ఆండాళ్ కి అన్ని పనులు ఒకేసారి చేయాలనే ఆత్రం ఎక్కువ. అవును ఉన్నది ఒకేఒక్క జీవితం. ఆ ఉన్న జీవితంలో ఎన్నో పనులు చేసేయాలనే ఆరాటం ఆమెది. దానికి తోడు అన్నివిధాల చేదోడు వాదోడైన భర్త పరాంకుశం. పిల్లలు పెరిగి పెద్దాళ్ళైపోయి ఎవరి సంసారం వారు చేసుకుంటూ వేరే ఊళ్ళల్లో ఉన్నారు.
ఆండాళ్ కి వంట చేయడం అంటే భలే సరదా, ఇష్టంకూడాను. వయస్సుతో పాటు వచ్చే ఇబ్బందులు ఆమెకు కూడా తప్పలేదు. అలా అని ఆండాళ్ కి మరీ వయస్సు ఎక్కువనుకునేరేమో. కాదు ఆమె వయసు కేవలం యాభై ఏళ్ళు మాత్రమే. మరీ యాభై ఏళ్ళు వచ్చినా కనీసం కళ్ళజోడు కూడా పెట్టుకోకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అందుకే కనిపించీ, కనిపించకుండా కొన్ని అక్షరాలు చదువుతున్నపుడు అది ఆరా, ఎనిమిదా? ఇది ‘కె’ యా ‘ఆర్’ అక్షరమా అని తడబడుతుంటే, పరాంకుశం నీకు మరీ అంత మొహమాటమైతే ఎలాగు ఆండాళ్ళూ? నాకు డబ్బు ఖర్చు అవుతుందనీ ఓ వర్రీ అయిపోకు. అపుడపుడు కొన్ని ఖర్చులు అవి మనకు పెట్టుకుంటేనే అది మన జీవితానికి ఇన్వెస్ట్ మెంట్ అవుతుందనుకుంటే మనస్సు తేలికవుతుంది.
అలా కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు, కళ్ళకి చత్వారం ఉందని డాక్టర్ ఖరారు చేసి, సులోచనాలు పెట్టుకోమని ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చాడు. భలే ఇపుడు కళ్ళజోడుతో ఆండాళ్ మాంచి హుందాగా, చూడ చక్కగా ఉంది. ఆమెకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అన్ని అక్షరాలు స్పష్టంగా కనబడుతుంటే, తను మరింత చలాకీగా అన్ని పనులు చేసేయాలని, సమయంతో పోటీ పడసాగింది. అన్ని పనులు అంటే ఏమీ లేదు. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటుంది. వంటిల్లు తన సామ్రాజ్యం. వాళ్ళ కాలనీలో ఆమెకు ఉన్న స్నేహితురాళ్ళు చాలామందే ఉన్నారు.
ప్రతి వారం ఎవరో ఒకరు ఆండాళ్, పరంధామయ్యను చూడటానికి వచ్చి, పిచ్చాపాటి మాట్లాడి వెడతారు. అందుకని ఆండాళమ్మగారు, సమయం, సందర్భాన్నిబట్టి వండే టిఫిన్, లంచ్, డిన్నర్ అనీ ఆవిడ రుచికరమైన వంటలని వారు ఆరగించి వెడతారు.
ఐతే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! ఈ మధ్య వంట చేసేటపుడు ఆండాళ్ కి ఒకసారి మహా చికాకు వచ్చేసింది. కారణమేమిటంటే వంటింట్లో అలమారా లో ఏ పిండి ఏమిటో నిర్ధారించుకోలేకపోయింది.
ఒకరోజు లేవగానే ఆమెకు భలే ఆకలి వేసేసింది. తను మరియు భర్త వేసుకునే టాబ్లెట్స్ కోసమన్నా సమయానికి వండుకుని తింటారు.
