అంతా ఆమే చేసింది
మాటలతో శిలువ వేస్తారని తెలియక
తానే అన్నీ అయి చేసింది
అవును...
ఆమె మాత్రమే చేయగలుగుతుంది!
పురుడు పురుడికి ప్రసవవేదన
బిడ్డ నవ్వుతో పునర్జన్మ
ప్రాణం విసిగిపోతున్న
నరనరాలు తెగిపోతున్న
దేహాన్ని తెగ్గొట్టి మరి జీవం పోస్తుంది!
ఎందుకంటే...
ఆమె ఒక కాలచక్రం
ఆమె ఒక కల్పవృక్షం
ఆమె ఇంటికి మూల స్తంభం!
అన్యాయానికి ఉరుములా గర్జిస్తుంది
వానలా ఆత్మీయత కురిపిస్తుంది
ప్రతి సమస్యకి పరిష్కారం చూపెడుతుంది!
పొదుపు మంత్రం జపిస్తూ...
బిడ్డలను పెంచాలనే తపన
భర్త పరువు కాపాడాలనే బాధ్యత
భుజాన మోస్తున్న త్యాగి తను!
కానీ...
అమాయకత్వాన్ని పోత పోస్తే అమ్మని
అవసరాలు తీర్చే బొమ్మగా చూస్తారని
తెలుసుకోలేక...
మంచి జరిగినప్పుడు మాట్లాడని నోర్లు
సమస్త తప్పిదాలకు మూలమే తానని
నిందలు మోసే అపరాధి అయింది తానిప్పుడు!!
జ్యోతి మువ్వల
Advertisement