ఎంగటవ్వ మాడీ

Advertisement
Update:2022-12-03 16:51 IST

ఎంగటవ్వ మాడీ

తిరుపతి రూయా ఆస్పత్రిలో ఎముకలు, కీళ్ళు విభాగంలో మంచం మీద దిండుకానుకుని కూర్చుని వుంది ఎంగటవ్వ. చుట్టూ ఆవిడని చూడ్డానికి వచ్చిన జనాలు గుమిగూడి ఉన్నారు. వాళ్ళని అదుపు చెయ్యడం ఆస్పత్రి సిబ్బంది వల్ల కావడం లేదు. అంతలోనే అక్కడికి వచ్చాడు ప్రభుత్వాధికారి విశ్వనాధ్. అతన్ని చూడగానే చుట్టూ ఉన్నవాళ్ళందరూ హడావిడిగా పక్కకి జరిగి దారిచ్చారు. అతన్ని దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేసింది అవ్వ. దగ్గరికి వెళ్ళగానే అతని చెవిలో ఏదో చెప్పింది. అది వినగానే సిగ్గుతో కూడిన మొహమాటంలో చిరునవ్వు రంగరించి ఆవిడ చెప్పినదానికి అవునన్నట్లుగా తలాడించాడు విశ్వనాథ్.

ఎంగటవ్వ సంబరంగా నవ్వుతూ, "మనిసుంటే మంచుంటాది" అంటూంటే చుట్టూ చేరినవాళ్లందరూ అబ్బురంగా చూస్తూండిపోయారు.

*

హైదరాబాదునించీ ప్రత్యేక అధికారిగా తిరుపతి వచ్చాడు విశ్వనాథ్. ప్రభుత్వం అతనికి కేటాయించిన నివాస గృహం పేరు ఎంగటవ్వ మాడీ. అంటే అది ఆ అవ్వ స్వంతం అని కాదు. ఆ మేడ వెనుకనుండే చిన్న గదిలో ఎంగటవ్వ ఉంటుంది కాబట్టి దాన్ని ఎంగటవ్వ మాడీ అంటారు. ఆ మాడీలో అడపాదడపా అధికారులు మారుతూంటారు. గానీ అవ్వ మాత్రం మారదు. అలా ప్రభుత్వ నివాస గృహాల్లో ఉద్యోగులకి సంబంధం లేనివాళ్లు ఉండకూడదు. ఈ విషయం విశ్వనాథ్ కి మాత్రమే కాదు, అంతకు ముందున్న అధికారులందరికీ కూడా తెలుసు. కానీ ఆవిడని అక్కడినించీ ఖాళీ చేయించాలని ఎవరికీ అనిపించలేదు. అందుకు కారణం ఆ ముసలితనంలో కూడా ఎవరికీ బరువు కాకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ నలుగురికీ తల్లో నాలుకలా మసలే అవ్వ మంచితనం. దాని గురించి ఏమాత్రం తెలియని విశ్వనాథ్ మొదట్లో ఎంగటవ్వని ఎంతమాత్ర పట్టించుకునేవాడు కాదు సరికదా, తన భార్యా పిల్లల దగ్గర ఆవిడ గురించి అప్పుడప్పుడూ విసుక్కునేవాడు కూడా.

అతనలా విసుక్కున్నప్పుడు అతని భార్య, ఎంగటవ్వ మంచితనం గురించి కథలు కథలుగా చెబుతూండేది.

*

ఎంగటవ్వ నోరారా "నాయనా మనమడా" అని పిలిచేది. ఆ పిలవడంలో విశ్వనాథ్ కి తానింతకు ముందెన్నడూ చూడని ఆప్యాయత, అభిమానం కనిపించేవి. అందుకే అతని భార్య "పోన్లెండి పాపం, ముందూ వెనకా లేని పెద్దావిడ. ఎవరికి ఏం కావాలన్నా చేసిపెడుతుందే తప్ప, ఎవరినీ నోరు తెరిచి సహాయం అడిగిన మనిషి కాదు" అంటూంటే ఎదురుమాట్లాడేవాడు కాదు.

*

విశ్వనాథ్ కూడా అందరిలాంటివాడే. కాబట్టీ అందరిలాగే, "ఒక మనిషి బాగుపడ్డాడూ అంటే అందుక్కారణం చెడిపోయే అవకాశం రాకపోవడమే" అని భావిస్తాడు. అందరి దృష్టిలోనూ బాగుపడ్డం అంటే డబ్బు సంపాదించడమే కాబట్టీ, అతను బాగుపడ్డం కోసం అప్పుడప్పుడూ ఒకరిద్దరి దృష్టిలో చెడిపోయినా పట్టించుకునేవాడు కాడు.