ఆ రోజు స్నానం, పూజాదికాలు ముగించుకుని, త్వరగా అయిపోయే ఉప్మా చేసేద్దాం, చెప్మా అనుకుని అలమారా తలుపు తీసింది. ఈ మధ్యే కాలనీలో టప్పర్ వేర్ ప్లాస్టిక్ డబ్బాలు తనకు తెలిసిన కాత్యాయని కొనమని బలవంతం చేస్తే సెట్ మొత్తం కొనేసింది. డబ్బా మూత తీసి అది బొంబాయి రవ్వనో, ఇడ్లీ రవ్వనో తేల్చుకోలేకపోయింది. కళ్లజోడు పెట్టుకున్నా లాభం లేకపోయింది. అక్కడే సగం సమయం అయిపోయింది. సరే ఇంత సందేహం తో ఎందుకు చేయడమనుకుని, గోధుమరవ్వ ఉప్మా చేసేసింది. అలాగే మరోసారి, ఆనపకాయ పెసరపప్పుచేద్దామనుకుని పప్పు తీసి, నీళ్లల్లో కడిగేసింది. మళ్ళీ సందేహం వచ్చి, ఇది పెసరపప్పా, మినపప్పా అని ఇంకో సీసా తీసి చూస్తే అది తీరా పెసరపప్పు అని నిర్ధారించుకుంది. ఇక చేసేదిలేక ఆ రోజు పెసరపప్పు చేద్దామనుకున్న ఆలోచన మార్చుకుని, కడిగిన మినప్పప్పు రుబ్బి గారెలు చేసింది.
మరో రోజు వర్ధని ఫోన్ చేసి, వాళ్ల అబ్బాయి పుట్టిన రోజుకు రమ్మని పిలిచింది.
“అమ్మాయి! ఏమైనా స్వీట్ చేసి తీసుకురానా?” అని అడిగితే, కాదనలేక వర్దని,
“ఆంటీ! రవ్వలడ్డు ఐతే తొందరగా అయిపోతుంది కదా అది చేసి తీసుకురండి” అంది.
ఉత్సాహంగా పార్టీకి రెడీ అయ్యి, రవ్వలడ్డూ చేద్దామని డబ్బా మూత తీసి,
“ఇది బొంబాయి రవ్వే, నాకే పిచ్చి అనుమానం” అనుకుని డబ్బాలోంచి రవ్వ మూకుడులో కుమ్మరించింది. బోలెడు జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, కొబ్బరి వేసి గరిటతో కలయ తిప్పి, స్టవ్ మీంచి కిందకు దించింది. వేడిగా ఉండగానే, చెయ్యి తడి చేసుకుంటూ లడ్డూలు కట్టింది.
సంతోషంగా రవ్వలడ్డూల డబ్బా వర్ధని చేతి లో పెట్టగానే, ఇంతలో ఆమె కొడుకు వచ్చి లడ్డూ కావాలంటూ తీసుకున్నాడు. నోట్లో పెట్టగానే మొహం అదోలా పెట్టి వెంటనే ఇచ్చేసాడు. ఆ రోజు పుట్టినరోజు పార్టీకి వచ్చిన అందరూ ఆంటీ చేతిరుచి అమోఘం అనుకుంటూ, నోరూరించే లడ్డూ నోట్లో ఇపుడే వేసేసుకోవాలి అని తీసుకోసాగారు. కానీ నోట్లో పెట్టగానే మోహంలో రంగులు మారడం ఆండాళ్ గమనించకపోలేదు. “కొంపదీసి నేను వేరే ఇడ్లీ రవ్వతో రవ్వలడ్డూ చేసానా? ప్రొద్దున్న నేను ఉప్మా చేసినా రుచి ఇలాగే అఘోరించేదా? పాపం ఇవాళ వీళ్ళు బలైపోయారు. నా మీద గౌరవంతో, ఏమీ మాట్లాడలేక ఊరుకున్నారు” అనుకుంది.
తరువాత షాపు వాడిని వెళ్ళి నిలదీస్తే, “పొరపాటయిపోయింది అమ్మగారు. షాపులో కొత్త కుర్రాడికి, ఉప్మా రవ్వకి, ఇడ్లీ రవ్వ కి తేడా తెలియక, రాంగ్ గా ప్యాక్ చేసాడు” అంటూ, విడిగా బొంబాయిరవ్వ పొట్లం కట్టి ఇచ్చాడు.
