అవి నా భార్య జగదీశ్వరి మొదటి కాన్పుకుపుట్టినింటికి వెళ్ళిన రోజులు.వెళ్ళి వారం రోజులేఅయినా,ఏడు యుగాలైనట్టుంది. “భార్య లేకపోతే మగవాడి జీవితం యింత దుర్భరంగాఉంటుందా?”అనిపించింది. దుర్భరమే మరి.దానికీ కారణం లేకపోలేదు.
ఉదయం స్నానసంధ్యాదులు ముగిశాక-7 గంటలకు తేనె,నిమ్మరసం కలిపిన వేడినీరు,8 గంటలకు బ్రేక్ ఫాస్ట్,ఇడ్లీ,దోసె,పూరీ ఏవైనారెండు, అదీ కొలత వేసినట్లు 150 గ్రాములు మాత్రమే. ఆ తర్వాత ఒక కప్పు కాఫీ, 11 గంటలకు తేనె,నిమ్మరసం కలిపిన ఆకుకూర జ్యూస్,ఇవ్వకపోతే, ఆఫీసులో ఫ్యూన్ తల పగిలిందే!
12.30 గంటలకు ఒకగ్లాసు
వేడినీరు, 1గంటకు లంచ్,అదీ పరస్పర విరుద్ధలక్షణాలు లేని,నూటికి నూరు పాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం.మీకెలా తెలుసంటారేమో! వారి తాతగారి ప్రకృతి
వైద్య విధానాలన్నీ, మా జగతి పుణికిపుచ్చుకుంది. 3 గంటలకు డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇంటికివచ్చాక ఓ కప్పు బాదంటీ,8 గంటలకు పుల్కా
ఆకుకూర,పండుకోబోయే ముందు ఓ గ్లాసుడుపాలు ఇదీ నాడైట్ షీట్.
ఏంటీ?ఏదో కథ వ్రాస్తాడనుకుంటే, తనడైట్ షీట్ వ్రాస్తున్నాడనిబోర్ ఫీలవుతున్నారా?తప్పదు, నన్నంత అపురూపంగా చూసుకొనే
నా భార్య గురించి నలుగురికీ చెప్పుకోవటంనాకు గర్వకారణమే కదా?
బయటకు చెప్పుకోకూడదు కానీ, మా మధ్య”అది”కూడా వారానికి ఒక్కరోజు మాత్రమే.అంతకు మించి ఎప్పుడైనా ముచ్చటపడితే....యికచూడండి,ఓ గంట క్లాసు తీసుకొంటుంది. ఎనర్జీని బ్యాంక్ బాలెన్స్ లా పొదుపుగా, అదుపుగా వాడుకొంటే చిరకాలం ఆరోగ్యంగా,ఆనందంగా ఉండవచ్చట.
ఉదయం సూర్య నమస్కారములు, సాయంత్రం యోగాసనాలూ షరా మామూలే!
“దీని దుంపదెగ!ఆహార వ్యవహార శృంగారవిషయాలలో,దీనికింత పరిజ్ఞానమా”అంటూ ఆశ్చర్య
పోతుంటాను.ఏదియేమైతేనేం ఆఫీసు విషయాలుతప్పఇతరవిషయాల్లోనాకేమాత్రం టెన్షన్ లేకుండా అన్నీ తనేచూసుకొంటుంది.
ఆ రోజు ఆదివారo కావటంతో,ఫారిన్ విస్కీరెండు పెగ్గులు వేసి, డిన్నర్ పూర్తిచేసి 555 సిగరెట్ వెలిగించి(ఇదీ తన పర్మిషణే సుమా)టి.వి లో ఏదో పాత సినిమా వస్తుంటే చూస్తూకూర్చున్నాను.
* * *.
అప్పుడే ఫోన్ రింగయ్యింది.చూస్తే ఉమా!‘ఉమ’అంటే యెవరో స్త్రీ యనుకునేరు సుమా!నా స్నేహితుడు, పైగా స్వర్గస్తురాలైన నా చెల్లిభర్త.
సెల్ ఆన్ చేసి”చెప్పరా!”అన్నాను.
“నీతో ఒకవిషయం చెప్పాలి”!ఎలా చెప్పాలోఅర్థం కావటంలేదు.
“ఏమిట్రా అంత అర్థంకాని విషయం?”
“నేను...మళ్ళీపెళ్ళిచేసుకోవాలను
కుంటున్నాను”.
“అవునా?” అంటూ ఆ మాట వినగానే ఎగిరి గంతు వేశాను.
“నీ ఉద్దేశం కూడ తెలుసు కుందామని! అమ్మ పోయాక పిల్లల్ని సరిగ చూసుకోలేక పోతున్నాను. ఇబ్బందిగా వుంది”.
“ఆవిషయం చెల్లిచనిపోయినపుడె అందరం చెప్పాంకదరా! మామాటవిన్నావా?సరే,అమ్మాయెవరు?వివరాలేమిటి?”
