ఇది విన్నదే ..! రోజూ వున్నదే !

Advertisement
Update:2023-09-14 19:02 IST

ఉదయం ఏడు గంటల సమయం. పార్క్ లో ఒక గంట మార్నింగ్ వాక్ చేసి ఇంటిదారి పట్టిందితిప్పమాంబ.

ఆరోగ్యమే మహా భాగ్యమని నమ్మి వానొచ్చినా... వరదొచ్చినా. కూడా ప్రతిరోజూ వాకింగ్ మటుకు మానదు.

ఈ మధ్య పేపర్ చదివినా.. టీవీ చూసినా....మార్నింగ్ వాకింగ్ చేసే ఆడవారి గొలుసులు కాజేసిన దొంగల న్యూసులే ఎక్కువగా ఉంటున్నాయి.

ఎందుకైనా మంచిదని ఒకసారి చుట్టూ పరికించి చూసింది తిప్పమాంబ.

వెనకాల ఒక ఇరవై అడుగుల దూరంలో ఒక అసామీ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు.

ఎందుకైనా మంచిదని వేగం పెంచింది.

పక్కింటి పిన్నిగారూ రోజూ తనతో వచ్చేది. ఈరోజు ఊరెళ్లడంతో ఒకటే రావాల్సి వచ్చింది.

పిన్నిగారు ఊరెకుతూ "తాళిబొట్టు ఇంట్లోపెట్టి వెళ్లవే వాకింగ్ కి" అని పదేపదే చెప్పి వెళ్ళింది.

అయినా.. చెట్టంత మొగుడు ఆరోగ్యంగా తిరుగాడుతుంటే తాళిబొట్టు ఇంట్లో పెట్టాల్సి రావడం ఎంత దౌర్భాగ్యమో.. నేను తియ్యను గాక తియ్యను రానీ ఏ దొంగ వెడవ వస్తాడో వాడి అంతు చూస్తా " అని తిప్పమాంబ అలాగే

బయలుదేరింది .

మళ్లీ ఒకసారి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది.

ఆ ఆసామీ ఉలిక్కిపడ్డట్టు చూస్తూ పెదవులు విడివడకండా సన్నగా నవ్వినట్లుగా అనిపించింది.

"అమ్మో.. వీడెవడో దొంగ వెధవ లాగే ఉన్నాడు.." అనుకొని కాస్త వేగంగా నడవడం ప్రారంభించింది.

చివర వరకూ వేగంగానడిచి చిన్నగా వెనుదిరిగి చూసింది.

అతనూ వేగంగానే వస్తున్నట్లు నిర్ధారణకొచ్చింది.

ఆ పక్క సందు నుండి వాకింగ్ కి వెళుతున్న నలుగురు అబ్బాయిలు కాస్త దూరంలో కనిపించగానే ధైర్యం తెచ్చుకున్న గొంతుతో..

" ఏయ్! ఎవరు నువ్వు? పార్క్ నుంచి నా వెనకాతలే వస్తున్నావ్? ఏమిటి విషయం?" అని ఆ

ఆసామి ని గట్టిగా గద్దించింది..

"అది... మరి... మరి.." అని నీళ్ళు నములుతున్నాడు ఆసామి .

"ఏమయిందమ్మా! ఎందుకలా అరుస్తున్నారు ?" అంటూ ఆ నలుగురు అబ్బాయిలు ఆగి

విచారించారు.

"చూడండి బాబు! నేను వాకింగ్ వెళ్లి.వస్తుంటే ఇతనెవరో నా వెనకాలే ఫాలో అవు తున్నాడు" అంది తిప్పమాంబ

" ఏందయ్యా? చూడ్డానికి పెద్దమనిషి లాగా ఉన్నావు పెద్ద వయసు కూడా... ఎందుకు ఈ పెద్దామె వెనకాతల పడ్డావు? కొంపదీసి నీవేమైనా చైన్ స్నాచర్ వా" అంటూ ఆ నలుగురుఆసామి దగ్గరకు బెదిరిస్తూ.. వెళ్లారు...

ఆ ఆసామి కంగారుగా తన పాంట్ జేబులోనుంచి ఏదో తీసే ప్రయత్నం చేసాడు.