ఆ రోజు ఒకాయన బహుమానంగా రెండు విదేశీ మద్యం సీసాలు ఇస్తే ఎలాగూ భార్యాపిల్లలు పుట్టింటికి వెళ్ళారుకదా అని ఇంటికి పట్టుకెళ్ళాడు. అవి ఎంతలేదనుకున్నా వారం పదిరోజులొస్తాయి. వరసగా రెండు రోజులు తాగాడు. మూడోరోజు తాగబోతూండగా ఎంగటవ్వ మాటలు వినిపించాయి.

"తప్పు చేసేది తప్పు. ఆ తప్పు అయినోళ్ళకు తెలవకుండా చేసేది ఇంకా తప్పు. ఆలుబిడ్డలకు తెలవకుండా తప్పుడు పన్లు చేస్తే ఎంకన్న చూస్తా గమ్మునుంటాడా?" అంటూ ఎవరికో తన సంచారవాణిలో పాఠాలు చెబుతోంది. ఎందుకోగానీ విశ్వనాథ్ కి మాత్రం ఆ మాటలు తనని ఉద్దేశించి అంటున్నట్టుగానే అనిపించింది.

అవ్వ మాటల దెబ్బకి గొంతు దిగడానికి తటపటాయిస్తున్న విదేశీ మద్యాన్ని బుజ్జగించి మరీ కడుపులోకి పంపాల్సి వచ్చింది.

నాలుగోరోజు అవ్వ గొంతు వినపడకపోతే ఏమైందో ఏమిటో అని తొంగి చూశాడు. ఎంగటవ్వ అటువైపు సందులో చేరి సంచారవాణికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతోంది. దాన్ని చూసి మురిపెంగా "ఎక్కడెక్కడలేని విషయాలు ఈవిడకే కావాలి" అనుకుంటూ నవ్వుకున్నాడు.

ఆరో రోజు తాగడానికి కూర్చోగానే ఎంగటవ్వ గొంతు బిగ్గరగా వినపడింది. సంచరవాణిలో అవ్వ "తాగుబోతు నాయాండ్లతో ఏగేది మన్నించి కాదులే అమ్మీ. ఆ

ఇడిచిపోయిన నా బట్టని ఇడిచిపెట్టేసి గొమ్మున అమ్మగారింటికి ఎలబారు. నాకు నీ మొగుడుగానీ కనిపిస్తే పొరకతో కొట్టి అత్తగారింటికి తరుముతాలే" అంటూ ఎవరికో ధైర్యం చెబుతోంది.

అసలీ ఎంగటవ్వ నిజంగా ఎవరితో అయినా మాట్లాడుతోందా లేక తనకి బుద్ధి చెప్పడానికే అలా నటిస్తోందా అనేది అర్థం కాక జుట్టు పీక్కున్నాడు విశ్వనాధ్. ఎంగటవ్వ చరవాణిలో ఊదరగొడుతూనే ఉంది. ఆవిడ మాటలు వింటున్న విశ్వనాథ్ కి ఎందుకో తాగాలనిపించలేదు. అందుకే సీసా తీసికెళ్ళి కుప్పతొట్టిలో పడేశాడు.

మర్నాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎదురుగా మెట్లమీద కూర్చుని దేని గురించో తీవ్రంగా మథనపడుతోంది ఎంగటవ్వ. కారణం ఏమిటని అడిగితే "నీ పెండ్లాం నిన్నూ _మాడీనీ భద్రంగా చూసుకొమ్మని చెప్పిపోయింది నాయనా. నువ్వు తెల్లవారి పోతే రాత్రిదంకా రావు. దానికే నేను మాడీ చుటకారం తిరిగి చూస్తానే ఉంటా. అయినా ఏ పంగమాలిన యెదవలు వచ్చినారోగానీ నా కండ్లబడకుండా దొంగతనం చేసినారు" అంటూ వుంటే విశ్వనాథ్ కంగారుగా "ఏమైందవ్వా?" అని అడిగాడు.


"సూడు నాయనా ఇంత బతుకు బతికినా. ఇంత మందిని చూసినా. అయినకాడికి మంచి చేసినా. ఎంతచేసి ఏమి గుణం? ఈ పొద్దు నీ పెండ్లాంతో అనిపించుకునే గతికి వచ్చినా".

"ముందు ఏం జరిగిందో చెప్పండవ్వా?" అన్నాడు విశ్వనాథ్. "ఇదో ఈ ద్వారబంద్రానికి ఏలాడే ఎంకన్న తెరగుడ్డను ఎవురో దొంగనాయాండ్లు ఎత్తుకొని పూడ్సినారు. ఇబ్బుడుగానీ నీ పెండ్లాం వచ్చి ఏది నా తెరగుడ్డ? అని అడిగితే ఏం చెప్పాల?" అంటూ కన్నీటి పర్యంతం అవుతుంటే ఆమెని అనునయిస్తూ "తెరగుడ్డే కదా, పోతే పోయిందిలెండవ్వా దాని గురించి బాధపడకండి" అంటూ అవ్వని లోపలికి తీసుకువెళ్ళాడు.