“ఆ అమ్మాయికి ముందూ,వెనుక ఎవరూలేరు. ఒక కామాంధుడికి బలై అతని బిడ్డకుతల్లైంది.ఇంటిదగ్గర ఓ పదిమందికి ట్యూషన్ చెప్పుకొంటూ బ్రతుకుతుంది”.
“అలాగా?ఊరేంటి?పేరేంటి?పెళ్ళి కాకుండానే తల్లయిందంటున్నావ్?”
“ఆ దౌర్భాగ్యుడు చేసినపనికి అమ్మాయినితప్పుపట్టటం సరికాదు.
ఆ భేదం తప్ప యిద్దరం ఒకేదారిలో పయనిస్తున్నాం, పైగా ఎన్నోరోజులుగా ఆమెను గమనించితీసుకున్న నిర్ణయమిది.అందుకని నేనే పెళ్ళికి ప్రపోజ్ చేశాను.ఆమె ముందు సందేహించినా తర్వాత కన్విన్సయ్యింది. శుక్రవారం అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో.పూలమాలలు మార్చుకొనిరిజిష్ట్రాఫీసులో,రిజిష్టర్ చేయించు కొందామనుకుంటున్నాం”.
“మరి కన్నా, చిన్నాలకు ఈ పెళ్ళి గురించిచెప్పావా?”
“చెప్పారా!అసలీ ఆలోచనకు ముఖ్యకారకులువారే! వారికి ట్యూషన్ టీచరుకూడఆమే!ముహూర్తం వారంరోజులు కూడా లేదు.నువ్వురేపు ఉదయమే బయలుదేరివచ్చెయ్. ఇక్కడ
నా కొక్కడికీ కాళ్ళూచేతులూ ఆడటం లేదు. పైగా సంధ్యకు పిల్లలతోనే సరిపోతుంది”.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఆ పేరువిని,
“సంధ్యా?ఆవిడెవరు?”
“చెప్పటంమర్చిపోయాను.అమ్మాయి
పేరదే”
నా మనస్సులో ఒకప్పటి ఆలోచనలుమెదిలాడాయి. ఏదో తెలియని ఆందోళన.
“విజయ్!’...విజయ్!..అంటూ అవతలబావగొంతు విన్పిస్తున్నా....నా ఆలోచనా, నా ఆందోళనా ఆ పిలుపునుడామినేట్ చేశాయి”
మరోసారి బిగ్గరగా విన్పించగా ఉలిక్కి పడి“ఆ”అంటూ బదులిచ్చాను.
“ఏమిట్రాఅంతపరధ్యానం! సరే,సరే...రేపుఉదయం బయలుదేరి వచ్చెయ్”.
“అలాగే”అంటూ సెల్ టీపాయ్ పైపెట్టి7,8 సంవత్సరాలు గతంలోకి వెళ్ళిపోయా!
* * *
“మామయ్య గారింటికి వెళుతున్నాం!ఈ రోజు ఆఫీసు నుండి త్వరగా ఇంటికి రమ్మ”ని అమ్మ ఉదయమే చెప్పటంతో కాస్త ముందు
గానేయింటికివచ్చాను.
“సంక్రాంతి పండుగకు రమ్మని ఐదేళ్ళనుండి పిలుస్తున్నా,మనం ఏవో సాకులు చెప్పి తప్పించు కుంటున్నామని, ప్రతి సంవత్సరం బ్యాంకులో పంపించే పంటడబ్బు, ఈ సారి మీరే వచ్చి
తీసుకొనివెళ్ళండని. నిష్ఠురంగా చె ప్పాడు మామయ్య.మనను చూడాలనియెంత బెంగపెట్టుకుని ఉండకపోతే ఆమాటంటాడు .అసలు ఆ దిక్కుమాలిన మోకాళ్ళనొప్పులే
లేకుండావుంటే నెలకోసారైనావచ్చి చూసి వెళ్ళే వాడు. మనమంటే అంతప్రేమ తనకు. చిన్న తనంలో గుర్రంఆటలోనన్నెక్కించుకొనిమోసిన మోకాళ్ళవి. ఈ రోజు అడుగుతీసి అడుగు పె ట్టాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో !”
అమ్మ గొంతు జీరబోయింది, చిన్నప్పటిజ్ఞాపకాలతో. పమిటచెంగుతో కళ్ళుతుడుచుకుంది. విషయంనుండి అమ్మను డైవర్ట్ చేద్దామని“సరే!నేను ఫ్రెష్షయివస్తాను, నువ్వీలోపు.
మాంచి కాఫీపెట్టి తీసుకురా”! అంటూ నేనువాష్ రూమ్ కి వెళ్ళాను.
నేను వచ్చేలోగా కాఫీ తెచ్చిచ్చింది.త్రాగుతుండగా”మీనాన్న, మామయ్యకి పొందూరుఖద్దరంటే ఇష్టమనీ, ఒక తాను తెస్తాననీవెళ్ళి గంట సేపయ్యింది. ఇంత వరకు వచ్చారేమో చూడు.”అంటూ ఎదురు చూస్తూ కూర్చుంది.
