"ఈసారి దసరా పండక్కి మా ఊరు వెళదాంరా వాహెద్ భాయ్ ! నువ్వు చెల్లెమ్మను తీసుకుని తప్పక రావాలి.మా పల్లె అందాలతో పాటు,మా పండుగ ఆనందాన్నీ ఓ సరికొత్త అనుభూతిగా గుండెల్లో నింపుకోవచ్చు."అంటూ ఆత్మీయంగా ఆహ్వానించిన ప్రశాంత్ పిలుపుకు తొలుత స్పందించకపోయినా, పదేపదే ఒత్తిడి చేయడంతో పాటు, ప్రశాంత్ భార్య ప్రత్యూష కూడా రుక్సానాకు ఫోన్ చేసి "వదినమ్మా.. అన్నయ్యతో కలిసి ఈసారి పండక్కి మీరు మా ఊరికి రావాల్సిందే"అని ప్రేమగా పిలవడంతో రుక్సానా ఒత్తిడి కూడా ఎక్కవై ఓకే చెప్పాను.
ప్రశాంత్, నేను సిబిఐటిలో ఇంజినీరింగ్ క్లాస్ మేట్స్మి. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో ఇద్దరం ఒకేసారి అసెంచర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా సెలెక్ట్ అయ్యాము.ఆరు నెలల తేడాతో ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.నాకు మొదటి నుంచి హిందూ మిత్రులతోనే సాన్నిహిత్యం ఎక్కువ.ప్రశాంత్ తో మరీ ఎక్కువ. ప్రత్యూష,రుక్సానాలు కూడా మాకు మించి మంచి స్నేహితులయ్యారు. వీకెండ్స్ లో మా రెండు జంటలు కలిసి ఆనందంగా గడుపుతాము.వాళ్ళింటికి మేము వెళ్ళడం కానీ ,వాళ్ళు మా ఇంటికి రావడం కానీ,అందరం కలిసి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ జరుగుతుంది.
స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా రంజాన్, బక్రీద్ పండుగలకు హిందూ మిత్రులందరినీ మా ఇంటికి ఆహ్వానించే వాడిని. మా అమ్మ చేసే బిర్యానీ, ఖీర్ అంటే మా మిత్రులందరికీ చాలా ఇష్టం. సంక్రాంతి లాంటి పండుగలకు వాళ్ళ ఇండ్లల్లో చేసే చకినాలు ,గారెలు ,అరిసెలు అంటే నాకెంతో ఇష్టం. అయితే ఇంత వరకు ఎప్పుడూ పట్టణ సంస్కృతి లోనే పెరిగిన మేము పండుగలు చేసుకోవడంలో మా ఇండ్లకే పరిమితం అయ్యాం. మొదటిసారి పండుగకు పల్లెటూరు వెళుతున్నాం.
రుక్సానా చేసిన ఖీర్ ను డబ్బా నిండా నింపుకొని కార్లో కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన
మెట్ పల్లికి ఉదయమే చేరుకున్నాం. వెళ్ళగానే ప్రశాంత్, ప్రత్యూషలు అలైబలైతో సాదరంగా ఆహ్వానించారు. ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మా రాకకు ఎంతో సంతోషించారు.
కేవలం మేం వస్తున్నామనే పండుగకు కోసే మేకను ఊళ్ళో మటన్ అమ్మే ముస్లింతో హలాల్ చేయించారు ప్రశాంత్ వాళ్ళ నాన్న. ప్రశాంత్ చెల్లెలు,బావ, ఇంకా ఇతర బంధువులతో ఇల్లంతా సందడిగా ఉంది. ఆంటీ ,అంకుల్ పూజా కార్యక్రమాల్లో ఉండగా, మిగతా బంధువులు వంటల బిజీలో ఉన్నారు.
ప్రశాంత్, ప్రత్యూష, నేను రుక్సానా ఊరి పొలిమేర లోకి వెళ్ళాం.ఊరిని ఆనుకొని ఉన్న చెరువు -నిండా జలకళతో కను విందు చేస్తోంది. చెరువు చుట్టూ నేలంతా ప్రకృతి పచ్చబొట్టు పొడిచినట్లు పచ్చని పొలాలు. చెరువు ఒడ్డు పొడుగూతా ఈత చెట్లు. వాటిని ఆనుకొని ఉన్న పెద్ద తాటివనం. దాని పక్కనే ప్రశాంత్ వాళ్ళ పొలం తో పాటు ఉన్న మామిడి తోటలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాడు. ముందుగానే చెప్పి ఉంచిన సారయ్య గౌడ్ ఈత కల్లు కుండతో వస్తూనే..
