టమర్స్ కు చాలా విషయాల్లో అవగాహన ఉండదు. నేను వాళ్ళకు తెలియనివి చెప్తూ సహాయ పడుతున్నాను. నలుగురు పరిచయం అవుతారు” అంటూ చిరునవ్వుతో అతన్నే గమనించాను నేను.
“మీ భార్య అంటే మీకు చాలా ప్రేమట కదా” అతని ప్రశ్నకు ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను నేను. ఏం చెప్పాలో తోచలేదు నాకు.
ఏంటో సార్.. నేను నా భార్యను అంతగా ప్రేమించలేదు.. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమించి ఉంటే బాగుండేది అని. సమయం దాటిపోయింది. నిజానికి నా మనసులో బాధ మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్.. చెప్పమంటారా?”
“అయ్యో.. చెప్పండి సార్”
“నా కోసం నా భార్య రకరకాల వంటకాలు ఎంతో రుచిగా చేసేది. నా బట్టలు ఇస్త్రీ చేసేది. ఎటైనా వెళ్తే గుమ్మంలో నిలబడి ఎదురెదురు చూసేది. ఎంతసేపూ బయటివాళ్ళను మెచ్చుకుంటూ ఆమెను తక్కువచేసి మాట్లాడేవాడిని. నాకు అందమైన భార్య వుంటే బాగుండేది అని అన్పించేది. కనపడని మనసుకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాదు. ఆమెను నేను ఎప్పుడూ సరిగా గుర్తించలేదు. ప్రేమించలేదు. ఇప్పుడు ఆమెకోసం నా మనసు తపించిపోతుంది.. కానీ ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి?”
“సార్..మీరే ప్రశ్నించి మీరే సమాధానం చెప్పారు.. భార్యాభర్తల బంధంలో ప్రేమలేకుంటే ఎలా? ఒకరి గురించి ఒకరికి శ్రద్ధ వుండటం.. ఆరాటపడటం.. తోడునీడగా ఉండటం.. ఇవే కదా భార్యా భర్తల సంబంధానికి.. ప్రేమకు అర్థం. ఒక ప్రశ్న అడుగుతాను మరోలా అనుకోకండి.. మీ భార్య మిమ్మల్ని ఎప్పుడూ ప్రశ్నించలేదా?”
“ప్రశ్నించలేదు.. గొడవ పడలేదు” అంటూ జేబులో నుండి కర్చీఫ్ తీసుకొని కళ్ళు అద్దుకున్నాడు గురుమూర్తి.
“భార్యా భర్త బంధం అంటే.. ఒకరితో ఒకరికి చాలా సఖ్యత ఉండాలి సార్.. ఇద్దరిమధ్య బోలెడన్నిఆనందకర విషయాలు వుండాలి..వాటిని మూటకట్టి దాచుకోవాలి.. అవి ఒకప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒకరికి ఇష్టమైనది ఇంకొకరు చేయాలి. ముఖ్యంగా భార్యను సంతోషపెడుతూ ప్రేమిస్తూ గౌరవించాలి. అప్పుడు ఆమె రెట్టింపు ప్రేమ గౌరవం సంతోషం తప్పక ఇస్తుంది. నేను ఎంతోమందిని చూసాను భార్యను ఎందుకోగానీ గౌరవించరు..ప్రేమించరు.. ఆవిడకి కూడా ఒక మనసుంటుంది అనే ప్రాధాన్యత అస్సలు ఇవ్వరు. అలాంటప్పుడు చనిపోయిన తర్వాత కార్యక్రమాలు జరిపించడం.. సంవత్సరీకాలు చేయటం ఎందుకు? బ్రతికి ఉన్నప్పుడు ఆమెకు సరైన విలువ ఇవ్వనప్పుడు చనిపోయిన తర్వాత చాలామందిని పిలిచి ఆమె పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆమె ఆత్మ శాంతిస్తుందా? అసలు అతనికి ఆ అర్హత ఉంటుందా?
మిమ్మల్నిఇందాకటినుంచీ గమనిస్తున్నాను మీరు మీ మొబైల్ ని అతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఖరీదైనదనేగా? ప్రాణంలేని వస్తువునే అంత ప్రేమగా చూసుకుంటే ప్రాణం ఉన్న మన సొంతమనిషి పట్ల ఎంత ప్రేమ వుండాలి? మనం ఆమె గురించి తలుచుకున్నప్పుడు ఒక తృప్తి మనకు మిగలాలి.
ఆ అక్వేరియం నా అర్ధాంగి నాకు బహుమానంగా ఇచ్చింది. ఆ బహుమతిని నేను ఎంతో విలువగా చూసుకుంటాను. అందులో నాకు ఎంతో అర్థం కనిపిస్తుంది. అక్వేరియంలో ఆ రెండు చేపలు నేను నా అర్ధాంగి. కదిలే నీళ్లు ఆమె జ్ఞాపకాలు..ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే అన్నీ వుంటాయి సార్.. స్పందన లేని మనసు ప్రేమ ఇవ్వలేని మనిషి పాషాణంతో సమానం. ఇప్పుడు మీకు మీ భార్య కావాలనిపిస్తుంది. కానీ అది అసాధ్యం..మీరు పడే పశ్చాతాపం ప్రయోజనం లేనిది”
“నిజమే సార్..మీరు చెప్పింది కరెక్ట్.. కానీ.. ఒక విషయం చెప్తాను. భర్త చనిపోయి భార్య వుంటే.. పిల్లల పనులు.. వంటకాలు.. ఇంట్లోపనులు.. ఇలా ఏవేవో వ్యాపకాలు పెట్టుకొని ఉండగలదేమో.. కానీ భార్య చనిపోయి భర్త వుండటం అన్నది చాలా దుర్భరం.. వెళ్ళొస్తాను సార్.. ఇలాంటివన్నీ అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తాయి” అంటూ లేచి దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నగురుమూర్తి దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా కౌగిలించుకున్నాను నేను. కాత్యాయని గుర్తొస్తుంటే నా కళ్ళ నిండా కన్నీళ్లు నిలిచాయి.
-కోటమర్తి రాధా హిమబిందు