అమ్మ ఆత్రానికి నాకు నవ్వు వచ్చింది. నాన్నరావటంతో అదరాబిదరా లేచి”పదండి పదండి అమృత గడియలు మించి పోతున్నాయ్”అంటూ లేచి హడావుడి చేయటం మొదలు
బెట్టింది.కారెక్కి బయలుదేరాం.
*. *. *.
చుట్టూ బంగ్లాపెంకుతో వసారా దించిన రెండంతస్తుల భవనం. ఓ చిన్నసైజు రాజభవనంలా ఉంటుంది అమ్మ వాళ్ళ పుట్టినిల్లు.
కోడి కూతలతో “4” గంటలకే మెలకువవచ్చింది. వాటికి మరికొన్ని కోరస్ గా, ఒకదానితర్వాత మరోటి.ఇకనిద్రేంపడుతుంది.
రాత్రి మేం రాగానే ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషించారు. అర్థరాత్రి వరకు ఎన్నో కబుర్లుఒక సినిమాలా దృశ్యీకరించి చెప్పుకున్నారు.
“రేపు ఉదయమే లేచిపోవాలి ఇక పడుకోండర్రా” అంటూ అమ్మమ్మ హెచ్చరించటంతో అంతా నిద్రకుపక్రమించారు.
మరునాడు భోగి కావటంతో రోడ్లపై అంతాకోలాహలంగా వుంది.తలుపు తీసుకొని బయటకువచ్చాను.వీధులూడ్చి
కలాపి చల్లేవాళ్ళూ,ముగ్గులు
వేసేవాళ్ళూ,గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించేవాళ్ళూ, మరొకవంక భోగిమంటలు వేసేవాళ్ళతో ఆనందంగా వెలిగి పోతొంది పల్లె.
అప్పుడే రాముడు పైకివచ్చి ఆనందంతో “ఇక్కడుండి ఏం జూత్తన్నారయ్యా పండగంతా కిందుంటేనూ...అందరూ తమర్ని ఎంటబెట్టుకొని తీసుకు రమ్మంటన్నారు,పదండి పోదాం”
అంటూ. చేతులు పట్టుకొని క్రిందకు తీసుకొని వచ్చాడు
వాడి చనువులో నిజమైన ప్రేమవుంది.పట్టణాల్లో అది కృతకంగా వుంటుంది.ఒకరకంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకు ప్రస్తుతానికి చిరునామా రాముడి లాంటి వారే!
మామయ్యగారి భోగిమంటల దగ్గరకువెళ్ళాం.”ఏమిటీ, అప్పుడే సూర్యుడుదయించాడా” అనిపించేలా ఆ మంటల వెలుగులో దర్శన మిచ్చిందొక యువతిముఖారవిందం.
తనూ,జగదీశ్వరీ ఏవో ముచ్చట్లాడు కొంటున్నారు.
జగదీశ్వరి కూడాఅనాకారేంకాదు.
అందంలో యిద్దరూ కవలల్లా ఉన్నారు. పల్లె సొగసులన్నీ వారిద్దరి యంగసౌష్టవంలో ఒదిగిపోయి
నాయా...అనిపించింది.
భోగి మంటల కార్యక్రమము పూర్తయింది.అందరూ ఆమంటల్లో కాగిన నీళ్ళతో స్నానాలు చేశారు. ఆడంగులంతా ఫలహారాలు తయారుచేసే కార్యక్రమాల్లో మునిగి పోయారు.ఈ లోపు అందరికీ కాఫీలు తెచ్చియిచ్చింది రాముడి భార్య సీతాలు.బయటంతా హరిదాసుల భజనగీతాలు,గంగిరెద్దుల వారి సన్నాయి వాద్యాలు,జంగమదేవరల శంఖారవాలు,అప్పుడప్పుడునేనూ ఉన్నానంటూ మామయ్యగారి పెరట్లో
మామిడి చెట్టుపై నివాసం ఉంటున్న కోకిలలకుహుకుహుగీతాలూ,ఎంతైనా పల్లెబ్రతుకుల ఆనందమే ఆనందం,
*. *. *.
రాముణ్ణి ఆ అమ్మాయి గురించి అడగ్గావారిది కాకినాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరనీ,వాళ్ళనాన్నగారికి కాకినాడలో ఉద్యోగంకావటంతో అక్కడే వుంటారనీ,ఒకరోజు కాకినాడనుండి
నుండి రాజమండ్రి వస్తూ ఏక్సిడెంట్ లో తల్లితండ్రులు హఠాత్తుగా చనిపోయారనీ, వారు మామయ్యగారి ప్రాణస్నేహితులు కావటంతో పోతూపోతూపాతికెకరాలమాగాణ్ణి,సందెమ్మ గోరినిమామయ్యగారి చేతుల్లోపెట్టి చనిపోయా రనీ నాలుగుమాటల్లో
వివరాలన్నీ చెప్పేశాడు।
అది వినగానే, ఆమెపై సానుభూతో,ప్రేమోఅర్థంగాని ఒక అయోమయ భావనంఏర్పడిం ది నాలో!ఆమెతో మాట్లాడాలనే తపనా,ఆమె కు ధైర్యం చెప్పాలనే,ఏవేవో విచిత్రమైన కోరిక లు మనసును ముసురుకుంటున్నాయి.