మర్నాడు కూడా ఎంగటవ్వ అదే స్థానంలో కూర్చుని అదేవిధంగా బాధపడుతూ కనిపించింది. మళ్ళీ ఆవిణ్ని లోపలికి తీసుకువెళ్ళాడు. "పోగొట్టుకున్న నాకు లేని బాధ మీకెందుకవ్వా" అంటూ సద్దిచెప్పాడు.

కానీ మరుసటిరోజు కూడా ఎంగటవ్వ అదే సమయంలో అదేవిధంగా కూర్చుని బాధపడుతుంటే విశ్వనాథ్ కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆవిడదంతా చాదస్తం.

తనకి అప్పగించిన బాధ్యతని నిర్వర్తించలేకపోయినందుకు కలిగిన ఆవేదనతో కుమిలిపోతోందని అతనికి అర్థం అయింది. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అని ఆశ్చర్య పోయాడు. అంతే కాదు, ఏదో విధంగా ఆమె బాధని పోగొట్టడం తన బాధ్యత అని తీర్మానించుకున్నాడు.

మర్నాడు ఇంటికి వచ్చేముందు తిన్నగా బట్టల కొట్టుకి వెళ్ళాడు. అక్కడున్న వాకిలి గుడ్డలని పరిశీలించాడు. అంతకుముందు తమ ఇంటి వాకిలికి వేళ్ళాడే వెంకన్న బొమ్మ వుండే తెరని గుర్తుతెచ్చుకున్నాడు. సరిగ్గా అలాంటిదే కొందామంటే ఆ అంగట్లో దొరకలేదు. చివరికి తిరుపతంతా గాలించి వెంకన్న తెరని సంపాదించాడు.

ఆ కొత్త తెర పాతబడేలా చెయ్యడానికిగాను కొళాయి దగ్గర మొక్కలకి నీళ్ళు పారగట్టే కాలవలో ఉన్న బురదనీళ్ళలో ముంచాడు. తరువాత దాన్ని తీసుకెళ్ళి ఉట్టినీళ్ళలో ఉతి కాడు. ఇప్పుడు కాస్త రంగు మారి పాతగుడ్డలాగే కనిపిస్తోంది. దాన్ని మేడమీద ఆరేశాడు. మర్నాడు దాన్ని ద్వారబంధానికి కట్టాడు.

ఆ తెరని అవ్వకి చూపించి, ఆ తెర ఎక్కడికీ పోలేదనీ ఎవరో పోకిరీ పిల్లలు దానికి వేళ్ళాడి ఉయ్యాల ఊగుంటారనీ, అదికాస్తా తెగి పడటంతో మీరు తిడతారని భయపడి దాన్ని మిద్దెమీద పారేసి పారిపోయి ఉంటారనీ ఓ కట్టు కథ అల్లి చెప్పాడు. ఎంగటవ్వ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. ఆవిడ బోసినవ్వులు చూస్తుంటే విశ్వనాథ్ కి ఏనుగెక్కినంత సంబరం కలిగింది.

మ మరో మూడు రోజులు మామూలుగానే గడిచిపోయాయి. నాలుగోరోజు సాయంత్రం చూస్తే ద్వారబంధానికి మాత్రమే కాకుండా ఉత్తరపు ద్వారానికి కూడా మరో తెర కనపడ్డంతో ఆశ్చర్యపోయాడు విశ్వనాథ్.

తీరా వెనకవైపు వెళ్తే తులసికోట పక్కన కూర్చుని చరవాణిలో పాటలు వింటోంది అవ్వ.అతడిని చూడగానే "ఈ అవ్వ ఎర్రికాలం మనిసి. అన్నింటికీ అగ్గగ్గలాడతా ఉంటాది. దాన్ని బాదపెట్టేది దేనికి అనుకున్నావు. దానికే అదే పనిగా కొత్త వాకిలి గుడ్డ తెచ్చినావు. పిల్లకాయలు మిద్దిమిందేసినారని ఈ అవ్వకే కతలు చెప్పినావు. కానీ నారప్ప మనమడు దీన్ని పుల్లైసుకి ఏసి ఐసు తింటావుంటే చూసినా. ఐసోనికి దుడ్లిచ్చి గుడ్డ తెచ్చినా. ఐతే పోన్లే, ఒప్పుకోనిండే పని భద్రంగా చేసినా. నీ పెండ్లాం ముందు తల దించుకునే పని లేకుండా చేసుకున్నా" అంటూ ఉంటే అబ్బురంగా చూస్తూ నిలబడిపోయాడు విశ్వనాథ్.