తరవాత రెండురోజులకు కొడుకు, కోడలు పండగకు ఇంటికి వచ్చారు. ఆ రోజు ఉగాది పండుగ. కొడుకు శ్రవణ్ “అమ్మా! నువ్వు విశ్రాంతి తీసుకో. మనవరాలితో కబుర్లు, కథలు చెప్పు. ఈ మధ్య మీ కోడలు భలే భలే కొత్త వంటలు మహా రుచికరంగా చేస్తోంది, వంటిల్లు శారదకిచ్చేయ్” అన్నాడు.. తన సామ్రాజ్యాన్ని చుట్టపుచూపుగా వచ్చిన కోడలికి అన్యమనస్కంగానే అప్పచెప్పింది ఆండాళ్. శారద ఆ రోజు స్వీట్ మైసూర్ పాక్ చేద్దామని స్మూత్ టెక్సర్ లో ఉన్న పసుపు రంగు పిండి తీసి, డబ్బాలోని తెల్లపలుకులను ఒక కప్ నీళ్ళలో వేసింది. పాకం పడుతూ, అందులో శెనగపిండి అనుకుని ఆ పిండిని వేసి గరిటెతో నెయ్యి వేసి తిప్పసాగింది. ఎంతకీ తను ఊహించినట్లుగా పాకం, పిండి దగ్గిగ పడకుండా వేరే రూపు రేఖలు వస్తుంటే శారదకి కాస్త భయం వేసింది.
సరే, పప్పు చేద్దామని కందిపప్పు కుక్కర్ లో వేసి సాల్ట్ పెప్పర్ కంటైనర్ టేబుల్ మీద చూసి వెంటనే ఉడికించబోతున్న పప్పులో వేసేసింది. 15 నిమిషాలకి కుక్కర్ మూత తీసినా, పప్పు అసలు లొంగను, ముద్దకు కొరుకుడు పడను అని మొరాయించి, పలుకులు పలుకులు గానే ఉంది.
శారద కనీసం కూర అయినా బాగా చేద్దామని, బెండకాయలు తరిగి, నూనె వేసి వెంటనే ముక్కల పై ఉప్పు చల్లింది. కూర మాట ఎలా ఉన్నా అంతా జిగురుగా తయారయ్యింది.
భయం, భయంగా “శారద అత్తయ్యా, ఒకసారి ఇలా వస్తారా?” అని పిలిచింది. ఏమిటి శారదా? అందరం భోజనాలకి కూర్చుందామా? అనగానే, శారద భోరుమంది. “అత్తయ్యా! ఐ.టి జాబ్ ప్రోగ్రామ్స్ క్షణంలో రాసేయగలను గాని, నేను వంటింటికి ఆమడ దూరం. ఏదో మొన్న అదృష్టం బాగుండి, యూ ట్యూబ్ లో స్నేహితురాలి సాయంతో ఒక స్వీట్ చేస్తే బాగా వచ్చింది. మీ అబ్బాయి, అమ్మను కష్ట పెట్టకు, ఈ సారైనా నువ్వు వంట చెయ్యి అని నన్ను బలవంతం చేసారు. తీరా వంటింట్లో ఏ వస్తువు ఏమిటో అర్థము కాలేదు. మైసూర్ పాక్ చేద్దామనుకున్నాను, ఇదిగో ఇలా తయారయ్యింది.”
“శారదా! అది శెనగపిండి కాదు, ఈ మధ్య రాత్రి, నేను, మీ మామయ్య జొన్న రొట్టెలు తింటున్నాము. అది జొన్న పిండి. అది పంచదార కాదు. అయొడైజ్ డ్ ఉప్పు.
కందిపప్పు వండేటపుడు ముందే ఉప్పు వేస్తే అది అసలు ఉడకదు.పూర్తిగా మెత్తబడ్డాక, ఉప్పు, వేయాలి. వేరే ఆకుకూర పప్పు ఐతే కాస్త చింతపండు పులుసు పోయాలి.
బెండకాయ వేపుడు చేస్తే చివర్లో ఉప్పు వేయాలి. అన్నిటికి ఒకే మంత్రం పనికిరాదు. కూరగాయలలో నీరు, గుణగణాలని బట్టి ఒక్కోవిధంగా వండాలి. క్యాబేజీ కూరకు ముందే ఉప్పు వేసి, పోపులో మగ్గపెట్టాలి. వంకాయ కూరకి కూడా ముందే ఉప్పు, కాస్త నీళ్లు చల్లి మగ్గపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి.