ఒకరోజు వీలు చూసుకొని ఒంటరిగా ఉన్నసమయంలో సంధ్యతో మాటలు కలిపాను.పట్నంలో పుట్టి పెరిగిందేమో బెరుకు లేకుండమాట్లాడింది. మాటతీరులో ఆమెలోస్వచ్ఛత కనిపించింది. ఆ స్వచ్ఛత కారణంగానే నాలో ఆమెపై ప్రేమకు బీజం పడిందేమో!
అలాఅలా మా పరిచయం క్రమక్రమంగాపెరిగిపోయింది.ఒకరి
భావాలు మరొకరికిచెప్పుకొనేంత సాన్నిహిత్యంగా మారి అది మాప్రేమ
కు దారితీసింది.ఒకరినొకరం ఓ రోజైనా చూడకుండా ఉండలేని స్థితికి వచ్చింది.
ప్రతిరోజూ సంధ్యకు వేణుగోపాల స్వామిఆలయానికివెళ్ళేఅలవాటుండటంతో అదే మా సంకేతస్థలమై పోయింది. ఐదురోజుల నా సెలవు కేవలం ఆమె కోసం ఇరవై రోజులకు పెరిగి పోయింది.
ఎంత రహస్యంగా ఉన్నా మా విషయంరాముడు పసిగట్టాడు. ఒకరోజు ఎవరూ లేకుండా చూసివాడు “అయ్యగారూ! సందెమ్మగారి
ఇసయంలో తమరిట్టా సేయటం ఏం మంచిగలేదండి”!
“ఎంతో అమాయకంగా కనిపించే రాముడిమాటలు వినగానే కంగుతిన్నాను. అంతలోనే తెప్పరిల్లి, మామధ్య చనువుండటంతో బెరుకులేకుండా అసలు విషయానికొచ్చాను”.
“ఏం?ఎందుకలా అంటున్నావ్?మేమిద్దరం పెళ్ళిచేసుకోవాలను కుంటున్నాం”.
“ఓరి భగవంతుడో!అదింకా పెమాదం.ఆ యమ్మగారు మనింట్లోఉండటమే అత్తయ్య
గారి కిట్టం లేదు. మీ పేమ ఇసయం ఆవిడగా రికి తెల్సిందంటేఇల్లుపీకి పందిరేసుద్దిబాబూ ఎందుకంటే!......జగతమ్మ గోరిని తమరి కిచ్చిపెళ్ళి సేయాలని అత్తయ్యగారి ఆలోసిన.ఇప్పుడైతే తమరందరున్నారని నోరిప్పటంనేదుకానీ పెతిరోజు ఆ పనిసెయ్యి, ఈ పనిసెయ్యి అంటూ పీక్కుతింటదనుకోండి.మీ మావయ్యగారి సేతి వాటానికి, ఆ జగతమ్మ గారి నోటి వాటానికీ దడిసి ఊరుకుంది కానీ,నేకపోతే ఎప్పుడో ఈ ఇంట్లోంచి బైటికి పంపేసేదండి”.
“అదేంటి? తనను వాళ్ళేం పోషించడంలేదుకదా?ఉండటానికి నీడేగా యిచ్చారు”!
“అసలుఇసయంఅదికాదులెండి.
సదూకునే రోజుల్లో,సందెమ్మగారి అమ్మగారూ,తమరిమావయ్యగారు సనువుగా,రాసుకు పూసుకు
తిరిగేవారని ఏ మకానుబావుడో మీ కాంతమ్మత్తయ్యగారి చెవిలోవూది పుణ్ణెంగట్టుకున్నాడు.అంతకు ముందు బాగానే చూసుకునేది. ఆ తరవాతే మారిపోయింది.
అయినా అనకూడదు కానీ ఈ చుట్టూపదూళ్ళల్లోమామయ్యగారికే రిమారుకు లేదనిఅత్తయ్య గారికి తెలుసుగంద.ఆ ఆలోసెనే లేక
పోయె”!
“ఎవరి ఆలోచనలెలావున్నా సంధ్యను పెళ్ళి చేసుకునే విషయంలో నేనెవరి మాటవినను రాముడూ”!
“మరి అమ్మగారూ,నాన్నగారూ ఏమంటారో!”
“వాళ్ళు నా మాట యెప్పుడూ కాదనరు”.
“అయితే ఇబ్బందే లేదు”.
*. *. *.
సంధ్యరెండురోజులుగా గుడికి రావటంలేదు.కారణం తెలియదు. ఇంట్లో ఎదురైనప్పుడు ఏ వంకతో పలకరించాలని చూసినా ముక్తసరిగా సమాధానమిస్తుంది. బహుశా పిండివంటలపనుల్లోఅలసిపోయి ఉంటుందేమో అందుకే రాలేక పోతుందేమోనని సరిపెట్టుకున్నాను.
