కాళిదాసు-శివతత్వం
సంస్కృత సాహిత్యము అనగానే మనకు వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణము, వ్యాసమహర్షి రచించిన మహాభారతము, తరువాత లౌకిక సాహిత్యం గురించి ప్రస్తావించాలి అనగానే మొట్టమొదటగా స్పురించేది కవికుల గురువు, భారత జాతీయ కవి కాళిదాసు పేరే.
సంస్కృత సాహిత్యము అనగానే మనకు వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణము, వ్యాసమహర్షి రచించిన మహాభారతము, తరువాత లౌకిక సాహిత్యం గురించి ప్రస్తావించాలి అనగానే మొట్టమొదటగా స్పురించేది కవికుల గురువు, భారత జాతీయ కవి కాళిదాసు పేరే.
పూర్వము కవులందరూ ఒకచోట చేరి మన కవులలో ఉత్తమోత్తముడైన కవి ఎవరు అని గణించడం మొదలుపెట్టి ప్రప్రధమంగా చిటికిన వేలు మీద కాళిదాసు లెక్కించారుట, అతనితో సమానమైన మహాకవి లేనందువల్ల ఉంగరం వేలుకు అనామిక అన్న పేరు సార్ధకమయింది అని “పురాకవీణ గణనా ప్రసంగే..........అనామికా సార్ధవతి బభూవ”అని ప్రశంసిస్తారు.
రఘువంశము, కుమార సంభవము అను మహాకావ్యములు, మేఘసందేశం ఋతుసంహారము వంటి ఖండ కావ్యాలు మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలము నాటకాలు రచించిన కాళిదాసు కావ్య నాటకాలు నేటికీని నిత్య నూతనమే అనడంలో ఎటువంటి సందేహము లేదు.
వీటికి వ్యాఖ్యానాన్ని రచించిన కోలాచలం మల్లినాథ సూరి కాళిదాసు కవిత్వాన్ని ,అతని ఉక్తుల సారాంశాన్ని కేవలము కాళిదాసు, బ్రహ్మ ,సరస్వతి దేవి మాత్రమే అర్థం చేసుకోగలరు నా వంటి వారికి సాధ్యం కాదు” అంటూ కాళిదాసు కవిత్వానికి ముగ్ధుడై కొనియాడాడు.
పరమ శివభక్తుడైన కాళిదాసు ముఖ్యంగా మూడు నాటకాలలోనూ అష్టమూర్తి అయిన శివ స్వరూపాన్ని కీర్తించాడు. ఈశ్వరుడు అష్టైశ్వర్య సంపన్నుడు కోరిన ఐశ్వర్యాన్ని ఇవ్వగలచిన వాడు. అర్ధనారీశ్వర స్వరూపుడైన ఆదియోగి. అలాంటి శివ స్వరూపాన్ని ఎవ్వరు తెలుసుకోగలరు. ఏమాత్రం కూడా అహంకారం లేనటువంటి ఆ శివుడిని మనము మోక్ష ప్రాప్తి కొరకు ప్రార్థించాలి అన్న భావన తోటే మాళవికాగ్నిమిత్రనాటకపు నాంది శ్లోకంలో ఈ విధంగా రచించాడు
ఏకైశ్వర్యే స్థితోఽపి ప్రణతబహుఫలే యః స్వయం కృత్తివాసాః
కాన్తాసంమిశ్రదేహోఽప్యవిషయమనసాం యః పరస్తాద్యతీనామ్
అష్టాభిర్యస్య కృత్స్నం జగదపి తనుభిబ్రిభ్రతో నాభిమానః
సన్మార్గాలోకనాయ వ్యపనయతు స వస్తామసీం వృత్తిమీశః ॥1.1॥
నమస్కరించిన భక్తులకు అనంతమైన ఐశ్వర్యము ప్రసాదించువాడైనా, తాను స్వయంగా గజచర్మమును ధరించిన వాడు, అర్థనారీశ్వరుడు అయినప్పటికీ ఆదియోగి, అష్టమూర్తిగా సకల విశ్వమును భరిస్తున్నా నాదను అహంకారము లేనివాడు మీలోని(మనలోని) అజ్ఞానమును పోగొట్టి సన్మార్గము,మోక్షమార్గములోనికి మళ్లించుగాక.
బూడిదపూసుకొని, జంతుచర్మం చుట్టుకొని మరి శ్మశానంలో వున్నవాడు, మన పూజాలందుకొని మన కోరిన కోరికలన్నింటినీ ఎలా తీరుస్తాడుఅన్న సందేహం కలగచ్చు. ‘ఆదిభిక్షువువాడినేమియడిగేది’
అంటాడొకవి.కానీ ఒకటి కాదు అణిమా,మహిమా, గరిమా,లఘిమా, ప్రాప్తిః ప్రాకామ్య,ఈశత్వ,వశిత్వమనే అష్టైశ్వర్యాలు ఆతని ఆధీనంలోవే.
అయినా తనకోసమే వుంచుకోవాలన్న స్వార్థభావనేలేదాయనకు.’గజాజినాలంబి దుకూలధారి వా న విశ్వమూర్తేరవధార్యతే వపుః’ అని కాళిదాసు కుమారసంభవకావ్యంలో సకలవిశ్వమూ శివస్వరూపమే అయినప్పుడు శుభాశుభములన్నీ ఆయనవేగా అంటాడు.
ప్రేమతో హరుడు పార్వతిని శరీరార్ధభాగంగా ధరించగలడు అని ముందే దేవతలు నిర్ణయించేశారు అలాగే కాంతాదేహాన్ని తన శరీరంలో అర్థభాగంగా చేసుకొని భార్యకు సమానప్రతిపత్తి కలిగించాడు.
విషయ వాంఛలు త్యజించిన యతులలో అగ్రణిగా ‘నవరంధ్రములను కట్టివేసి, మనసును స్వాధీన పరచుకొని తనను తనలోనే సాక్షాత్కరింప చేసుకొన్నవాడు అనీ,తత్వవేత్తలు తమ దేహములందు ఎవరిని వెదుకుతారో అతడే శివుడు. ఎవరి స్థానము జన్మరహితమైనదో అదే కైలాసం.ఎనిమిది విధములైన ప్రత్యక్షరూపాలలో (భూమి,నీరు,అగ్ని,గాలి,ఆకాశం, సూర్యచంద్రులు, యజమాని)ప్రపంచభారాన్ని మోస్తున్నా ఏదానిమీద కూడా నాది నేను అనే అహంకారవ్యామోహాలు లేని శివ తత్వం ఎవరెరుగగలరు?
జగశ్శరణ్యుడు, మహాదేవదేవుడు, స్వప్రకాశుడు, సకలలోకపాలకుడు అయిన ఆ పరమశివుని సేవించి మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని జన్మాంతములో శివలోకం పొందుదాం.
- డా.భండారం వాణి