ఖాళీ మేఘం

Advertisement
Update:2022-11-15 12:43 IST

ఏం రాస్తున్నావ్

అలవోకగా ప్రశ్నిస్తావు

ప్రశ్న చిన్నదే

జవాబేం చెప్పాలో తోచదు

చెరువులో ఈదే చేపలా

ఆకాశంలో ఎగిరే పిట్టలా

వెంటనే వచ్చి వాలదు

కవిత్వం పిచ్చుక

మనసు ముంగిట్లోకి

*

ప్రతి రోజూ క్రమం తప్పకుండా

ఒక పేజీయో కొన్ని పంక్తులో

చూచి రాత పుస్తకం నుంచి

చూసి రాయడం కాదు

కవిత్వం చెట్టు చిగిరించాలంటే

అంత తేలిక కాదు

అంతరంగ సాగరంలో

ఆలోచనల మధనం సాగాలి.

కొన్ని రోజుల యుగాలు

తపస్సు చేస్తే గానీ

కవితా వస్తువు సాక్షాత్కరించదు.

అమ్మ మీద అలిగిన పాపాయిలా

అర్థవంతమైన పదం పలకదు

అకారణ ద్వేషుల్లా

అలిగి దూరం వెళ్తుంది.

ఆటల్లో కోపం వచ్చి

చిన్న పిల్లలు పచ్చికొట్టినట్లు

దూర దూరంగా

తరలి వెళిపోతాయి భావాలు

అందరాని కొమ్మలపై

అందుకోలేని పువ్వుల్లా

తడబడే వాక్యాలు.

**

అన్యాయం పంజా విప్పినప్పుడు

హింస వేయికాళ్ళ జంతువై

ఉగ్రరూపం దాల్చినపుడు

హృదయం జ్వలిస్తుంది

**

వేదనాగ్నిజ్వాలల్లో

పుటం పెట్టిన ఆలోచనలు

విచ్చుకొన్న పువ్వుల్లా ఉదయిస్తాయి.

మనసులో అల్లుకొన్న కవిత

కాగితం మీదకు బదిలీ చేయగానే

వర్షం వెలిసాక

కరెంట్ తీగెపై గుచ్చిన

వాన చినుకుల ముత్యాల్లా

తెల్లకాగితం ఆకాశంపై

వరుసలు తీరిన అక్షరాల పక్షులు

కురిసి వెలసిన ఖాళీ మేఘంలా

మనసు తేలిపోతుంది దూదిపింజలా

- మందరపు హైమవతి

Tags:    
Advertisement

Similar News