మరో రెండురోజులుఎదురుచూసినా లాభంలేకపోయింది.ఇకలాభంలేదని ఒకరోజు గుడికివెళ్ళి రాముడితో కబురుపంపించాను.ఏమనుకుందో ఏమో వచ్చింది.
“ఏమిటి దేవిగారి దర్శనం కరువయ్యింది?”
“దేవుడు దయ్యమని తెలిసికూడ రావటందేవికి ప్రమాదమని”!
“ఏమిటి నువ్వు మాట్లాడేది?”
“చిన్నప్పుడే నీకూ, జగతికి పెళ్ళినిశ్చయమైపోయింది. త్వరలోనే మీ యిద్దరికీ పెళ్ళి జరుగబోతుంది. ఈ విషయాలన్నీ మాట్లాడటానికే
మీ పేరెంట్స్ యిక్కడకు వచ్చింది. ఈ విషయాలన్నీ దాచి నాతో ప్రేమనాటకం నడిపారంటే మిమ్మల్ని ప్రమాదకారిగా కాకుండా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? నా టైమ్ బాగుండి మీకునేను మనసు మాత్రమే యిచ్చాను. లేకుంటే,
మై గాడ్ నా పరిస్థితి యేమిటి? ఆ దేవుడే నీ బారినుండి నన్ను కాపాడాడు. అందుకు ఆ దేవుడికి శతకోటి ప్రణామాలు”!
“ఏమిటీ?నేనేదో గూండానో, హంతకుణ్ణో,లేకుంటే వేల,లక్షలకోట్లు దోచిన బందిపోటునో అన్నట్లు మాట్లాడుతున్నావ్!”
“మరిప్పుడు మీరు చేసిన పనికి ఏమంటారో మీరే చెప్పండి?
“చిన్నప్పుడు మాటవరుసకు ఆ సమయం, సందర్భాన్ని బట్టిఎన్నో అనుకుంటారు పెద్దలు. అవన్నీ జరగాలని రాసిపెట్టిఉందా? అయినాఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు?”
“నాకెవరూ చెప్పలేదు.నా అదృష్టం, రాత్రి ఆంటీ అంకుల్ మీ పెళ్ళి విషయంమీ పేరెంట్స్ తో మాట్లాడుతుంటే విన్నాను”.
“ఇదిగో! మళ్ళీ నేనేదో మోసగాడి నన్నట్టుమాట్లాడుతున్నావ్? మన ప్రేమవిషయం తెలి యక వారేదో మాట్లాడుకొని ఉండవచ్చు. మన
విషయం చెప్పి, ఇప్పుడే వాళ్ళను మన పెళ్ళికి ఒప్పిస్తాను.పద!”
“అఖ్ఖర్లేదు.మీకు,మీప్రేమకు,మీపెళ్ళికీ ఓ నమస్కారం దయచేసి నన్నువది లెయ్యండి."అంటూవెళ్ళి పోవటానికి సిద్ధమైంది. ఎంతగా బ్రతిమాలినా,
ఎన్ని విధాలుగా నచ్చచెప్ప చూసినా,
నా మాటలువినలేదు సంధ్య.
“మీ ప్రేమ నిజమై వారిని ఒప్పించినానేనందుకుసిద్ధంగాలేను.
పైగా చిన్నప్పటినుండి వారిమాటలు వినీవినీ మీరేదైవంగా భావించి
మీ పైన పిచ్చిప్రేమను పెంచుకుంది జగతి.ఆఅమాయకురాలి స్థానాన్ని నేను ఆక్రమించు కొని తనకు ద్రోహం చేయలేను”. అని అక్కడనుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేసింది.
ఆమెకు అడ్డువెళ్ళాను.ప్రక్కగా వెళ్ళాలనిచూచింది.నేనుగట్టిగా పట్టుకున్నాను ఆ పెను గులాటలో మగాడిననే అహంపెరిగింది. పైగా తగలరాని తావులొకరివి మరొకరికి తగిలాయి. ఆడదానిశరీరం తాకటం నాకు అదే ప్రథమం కావటం చేత, మనస్సు కోరుకోదగని కోరికలను కోరటం ప్రారంభించింది. ఆ కోరికలు తీర్చుకోవ టానికి నన్నొక పశువుగా మార్చేసింది.
ఆమె ఏడుస్తూ ప్రాథేయపడుతున్నా, నా రాక్షసత్వం అంతకంతకూ పెరిగి పోయింది. అందునా, నా మాటవినని ఆమె పెంకితనం, అపార్థం, ఆ రాక్షసత్వానికి ఊతమిచ్చాయి.
ఫలితంగా ముగ్ధమోహనమైన పువ్వులాంటి ఆమె జీవితం క్రూరంగా అతి దారుణంగా నాకోర్కెల
రక్కసిపాదాలక్రింద నలిగి పోయింది.
నా ఆవేశం చల్లారి పోయింది.
తుఫాను తరువాత ప్రశాంతత.తప్పు తెలుసుకొని ఓదార్చటానికి తన దగ్గరకు వెళ్ళే వ్యవధి లోనే ఆమెలేచి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వడివడిగ వెళ్ళిపోయింది. మావయ్య వాళ్ళతో చెప్పి తన పరువు తీసేస్తుందా! అని ఒక్క క్షణంపాటు ఆందోళన పడ్డాను.