"ఏమోయ్ అల్లుడూ.. మమ్మల్ని మర్సే పోయినవ్. ఎంత పెద్ద పెద్ద కొలువలు సేత్తున్నా,పుట్టినూరును మర్సిపోతే ఎట్లా అల్లుడూ!నువ్వు పట్నంల కొలువు జేత్తున్నా,ఈన్నే పుట్టినోడివి. పిల్లగానప్పుడు సెలవుల్లో ఈడికచ్చినప్పుడల్లా మీ తాత నా వాడుక బింకి కల్లు తాపిచ్చే నిన్ను పెంచిండు. రేపు మీ పిల్లల్ని కూడా నా కల్లు తాపిచ్చేటందుకు తేవాల.."అంటూ ఈత కల్లు కుండ దించి , తాటి ఆకుతో రాకెలు కట్టి నలుగురికి నాలుగు ఇచ్చి బింకితో కల్లు ఒంపుతుంటే, కొబ్బరి నీళ్ల కంటే తీయగా, చల్లగా ఉన్న కల్లు తాగడం మాకు ఓ కొత్త అనుభవం.
రుక్సానా, ప్రత్యూషలు మొదట మొహమాటపడినా, ఎవరూ లేని ఏకాంతం కావడంతో ఆ రుచిని వాళ్లూ ఆస్వాదిస్తున్నారు.మధ్య మధ్యలో నూనె కారంపొడి కలిపిన పుట్నాలు తింటూ కల్లు తాగుతుంటే నిత్యం కంప్యూటర్ అనే యంత్రం ముందు, మరో మానవ యంత్రం కూర్చుని మొనాటనస్గా చేస్తున్న పని నుండి విముక్తి పొంది, పక్షుల కువకువల మధ్య, పచ్చని తోటలో ఉరుకులు పరుగుల జీవితానికి దూరంగా, జీవితంలో ఇంకేది అక్కర్లేదన్న ఆత్మసంతృప్తిలో ఆ క్షణాలు దొర్లిపోతున్నాయి.
గంట సేపు మమ్మల్ని మేం మర్చిపోయిన స్థితి. ఇంటికి వెళ్ళిపోయే ముందు, కల్లు డబ్బులతో పాటు ఓ కవర్ సారయ్య చేతికిచ్చాడు ప్రశాంత్. "గిదేంది అల్లుడు" అని సారయ్య అడగ్గానే "పండక్కి కొత్త డ్రెస్ మామా తీసుకో "అన్నాడు ప్రశాంత్. సారయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.ప్రేమతో ప్రశాంత్ ను ఆలింగనం చేసుకుని"ఏం జేసిన్నని నా మీద గింత ప్రేమ అల్లుడు " అన్నాడు.
"చిన్నప్పుడు సెలవుల్లో ఈడికచ్చినప్పుడల్లా ఈ చెరువులో ఈతలు కొడుతూ, ఈ మండువాలో ఆడుకొని నీ చేతి ముంజలు తిని,కల్లు తాగి హుషారుగా గడిపిన యాది నేను మర్చిపోలేను మామా" అన్నాడు ప్రశాంత్.
అక్కడినుండి ఇంటికి వెళ్లే దారిలో కారును మరో నాలుగు ఇండ్ల వద్ద ఆపి, నలుగురు చిన్ననాటి స్నేహితులకు డ్రెస్సులు ఇచ్చాడు ప్రశాంత్.ఇంకా ఇంతలా పదిల పరుచుకుంటున్న ప్రేమల గురించి ప్రశాంత్ ను అభినందిస్తే..
"ఇది మా నాన్న నేర్పిన సంస్కృతిరా! మా తాత కమ్మరి పని చేసేవాడు.ఈ గౌండ్లోల్లు, కాపోల్లు మా తాతకు ఆసాములు. వాళ్ళ వృత్తి పనులకు కావలసిన ఇసిరెలన్నీ మా తాత చేసిచ్చే వాడు. వాళ్ళు మా తాతకు ధాన్యం, కూరగాయలు, వాడుక కల్లు, ఇతరత్రా ఎన్నోరకాలుగా అందించే వాళ్ళు."
"ఇక్కడ చదువుకొని ఇంజినీర్ దాకా ఎదిగింది మా నాన్న ఒక్కరే. సంవత్సరమంతా పట్టణ ప్రాంతంలో గడిపినా ప్రతి దసరా,దీపావళి పండుగలు మాత్రం ఇక్కడే జరుపుతారు. నాన్న తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాళ్ళ కుటుంబాలకు కొత్త బట్టలు పెట్టి, మా ఇంట్లోనే దావత్ ఇస్తాడు. అమ్మా-నాన్నలకు అది ఎంతో తృప్తినిచ్చే విషయం."అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంటికి వెళ్ళే సరికి ఓ పదిమంది వరకూ కూర్చొని బిగ్గరగా నవ్వుకుంటూ సంబురంగా కనిపించారు. వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళంతా నాన్నకు అత్యంత ఆత్మీయులైన స్నేహితులని ప్రశాంత్ చెప్పాడు. వాళ్ళందరి చేతుల్లోనూ కొత్త బట్టల కవర్లున్నాయి.
