జీవన్ముక్తి...!

Advertisement
Update:2023-08-06 18:57 IST

ఉర్వారుక మివ బంధనం అంటే...!!

ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం, అద్భుతంగా గుడి కడతారు... తీరికగా అలంకారాలు అద్దుతారు, తోచినంత సేపు హాయిగా ఆడుకుంటారు...

పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు, కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటి దారి పడతారు...

అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు, ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం... పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు...

‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే....

‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో.. ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో.. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో.. ఆట ముగిసే సమయానికి, వాటిని అదే విధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది...

వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది, పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే..

ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది, అవి ఒక దాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి...

అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగా పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగల ముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది...

ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది, అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి...

అంత వరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది...

ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచు కోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది...

సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర యొక్క మహోపదేశం...

‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం, ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన.. అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది.

మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది, అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు...

Tags:    
Advertisement

Similar News