పరువు; పరువంటూ నా కొకటేడ్చిందా?అదేవుంటే,ఒక ఆడదాన్నిలా పాడుచేస్తానా?
పరువంటే ఏమిటి? దాని ఉనికేమిటి? దానిలక్షణ మేమిటి?మనిషిపై దానిప్రభావ మేమిటంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను.
పరువు అసలు గుట్టంతా మనసుఆధీనంలోనే ఉంది. మనసు మనిషిచేత చేయించే సత్కార్యంతో మనిషికి లభించే గౌరవమే పరువు,
అదే దుష్కార్యం చేయిస్తే ఆ మనిషికి లభించే అగౌరవమే కళంకం.
“అది తెలిసికూడ మరెందుకు తప్పుచేశావ్?” క్షణికమైన ఆవేశంలో ఒక యువతిబ్రతుకును నిర్దాక్షిణ్యంగా బలిగొన్నావ్!” అంటూ అంతరాత్మ
సతాయించటంమొదలుపెట్టింది.
“. మరి ఆక్షణంలో నువ్వేం చేస్తున్నావ్?”అనిఅంతరాత్మని ప్రశ్నించాను.
“ఈ పరిస్థితుల్లో వీడేం చేస్తాడా!అనిసరదాగాపరీక్షిస్తూ చూస్తుండి పోయాను.”
అంటూమాయమైపోయింది
.”అప్పుడే నాకు ఆటబొమ్మను చేశావే అంతరంగమా!ఆడించీ నను శోధించుటె నీచందమా!” అన్న ఒక మహాకవి మాటలు గుర్తొచ్చాయి!
ఏదైతేనేం, తన పరీక్షలో నేను దుర్మార్గుడిననితేల్చివేసింది।స్థిరచిత్తంతో,సంయమనం కోల్పో
కుండా నాలో నిర్మలత్వాన్ని నిరూపించు కోవల సిన అమృతక్షణాలకు నన్ను దూరంచేసింది. ఒక సువర్ణాకాశాన్ని చేజార్చుకొనేలా చేసింది. చేసిన తప్పుకు తగినశిక్ష అనుభవించకతప్పదు కదా! అనుకొంటూ ఇంటికి వెళ్ళాను.
ఇంట్లో ఎటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు చాలా ప్రశాంతంగావుంది. మనసులోనే సంధ్యకు ప్రణామాలర్పించుకొని, చిరునవ్వుతో జగదీశ్వరియిచ్చిన కాఫీత్రాగినేను రిలాక్సయ్యాను. అప్పుడు నా జీవితాన్నికూడా తనే రిలాక్స్ చేస్తుందని అనుకోలేక పోయాను.
మరునాటి ఉదయం యింట్లో కలకలంగాఉంటే, ఏమిటా? అనిక్రిందికివెళ్ళాను. రాముడు మెల్లగా దగ్గరకువచ్చి ”బాబూ!సామానంతా సర్దేసుకొని సందెమ్మగారు రాత్రికి రాత్రే ఎక్కడికోవెళ్ళిపోనారు.మామయ్యగారు కంగారు పడతన్నారు.అత్తయ్యగారు సంతోసంతో సంకలు గుద్దుకుంటన్నారు. నిన్నమాపిటేల ఏవన్నా జరగగూడని ఇసయమేవయినా”...?
అదివిని రాముడికి నాలోఆందోళన కనిపించకుండా, అంతులేని బాధను నటిస్తూ,రాని కన్నీళ్ళు కర్చీప్ తో తుడుచుకొంటూ,”ఏంటి రాముడూ! నువ్వేనా నన్నిలా అడుగుతు న్నావ్!అయినా నీకుతెలీదూ నేను తననెంతగ ప్రేమించాను. తనపై యెన్ని యాశలు పెట్టుకున్నాను.నిన్న సాయంత్రం కూడ నాతో బాగానేమాట్లాడిందే!ఒక్క మాటైనా నాతో చెప్పకుండా యిలాచెయ్యటం తనకు న్యాయమా?” అని కుమిలిపోయాను.
నా బాధను చూసి రాముడు”తమరేడ వకండిబాబూ”అంటూ నాకన్నా తనే ఎక్కువ కుమిలి పోయాడు.మరినానటన అలాగుంది.
ఆనాటి నా నటనను ఆస్కార్ అవార్డులకమిటీ చూసివుంటే,...ఏ మాత్రం సందేహంలేకుండా నన్నెంపిక చేసిఉండేవారే!
సంధ్యను వెతకటానికి నలువైపుల పంపిన మనుషులు తిరిగివచ్చి ఆచూకి దొరకలేదనిచెప్పారు.ఆ తర్వాత ఎంతోకాలం ప్రయత్నించినా ఫలితం శూన్యం. సంధ్యకథ ఆ విధంగా ముగిసింది.ఆ తర్వాత మావాళ్ళంతా జగదీశ్వరికీ నాకూ ముడిపెట్టారు. ఇన్నాళ్ళకు మళ్ళీ సంధ్యపేరు యిలా వింటున్నాను.