ఈ మధ్య పచారీ సరుకుల షాపుకి వెళ్ళి, జీలకర్ర అడిగితే, దిల్ సీడ్స్ ప్యాకెట్ చేతిలో పెట్టాడు.
ఒక్కోసారి వంట తారుమారైనా, కొద్దిపాటి తెలివితేటలతో వాటికి రిపేర్ చేసి రూపురేఖలు మార్చి, రుచి పుట్టించొచ్చు. ఇదిగో నువ్వు మైసూర్ పాక్ చేద్దామనుకున్న ఈ మిశ్రమంలో కాసింత ఉల్లిపాయలు, బియ్యంపిండి కలిపి పకోడీగా తయారుచేయవచ్చు.
అపుడపుడు మనం పిండి డబ్బాలో పోసినపుడు,డబ్బా ఒకేలా ఉండి, పిండి ఒకే రంగులో ఉంటే గుర్తించడం కష్టమవుతుంది. నేను కూడా ఏమరుపాటులో ఉంటే బియ్యం పిండి, మైదాపిండి వీటికి తేడా తెలుసుకోవడం కష్టం. ఒక్కోసారి చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది.”
“అవును అత్తయ్యా! ఈ మధ్య మా ఫ్రెండ్ ఇంటికి వినాయక చవితికి పిలిస్తే వెళ్ళాను. అది బియ్యంరవ్వ అనుకుని, ఇడ్లీ రవ్వతో ఉండ్రాళ్ళు చేసేసింది. ఎలాగో కుస్తీ పట్టి తిన్నాము, ప్రసాదం పడేయలేము కదా!”
అవును శారదా, తినే అన్నానికి కూడా నీళ్ళు సమపాళ్ళలో పోయాలి. ఈ మధ్య కొత్తగా పెళ్ళైన వసంత పై వాటాలో ఉంటుంది. ఆంటీ అన్నం పేస్ట్ లా తయారైంది. ఆయన కోపంగా ముఖం మాడ్చుకున్నారు. ఇపుడు ఎలా? అని నా దగ్గరికొచ్చింది.
అన్నం సరిగా ఉడకకపోయినా, అతిగా మెత్తగా, లేదా బిరుసుగా ఉన్నా కలుపుకునే ఆవకాయ ఊరగాయలు, కూరలు రుచించవు, తినబుద్ధి కాదు. ఒక గ్లాసు బియ్యానికి, రెండు గ్లాసులు నీళ్లు పోయాలి. ఒక్కోసారి బియ్యం పాతవి, కొత్తవి అయితే నీళ్ళు కొలత అడ్జస్ట్ చేసుకోవాలి. వంటకూడా మేథమేటికల్ మెసర్మేంట్సే అనుకో!
హోటల్ లో అపుడపుడు నెలకి ఒకటి, రెండుసార్లు బయట తింటే ఫర్వాలేదు. కాని ఇంటి భోజనానికి సాటి మరేది లేదు. వంట వండటంలో కిటుకులు తెలుసుకుంటే, కుకింగ్ ఈస్ ఈజీ అన్డ్ ఫన్.”
అత్తయ్యగారు, నర్మగర్భంగా తనకు మంచి మాటలు తెలియచెపుతున్నారన్న విషయం శారద గ్రహించక పోలేదు.
తనలోని ‘నేను’ అన్న ఇగోని పూర్తిగా పక్కకి నెట్టేసి, ఆవిడలో సొంత తల్లిని చూసుకుంది.
ఇంతలో పరాంకుశం గారు, వంటింట్లోకి వస్తూ ముక్కుపుటాలదురుతున్నాయి, “అత్తా, కోడళ్ళు కలిసి వంటిట్లో ఉన్నారంటే బ్రహ్మాండమే, మాకు పంచభక్ష్యపరమాన్నలు వడ్డిస్తున్నారా?”
