పంజరం (కథ)

Advertisement
Update:2023-10-11 00:18 IST

సాయంత్రం ఐదు గంటలకు

మహిత స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో ఎవరో ఇద్దరు కూర్చొని తండ్రితో మాట్లాడుతూ కనిపించారు.తన రూంలోకి వెళ్లబోతుంటే ఆమె తండ్రి శ్రీనాథ్ " మహీ! ఇలా రామ్మా" అని పిలిచారు.మహిత వెళ్ళగానే"అమ్మా, వీరు రాజారాం గారు,మనకు బాగా తెలిసినవారు,దూరపు బంధువులు కూడా.వీరు అనిల్ కుమార్ గారు,రాజారాం గారి బావమరిది" అని పరిచయం చేశారు.మహిత చిరునవ్వుతో"నమస్తే అండి"అని చెప్పి లోపలికి వెళ్ళిందిల

"ఫోటోతో సహా అబ్బాయి వివరాలన్నీ మీ ఈ మెయిల్ కి పంపించారు.అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని ఫోన్ చేయండి."అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.

"అమ్మాయికి ఈ సంబంధం నచ్చుతుంది అంటారా"సుజాత భర్తను అడిగింది. మళ్లీ తనే" నచ్చితే

బాగుండు. కోటీశ్వరులు పైగా ఒక్కడే అబ్బాయి" అంది.

" సుజా! అమ్మాయికి నచ్చితేనే ఏ సంబంధం అయినా ఓ కే చేసేది.రేపు ఆదివారం కదా.తను ఇంట్లోనే ఉంటుంది. లీజర్ గా మాట్లాడుదాం,కంగారు పడకు."అన్నాడు.

ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత శ్రీనాథ్,సుజాత ఇద్దరూ మహిత రూంలోకి వచ్చారు.ఏదో బుక్ చదువుకుంటున్న మహిత తలెత్తి చూసి "వావ్!ఇద్దరూ ఒకేసారి రూంలోకి వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి అన్నట్టే ...ఏంటీ, మళ్ళీ ఏదైనా పెళ్లి సంబంధం గురించా" నవ్వుతూ అడిగింది.

సుజాత మంచం పైన కూర్చొని విషయం చెప్పమన్నట్టుగా భర్త వైపు చూసింది.

" మహీ!నిన్న నీకు పరిచయం చేశాను చూడు...వాళ్ళు నీకొక మంచి సంబంధం తెచ్చారు.అబ్బాయికి సంబంధించిన వివరాలు అన్నీ నీ వాట్సప్ కి ఫార్వర్డ్ చేశాను,చూడు.నీకు నచ్చితేనే ఓ కే అందాం,లేకపోతే లేదు"

" ఇంకా ఈ రోజుల్లో కూడా మధ్యవర్తులు సంబంధాలు తేవడం ఏంటి నాన్నా!ఇంటర్నెట్ ఓపెన్ చేసి మాట్రి మొనియల్స్ చూస్తే బోలెడు మంది వివరాలు ఉంటాయి.మనకు నచ్చిన వాళ్ళను అప్రోచ్ అవొచ్చు".

"అఫ్ కోర్స్,నువ్వు చెప్పేది నిజమే కానీ తెలిసిన వాళ్ళు తెచ్చారు కనుక వివరాలు కరెక్టుగా ఉంటాయి.పెద్దగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండదు."

"అమ్మాయ్, అబ్బాయి వాళ్ళు కోటీశ్వరులు.అతని పేరు రాజ్ తరుణ్.లండన్ లో ఎం.బి.ఏ చేసి వచ్చి వాళ్ళ నాన్న గారికి బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నాడట.స్కూల్స్ కూడా ఉన్నాయట.

" అంత డబ్బు ఉన్నవాళ్లు నన్నే ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నారు"

"మొన్న మీ రవి బాబాయికి నీ కోసం ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాను.నీ ఫోటో కూడా ఇచ్చాను.రవికి రంగారావు గారు బాగా తెలుసు.ఆయనకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి.అందుకే నీ గురించి చెప్పి డీటైల్స్ ఇచ్చాడట. అందుకని వారు మన దగ్గరకు వచ్చారు.అబ్బాయి వాళ్ళు నీ ప్రొఫైల్ చూసి మనను అప్రోచ్ అవమంటేనే వచ్చారట."సుజాత అంది.