ఒకవేళ ఆసంధ్యా,ఈ సంధ్యా ఒక్కరేకాదుగదా!అయితే... ఏమిటి పరిస్థితి? ఉమాకి నాముఖం చూపించలేను.’నాన్నా’అని పిలవవలసిన సంధ్యకొడుకు “మామయ్యా” అని నన్ను పిలుస్తుంటే విని యెలా తట్టుకోవటం? నా చెల్లి స్థానంలో సంధ్యనెలాఊహించటం?
వీటన్నిటినీమించి,ధనుర్విముక్తనిశిత
శరాఘాత సదృశమైన ఆమె చూపుల నెలా తట్టుకోవటం ఇవన్నీ ఆలోచిస్తూ,ఏ తెల్లవారు ఝాముకో కళ్ళు మూతలు పడ్డాయి!
*. *. *.
భళ్ళున తెల్లవారింది. టైమ్ చూస్తే 6 గంటలయ్యింది. ఇప్పటికే ఆలస్యమైపోయిందనుకుంటూ హడావుడిగా రెడీ అయిపోయి
ఇంటికి తాళంవేసి,కారుతీసి బయలుదేరాను.
రాజమండ్రి కారుప్రయాణమంటే ప్రతిసారి పరిసరాలను చూసుకొంటూ ఎంతో యెంజాయ్ చేస్తూ వెళ్ళేవాణ్ణి.అటువంటిది ఈ రోజు
నరకలోక ప్రయాణం చేస్తున్నట్లుగా వుంది. శిక్ష అనుభవించటానికి వెళ్ళే ఖైదీలావెళ్తున్నాను.
ఆలోచనలతోనే ఈసురోమంటూ ఇంటికి చేరుకున్నాను.శిక్షించే ఆ మహంకాళి దర్శన మెప్పుడవుతుందా అనుకుంటూ గుండెలు దడదడలాడు తుండగా కారు దిగాను.
కన్నాచిన్నాలు"మామయ్యొచ్చాడు,మామయ్యొచ్చా"డను కుంటూ వచ్చి నన్ను వాటేసుకొని నా చేతులలో వారి బహుమతులేవీ లేకపోవటంచూసి
నిరాశపడ్డారు. సాయంత్రం బజారు వెళ్ళి కొనుక్కుందామని నచ్చజెప్పి లోనికి వెళ్తుండగా,”రారా!”అంటూ ఉమా ఎదురువచ్చాడు.సివంగి
ఉన్న గుహలోకి ప్రవేశించే కుందేలులా వుందినా పరిస్థితి. సివంగి ఎక్కడా?అని నాకళ్ళు నలువై పుల వెతకటం ప్రారంభించాయి!
అది గమనించిన ఉమ “ సంధ్యకోసమేనా వెతుకు తున్నావ్?”
“ఆ!....అ!...”
“ఫ్రెండ్స్ తో షాపింగుకివెళ్ళింది. సాయంత్రానికి వచ్చేస్తుంది. టైం
ఒంటిగంటయ్యింది.కాళ్ళూచేతులూ
కడుక్కురా ముందు భోంచేద్దాం”.అంటూ లుంగీ టవలు తెచ్చియిచ్చాడు.”నేను శిక్ష అనుభవించటాని కింకొంత టైమిచ్చాడన్న మాట దేవుడు”అనుకుంటూ,టవలందుకొని వాష్ రూమ్ కి వెళ్లాను.
భోజనాలయ్యాక పిల్లల్ని తీసుకొని బజారైనా వెళ్ళొస్తే పిల్లలతో ఆనందంగా గడపవచ్చనిఉమాను రమ్మంటే’ఫ్రెండ్స్ తో సంధ్య వస్తుందేమో మీరు వెళ్ళిరండి’ అంటూ హాండిచ్చాడు.
చేసేది లేక పిల్లలను తీసుకొని నేనే వెళ్ళాను.'7’గంటల వరకూ బజార్లన్నీ తిరిగి వాళ్ళకు కావలసినవన్నీకొనిచ్చి ఇంటికితీసుకువచ్చాను.
ఇంట్లో ఉమా ఒక్కడే వున్నాడు. నా వెతు కులాట గమనించి "సంధ్యకోసమేనా?” అడిగాడు
అవునన్నట్టు తలాడించాను.
“ఇంతకు ముందే వచ్చి వెళ్ళారు”. “రేపుదయం’6’ గంటలకు వస్తానని అన్నయ్య తో చెప్పమని,కావలసినవి బ్రేక్ ఫాస్ట్ చేసి తీసుకు వద్దామ”ని చెప్పి వెళ్ళింది.
‘అన్నయ్య’! ఈ అన్నయ్య యెవరో తెలిస్తే,తట్టుకోగలదా?ఇదేంటి?ఆమె నిజంగా సంధ్యఅన్నట్లుఫీలవుతున్నాను. కాకపోతే బాగుండు.