లేదు మామయ్యా!, అత్తయ్యగారి చేయి పడితే గాని వంటకాలకు అమోఘమైన రుచి రాదు”
“మీ అత్తయ్య, పెళ్ళైన కొత్తలో వంట రాకపోయినా, కష్టపడి అన్నీ నేర్చుకుంది. ఏ వంట చేసినా మనసు పెట్టి, తినే వాళ్ళను దృష్టిలో పెట్టుకుని, ఆరోగ్యకరంగా సరైన పాళ్ళలో మసాలా దినుసులు జోడించి, రుచికరంగా చేస్తుంది.”
ఏంటి, శారదా, అమ్మ దగ్గర వంటింటి కిటుకులు, ట్రేడ్ సీక్రెట్స్ నేర్చేసుకున్నావా?” అన్నాడు శ్రవణ్
“మొత్తానికి తెలివిగా నన్ను వంటింట్లోకి తోసేసి, వంట రాని నాకు ఈ రోజు అత్తయ్యగారిచేత మంచి వంటింటి పాఠాలు నేర్పించేసారు.” అంది శారద.
తాంబూలం ఇవ్వడానికి అక్కడకు వచ్చిన పక్కింటి కామేశ్వరి, “ఆంటీ! మా బోటి వాళ్లం ఏదో యూట్యూబ్, టీవీ ఛానెల్స్ లో వచ్చే కొత్త, కొత్త వంటలు చూసి మోడ్రన్ వంటకాలు చేస్తాం. కానీ సంప్రదాయకమైన వంటకాలు మీలాంటి పెద్దవారిదగ్గరే నేర్చుకోవాలి.”
ఎంత పెద్ద చదువులు, ఉద్యోగాలు చేసినా, వంట చేయడం ఒక బాధ్యత అనుకోవాలి, దానిని విస్మరించకూడదు.” అని సందేశాత్మకంగా చెప్పింది ఆండాళ్.
“ఆంటీ!, పులిహోర ఎంతమంది చేసినా, మీ చేతి రుచి ఒక్కటే అద్భుతంగా ఉంటుంది.
ఆంటీ, నేను ఈ మధ్య టొమాటో రసం చేసాను. మా వారు, మా అమ్మ చేసిన చేతి వంటలా బాగుంది, రసం చాలా బాగుంది. అన్నారు”, అంది కామేశ్వరి.
“అది నిజంగా చాలా గొప్ప కాంప్లిమెంట్.”
ఇంతలో శారద, “అత్తయ్యగారు, సాంబార్ పొడి కి, రసం పొడి కి తేడా ఏమిటి?” అని అడగ్గానే
“నేను నీకు రెండు పొడులు చేసిస్తాను.
రసం పొడి లో మిరియాలు, సాంబారు పొడిలో మినప్పప్పు పాళ్ళలో కొద్ది తేడా ఉంటుంది. ఇక ఉడిపి సాంబార్ చేయాలంటే అప్పటికప్పుడు పేస్టులా తయారు చేసి చిక్కగా చేస్తారు. దగ్గు, జలుబు మటుమాయం. మనం వంటిటిలో దినుసులని సరిగా వాడుకుంటే, సగం రోగాలు ఏ మందులు లేకుండా తగ్గించుకోవచ్చు”.
“అవును చాలా బాగా చెప్పారాంటీ!
వీడియో చేసి, యూ ట్యూబ్ లో పెట్టొచ్చు కదండీ!”
“వద్దమ్మా! కొన్ని అనుభూతులు, మనకి ప్రత్యేకమైనవి, మనుష్యుల మధ్య బంధాలు బలపరిచేవాటికి, పబ్లిసిటీ అక్కర్లేదు. మనిషి, మనిషి కలిసినపుడు అప్యాయంగా పలకరించుకుని, కడుపునిండా చక్కని రుచికరమైన ఆహారం పెట్టగలిగితే అదే చాలు.”
“అవును ప్రతి మనిషికి, మంచి ఆలోచనలకు, మంచి ఆహారం అవసరం” అంటూ శ్రవణ్ అమ్మ చేతిని ఆప్యాయంగా పట్టుకున్నాడు.
- గొల్లపూడి విజయ ( సిడ్నీ)