మనిషి--మ్రాను

Advertisement
Update:2023-04-04 12:59 IST

చిగురాకులు ఆకాశం వైపు

వేళ్ళు పాతాళం లోతూ

ప్రకృతి లో ఒక మహా వృక్షం

ఆశ ఆచరణవైపు మళ్ళితే

ఫలితం ఘనవిజయం!

మాను వికాసం వంటిదే

మనిషి వ్యక్తిత్వం కూడా!

కోపావేశాలు ఏనాడూ కొమ్మలుగా ఎదిగనీయవు

మ్రానుకున్న ఓర్పు సహనాలే ఫలాలనిస్తున్నాయి

మ్రానులో ఉన్న శాంతచిత్తాలే శాఖోపశాఖలై

వంశవృధ్ధిని చేసుకుంటూ భావితరాలను నడిపిస్తాయి

రాగద్వేషాలు ఋతువులుగా వచ్చిపోతుంటాయి

అప్పుడప్పుడూ ఈర్ష్యాసూయల ఈదురుగాలులు

కూకటివేళ్ళను కుదిపేయచూసినా

నిరాశ నిస్పృహలను నీరుగా మార్చుకొని పైకి ఎదగే

మ్రాను మానవాళికి స్పూర్తినిస్తుంది.

చల్లని గాలులకు చలించకుండా

గ్రీష్మ తీవ్రతకు తలొగ్గకుండా భిన్నమైన కాలాలను

అవితెచ్చే మార్పులను స్వీకరిస్తేనే మానవునిలో

స్థితప్రజ్ఞత మొదలౌతుంది

జీవితంలో ఒడుదుడుకులను సవాలుగా తీసికొని

గమ్యంవైపు దృష్టి సారిస్తే

లక్ష్యాలు ఆశయాలు నెరవేర్చుకునే మార్గం కనిపిస్తుంది

చరించే మానవుని బుద్ధి కూడా అస్తవ్యస్తగమనం లో

సాగుతుంది

స్థిరనివాసముండే వృక్షం స్థిరచిత్తం కలిగి ఆదర్శం గా

నిలుస్తుంది

మనిషి మ్రానును స్పూర్తి గా తీసుకుంటే మనీషిగా

చరిత్రలో నిలుస్తాడు

-డా.దేవులపల్లి పద్మజ

(విశాఖపట్టణo )

Tags:    
Advertisement

Similar News