“దేవుడా! రేపు ఉదయం దాకా నేనీ టెన్షన్ భరించాలా!” అని తల పట్టుకున్నాను.
“చేసిన పాపం ఊరకే వదిలి పెడుతుందా?”అంటూ అంతరాత్మ సతాయింపు. ఆ రాత్రిభోజనం చేయాలనిపించ లేదు.పాపం చేశాను. పాపానికి లొంగిపోయాను.ఆ పాపానికి నా మీద అధికారం చెలాయించే
అవకాశమిచ్చాను. అదిప్పుడు నన్ను నఖశిఖ పర్యంతం నలిపివేస్తుంది. దాన్ని భరించగలశక్తి లేక నాలో అణువణువు స్తంభించిపోతుంది.
ఈ శిక్ష నుండి నాకు విముక్తియెప్పుడో!
మరునాడు’6’గంటలకే తలుపుతట్టినశబ్దం,పిల్లలు లేవలేదు,ఉమా వాష్ రూమ్ కి
వెళ్ళాడు. నా హృదయస్పందన రెట్టింపుగావిన్పిస్తుండగా,వెళ్ళితలుపు
తెరిచాను.
ఏ అవాంఛిత దృశ్యం నేనుచూడకూడ దని ముక్కోటి దేవతలకు మ్రొక్కుకున్నానో, ఆ దృశ్యమే నా యెదుట భీకరాతి భీకరంగా గోచరించింది. సంధ్య రూపంభద్రకాళిలా నాల్కలుచాస్తూ నరకటానికి నా వెంటపడింది.
“నో...నో...నో”అని అరుస్తూ నేనుపరుగుదీయబోయి క్రింద పడిపోయాను.
*. *. *. *.
“మావయ్యా!...మావయ్యా!...విజయ్!...విజయ్!”అంటూ కేకలు విన్పించటంతో,కళ్ళుతెరిచాను.బెడ్ మీదినుండి క్రిందపడివున్నా!
చుట్టూ పిల్లలు,ఉమ.
“ఏమిట్రా?పసివాడిలా క్రిందపడ్డావంటూఉమ,"షేమ్ షేమ్”అంటూ పిల్లలు నన్నల్లరి పెట్టసాగారు."మై గాడ్ యిదంతా కలా?”ఆశ్చర్యపోతూ,"అయినా నాబాధలు మీకేం తెలుసులే"అనుకుంటూ నవ్వలేని ,నవ్వుకాని నా నవ్వుతో వారితో శ్రుతి గలిపాను.
అంతలోనే తలుపు తట్టిన శబ్దమైంది.నా గుండెల రెట్టింపు స్పందన నాకు స్పష్టంగా వినిపించ సాగింది. ఈసారి ఉమా వెళ్ళి డోర్తెరిచాడు. తలవంచుకునే దొంగ చూపులు చూడవలసిన దిక్కుమాలిన పరిస్థితి. చూడగానే అజంతాశిల్పం లాంటి ఓ సుందరాకృతి.ఇది కలా?నిజమా?అనుకొంటూ నన్ను నేను
గిచ్చుకున్నాను.హా!...మంట
ఇదినిజమే!
ఆ ముఖారవిందాన్ని చూడగానే
నాకు”యాహూ”అంటూ ఆనందంతో అరవా లనిపించింది.ఎందుకంటే
తను ఆ సంధ్య కాదు.కరుణే నిలువెత్తు రూపమై నన్ను రక్షించటానికొచ్చిన దేవతలా కనిపించిందామె.
పరిచయాల కార్యక్రమం పూర్తయ్యింది.ఈ విషయం నన్ను ఆనందలోకాలలో ముంచితేలుస్తుంది
”హమ్మయ్య!”అనుకుంటూ ఎటువంటి చీకూచింత లేక ఈ వారంరోజులూ పెళ్ళి కార్యక్రమాలు సందడిగా జరిగి పోయాయి.గుప్పెడుమనసులో గంపెడు సంతోషాన్నిరికించుకొని అందరిచేత వీడుకోలు చెప్పించుకొని ఒకరోజు గుంటూరుబయలుదేరాను.
వచ్చేటప్పుడు లేని హుషారును వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేస్తూ!
గుంటూరులో కలెక్టరాఫీసు ప్రక్కవీధిలోకి టర్న్ తీసుకొంటుండగా ఒకపెద్ద కటౌట్ దర్శనమిచ్చింది.
క్రొత్తకలెక్టరు యన్.సంధ్యాదేవి గారికి హార్దిక శుభాభినందనలు. ఆ కటౌట్ ముఖంచూడగానే గుండెకొట్టుకోవటం ఆగినంత పనయ్యింది.ఆసంధ్య ఎవరో కాదు.ఆ రోజు నారాక్ష సత్వానికి బలయిన సంధ్య. అసలు శిక్ష నాకు యిప్పటినుండే ప్రారంభమౌతుందనుకుంటా!
ఎందుకంటే నేను పనిచేసే ఆఫీసు అదే!....
- గోగినేని రత్నాకర్