"మహీ!నీకు ఒక విషయం చెప్పాలి.అతనికి ఇంతకు ముందే పెళ్లి అయింది.కానీ,సంవత్సరం తిరగకుండానే మ్యూచవల్ గా అనుకొని డివోర్స్ తీసుకున్నారట"

"అనుకున్నా,ఇలాంటిది .ఏదో ఉంటుందని. లేకపోతే.."

"వాళ్ళు ముందు మనలాగే మిడిల్ క్లాస్ వాళ్ళే నట.తరువాత అబ్బాయి వాళ్ళ నాన్న గారు స్కూల్స్ ప్రారంభించి, తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఇప్పుడు కోటీశ్వరులు అయినారు. అమ్మాయి చక్కగా ఉండి,చదువుకొని, ఫ్యామిలీ మంచిదయితే డబ్బుతో సంబంధం లేదంటున్నారు."

"మహీ!అబ్బాయి చాలా మంచి వాడని రంగారావు గారు చెప్పారు.వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయో మనకు తెలీదు. ఆలోచించుకో,నీకు ఇష్టమైతెనే ప్రొసీడ్ అవుదాం లేకపోతే లేదు".

"సరే నాన్నా! నాకు కొంత టైమ్ ఇవ్వండి.వీలైతే నేను అతనితో ఒకసారి మాట్లాడాలి."అంది.

"సరే నీ ఇష్టం.నీకు కావలసినంత టైమ్ తీసుకో.అలా అని వాళ్ళను ఎక్కువ రోజులు వెయిటింగ్ లో ఉంచడం మర్యాద కాదు"అని లేచి శ్రీనాథ్ హాల్ లోకి వెళ్ళాడు.సుజాత అతడిని అనుసరించింది.

మరునాడు స్కూల్ లో లంచ్ టైం లో మహిత తండ్రి ఫార్వర్డ్ చేసిన అబ్బాయి ఫోటో,వివరాలు చూస్తుండగా కొలీగ్ రాధిక అటు వచ్చి"లంచ్ కి రావా" అంటూ సెల్ లోకి చూసి"అరే,తరుణ్ ఫోటో నీ దగ్గర ఉందేంటి"అంది.మహిత ఉలిక్కిపడి చూసి"అతడు నీకు తెలుసా"అని అడిగింది.

" ఆ...అతడి పెళ్లికి కూడా వెళ్ళాను.అతడు పెళ్లి చేసుకున్న అనూష నా క్లాస్ మేట్.అందుకే వాళ్ళ పెళ్లికి పిలిస్తే వెళ్ళాను"

"అనూష నా....తన ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర,నేను ఒకసారి తనతో మాట్లాడాలి,వీలైతే కలవాలి"మహిత ఆతృతగా అడిగింది.

"ఎందుకు?అతడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా"

"అబ్బా !రాధికా.... అదంతా తరువాత చెప్తాను.ముందు ఆమెతో మాట్లాడి టైమ్ తీసుకో,వెళ్లి కలుద్దాం"

"సరే ఉండు,ఇప్పుడే ఫోన్ చేస్తాను"అని రాధిక ప్రక్కకు వెళ్లి ఫోన్లో మాట్లాడి వచ్చింది.

"లాభం లేదు మహితా,తను రేపే అమెరికా వెళ్తుందట.చాలా బిజీగా ఉన్నానని "అంటోoది.నేను రిక్వెస్ట్ చేస్తే ఫోన్లో మాట్లాడడానికి ఒప్పుకుంది.ఇది లంచ్ టైమ్ కదా.బయటకు వెళ్లి

మాట్లాడు,తన నెంబర్ ఇస్తాను.

మహిత రాధిక దగ్గర అనూష ఫోన్ నెంబర్ తీసుకొని బయటకు వచ్చి కాల్ చేసింది.అనూష వెంటనే మాట్లాడింది.