"చూడు మనవడా, నువ్వు చేసిండే పని మాత్రం నేను సచ్చినా మర్చిపోను" అని చెప్పి తను చేసిన పులుంటలు తెచ్చిపెట్టింది. అవ్వకి పెట్టడం కొత్త కాదు, తనకి పులుంటలూ కొత్త కాదు. కానీ ఈరోజెందుకో అవే పులుంటలు అమృతగుళికల్లా అనిపించాయతనికి.

*

అన్ని రోజులూ ఒకలాగే ఉండవు. ఉన్నట్లుండి ఒకరోజు ఎంగటవ్వ గడప దాటుతూ కాలి కింద పడిపోయింది. ఆవిడ లేవలేక ఇబ్బందిపడుతూంటే విశ్వనాథ్ భార్య లేపి కూర్చోబెట్టింది. కుడి కాలు స్వాధీనం తప్పింది. విశ్వనాథ్ వెంటనే ఆవిడని రూయా ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమెకి అయివాళ్ళెవరో తెలియకపోవడంతో ప్రమాదం సంగతి ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆసుపత్రిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు.

అతని సమస్యని పరిష్కరించడానికా అన్నట్టు ఒకరిద్దరు అవ్వని చూడ్డానికి వచ్చారు. చూస్తుండగానే ఆ ఇద్దరు నలుగురయ్యారు. ఆ నలుగురు నలభైమందై, చివరికి ఎంగటవ్వని చూడ్డానికి వచ్చే జనంతో ఆసుపత్రి తీర్థయాత్రాస్థలంలా మారిపోతుంటే నోరెళ్ళబెట్టుకు నిలబడిపోయాడు విశ్వనాథ్.

*

బయటికి వస్తూండగా విశ్వనాథ్ ని అడిగింది భార్య, "అవ్వ మీ చెవిలో ఏదో రహస్యం చెప్పింది. ఏమిటది?"

"ఏమీ లేదు"

"ఏమీ లేకపోతే మీకు నవ్వెందుకొచ్చింది?"

"రహస్యం అంటే పదిమందికీ చెప్పేది కాదు" అంటూ మళ్ళీ నవ్వాడు విశ్వనాథ్. తనుకూడా నవ్వేస్తూ అంది అతని భార్య, "నేను చెప్తా వినండి, మీరు సిద్ధారెడ్డి కొడుక్కి ఉద్యోగం వేయించినందుకు డబ్బిస్తే తీసుకోలేదు. అందుకే ఆయన ఉంగరం చేయించి బలవంతంగా చేతిలో పెట్టాడు. మీరేమో దాన్ని అమ్మేసి అవ్వ పేరుమీద అనాథ శరణాలయానికిచ్చారు. అందుకు అవ్వ మిమ్మల్ని అభినందించింది. అంతేగా, పోన్లెండి ఇన్నేళ్ళుగా నేను చెయ్యలేనిపని అవ్వ చేసింది."

విశ్వనాథ్ కి నోట మాట రాలేదు.

*

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ఒక అయ్యవారు విశ్వనాథ్ దగ్గరకి వచ్చారు "ఈ తిరుపతిలో ఎంగటవ్వ సంగటి ముద్దలు తినకుండా పైకొచ్చినవాడు లేడు. ఇక్కడి పిల్లలందరికీ బడిలో పుస్తకాలు చదువు. బయట అవ్వ బండి దగ్గర న్యాయశాస్త్రాలు, నైతిక సూత్రాలు. లోపల విజ్ఞానం బయట వికాసం. అదీ అవ్వ ప్రత్యేకత. "పెద్దదానివైపోయావు, ఒంటరిగా ఎందుకు మాతో వుండచ్చుకదా"అని

అవ్వని అడగనివాడు లేడు. కానీ అవ్వ మాత్రం వెళ్ళదు. ఒకరిని ఆశ్రయించకుండా ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా తిరగ్గలుగుతోందంటే అందుకు కారణం ఆవిడలోని చైతన్యమే. మీరేనా ఎంగటవ్వ మాడీలో ఉండేది? ఆ మాడీ అంటే మనిసితనానికి అవ్వ కట్టిన దేవళం. అవ్వ కాలికి దెబ్బ తగిలినమాట తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ జనాన్ని చూస్తే చాలు అవ్వ గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. వీళ్ళంతా ఎవరను కుంటున్నారు. మంచితనానికి మా అవ్వ కట్టిన మాడిలో ఇటికలు" అని చెబుతూంటే వింటున్న విశ్వనాథకి ఒళ్ళు పులకించిపోయింది.

( అంకితం: మానవత్వానికి మాడీ కట్టిన వెంకమ్మవ్వకి)

 - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

Tags:    
Advertisement

Similar News