ప్రశాంత్ ను చూడగానే "ఏం అల్లుడూ !అంత మంచిదేనా.. నెలకు లచ్చల్లో సంపాదిస్తున్నావట కదా సంతోషం. మమ్మల్ని మర్సిపోకు. ఔగనీ..కొడుకో,బిడ్డనో కనేదుందా లేదా. నీ వయసులో మేం ఇద్దరు ముగ్గుర్ని కని పారేసినం. ఈ కాలం పిల్లగాండ్లకు కొలువుల పేరుతో లగ్గాలు ఆల్సెమే.. పిల్లలు పుట్టుడూ ఆల్సెమే.."ఇట్లా తలా ఓ మాటతో ప్రేమ వర్షం కురిపిస్తున్నట్లుంది వాతావరణం.
వాకిట్లో వేసిన టెంట్ కిందనే అందరికీ బంతి భోజనాలు.
ఆడవాళ్ళంతా ఓ పక్క కూర్చుంటే, మగవాళ్ళంతా మరో పక్క కూర్చున్నారు. అంకుల్ తెచ్చిన ముందు తాగుతూ దోస్తులు మస్త్ మజా మజాగా, చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకుంటున్నారు.
భోజనాలు చేస్తున్నప్పుడే ఊళ్ళోని పారిశుద్ధ్య కార్మికులు ,ఇతర ఊరి పని చేసేవాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు తలా ఓ క్వార్టర్ సీసా ఇచ్చి భోజనం చేయమని చెబుతున్నాడు అంకుల్. వచ్చినవాళ్ళంతా తీరొక్క వరుసలతో వాళ్ళ హృదయాలతో మాట్లాడుకుంటున్నారు.
కురిసే వానలు, పండే పంటలు, పల్సవడిపోతున్న పండుగల తీరు గురించి, ఆఖరుకు సమకాలీన రాజకీయాల గురించీ అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొందరు పద్యాలు పాడారు. ఒకరి మీద ఒకరు సరసమైన జోకులు పేల్చుకుంటున్నారు. భోజనాలు కాగానే అందరూ అలైబలై తీసుకుంటూ..
"మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిండ్రు. మా బ్రహ్మయ్య బావ పేరు నిలబెట్టిండ్రు. " అంటూ ప్రశాంత్ తాతను యాజ్జేసుకున్నరు.
"యాడాదంతా యాడున్నా ,
గీ దసరా పండక్కైతే మన ఊరు రావాల. గిట్లనే అందరం ఖుషీగా దావత్ చేసుకోవాల. ఎంత దూరం బోయినా, ఎంత సంపాదించినా కన్న ఊరిని, చిన్నప్పటి దోస్తుల్నైతే మర్చి పోవద్దు." అంటూ అందరూ వెళ్ళిపోయారు.
సాయంత్రం రుక్సానా, నేను వెళ్లి పోతుంటే ఆంటీ మాకు కూడా కొత్త బట్టలు పెట్టారు.
"ఏం కోడలా.. మనుమన్నో, మనుమరాల్నో ఎప్పుడిస్తావు. చూడాలి మరి..ఈ కోడలు ముందిస్తదో, ఆ కోడలు ముందిస్తదో.."అనగానే
"మీ దువా ఉంటే జల్దిన్నే ఇస్త ఆంటీ " అంటూ వంగి ఆంటీ, అంకుల్ కాళ్ళకు దండం పెట్టింది రుక్సానా. నేనూ దండం పెట్టాను. ఎంతో ఆత్మీయంగా సాగ నంపారు మా ఇద్దర్నీ.
వెళుతుంటే రుక్సానా అంది " ఆంటీ అంకుల్ కిత్నే అచ్ఛే లోగ్ హై! గావ్ వాలే భీ కిత్నా మొహబ్బత్ సే బాత్ కర్ రహే హై! యహా కు ఆకర్ మై తో బహుత్ ఖుష్ హువా!"
కులాలు, మతాలు మనుషులే సృష్టించుకున్నా, స్వార్థపరులు వాటి మధ్య చిచ్చు పెడుతున్నా, పండుగల పేరుతో సామూహిక సంతోషాల్ని,తరాల కలయికల్ని పెంచుకుంటూ, సౌభ్రాతృత్వ భావనను పదిలపర్చుకుంటన్న పల్లెలు భారతీయ సంస్కృతికి తల్లివేరులా తోచాయి నా మనసుకు.
- గాజోజు నాగభూషణం