ఏకాకిగ లంక లోన
ఏడాదిగా ఎదుట వున్న
ఏనాడూ తాకలేదు సీతమ్మను
దశకంఠుడు
విరటుని కొలువున
ద్రౌపది సైరంధ్రిగ పడివున్నా
బలవంతం చేయలేదు.
సింహ బలుడు కీచకుడు
ఏక వస్త్ర మొలిచినంత
పరువు కాచె శ్రీకృష్ణుడు
అంక సీమ చూపి నంత
తొడలు విరిచె వృకోదరుడు
ఆ దుర్యోధన దుశ్శాసన
వారసులే అంతా
ఈ దేశంలో హరి, భీములు లేకుండుటే వింత
రాతి గుహల నివసించిన
ఆదిమ ద్విపాద మృగం
రోదసిలో విహరించెను
అభినవ మానవ ఖగం
మేడలలో వసియించెను
మేధస్సే వికసించెను
అయినా ఆ పశు ప్రవృత్తి
నరనరాన వికటించెను
తల్లినైనా కామించే
తనయులున్న ధరణి ఇది
చెల్లినైన చెరబట్టే అన్నలున్న
అవని ఇది
కూతుళ్ళతో రమియించె
తండ్రులున్న పుడమి ఇది
వావి వరస నశియించిన
జనారణ్య జగతి ఇది..
చిరు మొలకగ ఉన్నపుడే
కడుపున చిదేమేస్తున్నారు
పుట్టీ పుట్టక ముందే శీలం దోచేస్తున్నారు
అందంగా జన్మించకమ్మ
అదే శాప మౌతుంది
మర్మాంగంతో పుట్టకమ్మ
మానభంగ మౌతుంది