"హలో,నా పేరు మహిత అండి.మీతో రెండు నిమిషాలు మాట్లాడుతాను" అవతల నుండి సన్నగా నవ్వు వినిపించింది."హలో మహితా!నన్ను అండి అనకు.రాధిక చెప్పింది తరుణ్ ఫోటో నీ దగ్గర ఉందని.బహుశా నువ్వు అతని గురించి అడుగుదామని అనుకుంటున్నావు కావచ్చు.తరుణ్ మంచివాడే కానీ, అతడు ఎప్పుడూ తన బిజినెస్ పనులతో బిజీగా ఉంటాడు.వాళ్ళ పేరెంట్స్ కూడా తన తోటే ఉంటారు.ఆ ఇంట్లో అవసరానికి మించిన పని వాళ్లు వుంటారు.నాకు పెద్దగా పనేమీ ఉండేది కాదు.చాలా లోన్లీ గా ఫీల్ అయ్యాను.అన్నిటికీ మించి ముందు నుండి నా డ్రీమ్ అమెరికా వెళ్లి ఎం.ఎస్.ఆ తర్వాత ఎం.బి.ఏ. చేయాలని.నాకు పేరెంట్స్ లేరు. మామయ్య కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించారు.కానీ,నా మనసులో స్టేట్స్ కు వెళ్ళాలన్న కోరిక అలాగే ఉంది.ఎందుకో ఆ ఇల్లు నాకు పంజరంలా అనిపించింది. స్వేచ్ఛను కోల్పోయాను అనుకున్నాను.అందుకే తరుణ్ తో నేను తనతో ఉండలేనని చెప్పాను.అతను అర్థం చేసు కున్నాడు.ఇద్దరం మ్యూచ్ వల్ గా అనుకొని డివోర్స్ తీసుకున్నాం. అంతే కానీ అక్కడ నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు.నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా,బాయ్"అని ఫోన్ ఆఫ్ చేసింది.

ఆ తర్వాత మహిత తరుణ్ తో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాడు."అనూష మంచి అమ్మాయి,కానీ ఎందుకో మా ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోయింది.స్టేట్స్ కి వెళ్దామని అడిగింది.కానీ,నేను లండన్ లో స్టడీస్ కంప్లీట్ చేసే డాడీకి హెల్ప్ చేయడానికి ఇక్కడకు వచ్చాను.అందుకని నాకు కుదరదన్నాను.తను వెళ్తానంది. నాతో ఉండలేనని చెప్పింది. ఓ కే అన్నాను.మీ లాగా తను ముందే మాట్లాడి ఉంటే బాగుండేది,మా పేరెంట్స్ కూడా బాధ పడుతున్నారు".

మహిత తాను మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేస్తానని, మంత్లీ ఒకటి,రెండు సార్లు ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి వాళ్ళతో గడపడం,అవసరమైన హెల్ప్ చేయడం తనకు అలవాటని,దానికి ఒప్పుకోవాలని అడిగింది.అతడు ఒప్పుకున్నాడు. వాళ్లకు రెండు,మూడు స్కూల్స్ ఉన్నాయని,తనకు ఇష్టమైన చోట జాబ్ చెయ్యొచ్చు "అన్నాడు.

ఆ తర్వాత వాళ్ళ మ్యారేజ్ సింపుల్ గా కొద్ది మంది మిత్రులు,ఆత్మీయుల సమక్షంలో జరిగింది.క్రమంగా ఆ ఇంట్లో అవసరానికి మించి ఉన్న వర్కర్స్ ని వేరే దగ్గరకు షిఫ్ట్ చేశారు.మహిత స్కూల్ నుండి రాగానే కొద్ది సమయం అత్తగారితో గడుపుతుంది .తరుణ్ బిజినెస్ పనులపై వేరే ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మహితను కూడా తీసుకెళ్తున్నాడు.

ఆరు నెలల తర్వాత మహిత అనూష కు వాట్సప్ లో మెసేజ్ పెట్టింది."నా జీవితంలో మీతో మాట్లాడిన ఆ కొద్ది నిమిషాలు చాలా విలువైనవి.తరుణ్ గురించి మీరు పాజిటివ్ గా చెప్పడం వల్లనే అతనితో పెళ్లికి ఒప్పుకున్నాను. వాళ్ళ స్కూల్ లోనే జాబ్ చేస్తున్నాను. నేను చేసే సేవా కార్యక్రమాలకు కూడా వాళ్ళు అడ్డు చెప్పడం లేదు.నేను పంజరంలో చిలకలా కాకుండా తోటలో ఉన్నట్టే భావిస్తున్నాను. అందుకే మీకు థాంక్స్ చెప్పుకుంటున్నాను".

ఆ మెసేజ్ చూసి అనూష ఆలోచనలో పడింది."మహిత తెలివైనది.పెళ్లికి ముందే తరుణ్ తో తనకేం కావాలో చెప్పింది.తను ఆ పని చేయలేక పోయింది.అయినా,తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకోవాలన్న కోరిక తనను అతడి నుండి వేరు చేసింది.ఏదీ ఏమైనా,

తెగిపోయిన బంధాల గురించి ఎక్కువగా ఆలోచించ కూడదు" అనుకొని

" ఓ కే,కంగ్రాట్స్".అని రిప్లయి ఇచ్చింది".

- డా. కె. పద్మలత

Tags:    
Advertisement

Similar News