అమ్మ ఎక్కడైనా అమ్మే (కధానిక )

Advertisement
Update:2023-04-03 17:20 IST

"అమ్మా...చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అనే సైకిల్ తప్ప జీవితం లేదా ఆడవాళ్ళకి...నాన్న పోయినప్పుడు ఏమి పట్టించుకోలేదు... తాతయ్య ఏం హక్కుతో మన జీవితం మీద నిర్ణయం తీసుకుంటారు... " కోపంగా తల్లిని నిలదీసింది శాన్వి.

"పెద్ద వాళ్ళని అలా అనకూడదు ..రక్త సంబంధం...తప్పదు...నీ ఇష్టం లేకుండా ఏది జరగదు సరేనా..." కూతురిని శాంతింపజేయటానికి అంది సుహిత.

"ఆంటీ చూడండి...అమ్మ కూడా...ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడితే అమ్మ కూడా అలాగే అంటోంది..." సంధ్య అప్పుడే ఫ్రెష్ అయ్యి వీళ్ళ వాటా దగ్గరకు రాగానే ఫిర్యాదు చేస్తున్నట్టు అంది శాన్వి.

"వేదేష్ ఫోటో చూపించారు. బాగున్నాడు. తెలిసిన వాళ్ళే అని వీళ్ళ తాతయ్య అడిగారు. అయినవి అయిపోయాయి. ఇప్పుడైనా కలుపుకోవాలి అనుకోవటం తప్పా సంధ్య...పిల్లల వల్ల కుటుంబాలు కలిస్తే మంచిదే కదా..." తన మనసులో మాట చెప్పింది సంధ్యతో సుహిత.

"కాలం అన్నిటికీ జవాబు చెబుతుంది శాన్వి...ఇప్పుడే పెళ్లి చేసేసుకో అని ఎవరూ అనట్లేదు కదా...కొంచెం ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి...ఇప్పటి నుంచి చూడటం మొదలు పెడితే అప్పటికి సంబంధం కుదురుతుంది...పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అతనితోనే మాట్లాడదాం..." సంధ్య కూడా సుహిత మాటలనే కొంచెం అటు ఇటు గా చెప్పింది.

"సరే ఆంటీ...మీరు అన్నట్టే ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు అన్నిటికీ అమ్మ అలా చెయ్యి ఇలా చెయ్యి అన్నట్టే రేపు ఒక అబ్బాయి, ఇంకా చాలా మంది నన్ను కంట్రోల్ చేస్తారు. అంతే కదా పెళ్లి అంటే..." కోపంగా అంది శాన్వి.

"సరే అమ్మా...నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉద్యోగం చేసుకో. కానీ తాతయ్య వచ్చినప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం గౌరవంగా మాట్లాడు. అదే తల్లిగా నేను చెప్పగలిగేది." అప్పటికి ఆ టాపిక్ మార్చి వేరే విషయాలు కూతురితో మాట్లాడటం మొదలు పెట్టింది సుహిత.

"మన పింకీ కి మూడు పిల్లలు పుట్టాయి. కింద వాచ్ మెన్ దగ్గర పెట్టా ఇంట్లో ప్లేస్ చాలదు అని..." అంటూ వాళ్ళ పెంపుడు కుక్కపిల్ల సంగతి చెప్పింది.

**** **** ****

"ఏంటి సుహిత, నువ్వు కూడా అలా అంటావు, తన మాటల్లో తప్పు ఏముంది...మీ ఆయన పోయాక ఎప్పుడూ సపోర్ట్ రాని మీ మామగారు ఇప్పుడు సంబంధం అంటే ఎలా ఒప్పుకున్నావు..." కోపంగా స్నేహితురాలిని అడిగింది సంధ్య.

"ఎంతైనా అత్తగారు వాళ్ళు. రేపు శాన్వి పెళ్లికి వాళ్ళు అయినా పెద్ద దిక్కు ఉండాలి కదా..." సంధ్యతో అంది సుహిత, ఈ విషయాలు ప్రత్యేకంగా మాట్లాడటానికి వాళ్లు కలిసి వచ్చిన కాఫీ షాప్ లో కూర్చుని కాఫీ తాగుతూ.

"ఏమోనే... దేవుడి మీద భారం." నిట్టూర్చింది సుహిత.

"ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్టు ఉంది..." ఎదురుగా చిలకా గోరింకల్లా ఊసులాడుకుంటూ ఉన్న యువ జంట ని సుహిత కి చూపించి అంది సంధ్య.

"ఇంకెవరు సంధ్యా !..వేదేష్..." ఆమె గొంతులో కోపం, ఆశ్చర్యం.

"ఇంకా నయం...నువ్వు మాట ఇచ్చావు కాదు..." స్నేహితురాలికి ధైర్యం చెప్పింది సంధ్య.

**** ****

కొన్ని రోజుల తర్వాత...

"అమ్మా...తాతయ్య వచ్చారు..." శాన్వి పిలుపుతో పూజగది నుండి బయటకి వచ్చింది సుహిత.

" ఏమ్మా...కాళ్ళ దగ్గరకి వచ్చిన సంబంధం కాశీకి పోయినా దొరకదు అంటారు...వేదేష్ కి ఏం తక్కువ అని వద్దు అన్నావ్..." కోపంగా అన్నారు శంకర్రావు.

"అన్నీ ఎక్కువే మామయ్య...పెద్ద దిక్కుగా మీరు ఇంటికి వస్తే సరే కానీ ఇంకో సారి ఈ మాట వద్దు నా దగ్గర." కొంచెం కటువుగా చెప్పింది.

"హమ్... ఏంటో కలి కాలం...మంచి చెప్తే ఎక్కద్దూ..." అంటూ విసుగ్గా బయటకు నడిచాడు ఆయన, కోడలు పెట్టిన స్నాక్స్ టేబుల్ మీద వదిలేసి.

"సారు....అది అసలే పిల్లల తల్లి...దాన్ని చూసినా కరిచేస్తది. జర భద్రం..." శంకర్రావు ను చూసి మొరిగిన పింకీ గురించి ఆయనకి జాగర్త చెప్పాడు వాచ్మెన్, శంకర్రావు మొహం చిట్లింపు సంగతి గమనించకుండా.

" ఇంట్లో పిల్లలకే లెక్క లేనప్పుడు కుక్కలకు కూడా లోకువే..." చికాకుగా ఇంటి దారి పట్టాడు శంకర్రావు.

⁃ కాంతి శేఖర్

Tags:    
Advertisement

Similar News