అది గమనించిన తిప్పమాంబ " అదిగో.. అదిగో జేబులో నుంచి ఏ కత్తో తుపాకో యో తీయబోతున్నాడు. పట్టుకుని నాలుగుతగలించండి బాబూ!" అని వారిని హెచ్చరించింది.

ఆమె అరుపులకు అలర్ట్ అయ్యి నలుగురూ ఆ ఆసామిని చుట్టుముట్టి పెడరెక్కలు విరిచి పట్టుకుని పోలీసులకు ఫోన్ చేయడానికిఉపక్రమించారు.

ఆ ఆసామి ఏదో చెప్పడానికి ప్రయత్నించివీరి మొరటు చేష్టలకు తట్టుకోలేక కుయ్యో...మోర్రో అని రాగాలు తీయసాగాడు.

అతని జేబులోని కత్తిని ముందు జాగ్రత్తగాతీసి పెడతామని అతని జేబులు తడమి చూడగా...

ఏదో ఫోటో దొరికింది...

తీసి చూద్దురు కదా!

దర్జాగా షష్టిపూర్తి పెళ్ళి కొడుకుగా ఆ.. ఆసామి పక్కనే సిగ్గులొలికిస్తూ... తిప్పమాంబ.కొడుకులు.. కొడళ్లు..మనవలు.. మనవరాళ్ళు

నిండుగా.. అందరూ ఆనందంగా నవ్వుతున్న గ్రూప్ ఫోటో

అప్పటికి చేతులు విదిలించుకున్న ఆసామి బాబులూ! ఇదీ సంగతి!

నా పేరు చిరంజీవి. ఇది నా ముద్దుల పెళ్ళాం తిప్పమాంబ. దీనికి ఇప్పుడిప్పుడే అల్జీమర్స్ వ్యాధి వచ్చి అప్పుడప్పుడు అందరినీ మరచిపోయి కంగారుపడుతోంది. మమ్మల్ని కంగారు పెడుతోంది.

వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కోసారి. ఇంటికి వచ్చే దారికూడా మరచిపోయి అవస్థ పడుతోంది. అందుకనే ఎప్పుడూ పక్కింటి పిన్ని గారిని తోడుగా పంపిస్తాను. ఈరోజు ఆవిడఊరుకు వెళ్ళడంతో నేను తోడుగా వచ్చాను.

మా తిప్పమాంబకి అల్జీమర్స్ ట్రీట్మెంట్ జరుగుతోంది .

ఇంటి దారి ఎంత వరకు దానికి జ్ఞాపకం ఉందో చూద్దామని కాస్త వెనుకగా బయలుదేరాను.

తీరా చూస్తే... ఇది ఇంటి దారి సరిగ్గా గుర్తుపెట్టుకుంది.. కానీ కట్టుకున్న భర్తను.. నన్ను మర్చిపోయింది. ఇదీ బాబూ జరిగింది. ఇది ఇలాంటి గందరగోళం ఏదో సృష్టిస్తుందనే అనుమానం కలిగి మా ఫోటో.. జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను " అంటూ గాఢంగా నిట్టూర్చాడు. అసామి.

"అయ్యో! పొరపాటైయ్యింది సార్! సారీ....! తిప్పమాంబ గారూ! అందరినీ మంచి తిప్పలే పెట్టారు కదండీ.. ఈసారి... మందులు కాదు డాక్టర్ ని మార్చండి.. అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు ఆ నలుగురూ .

జరిగిన సంగతి .. మెల్లగా అర్ధం చేసుకున్నతిప్పమాంబ భర్త కౌగిలిలోకి చేరి., "సారీ అండీ"

చిన్నగా గొణిగింది.

"ఇది విన్నదే... రోజూ ఉన్నదే..." అని రాగంతీసాడు.

మళ్ళీ మళ్ళీ.. ఇది రాని రోజూ...

అంటూ టీ కొట్టులోని ఎఫ్.ఎం రేడియోలోని పాట హుషారుగా వినిపిస్తోంది.

- గంజాం భ్రమరాంబ

Tags:    
Advertisement

Similar News