అక్కడో చెట్టు వుండేది
పక్కనే ఓ చెరువు కూడా
చక్కా మాకు ప్రకృతి ఉయ్యాలలో
ఎలా చొక్కు చెందాలో తెలిపేవి
చొక్కా విప్పేసి ఈత నేర్పించి
గుక్క తిప్పుకోకుండా జీవితాన్ని
ఎలాచక్క దిద్దుకోవాలో
అప్పుడే చెప్పినట్టు
ఇక ఇప్పుడా చెట్టు లేదు
చెరువూ లేదు
ఒక్కడు ఎవడో కనిపించాడు...
ఎక్కిన బైక్ లో అలాగే వున్న మదంతో
టెక్కు చూపిస్తూ వాడు
ఎక్కు పెడుతున్న విల్లు లాంటి
మోము పెట్టే
॰ఇక్కడ వుండే ' ఆ చెట్టు , చెరువు ' మేమేఅక్కర్లేదని తీసేసినం -
ఇంకేమైనా చెప్పాల్నా ...॰
చుక్క నీరు లేదు నా మోములో
కర్కశమైన మనుష్యులున్నారు గాని
చొక్కంగా గాలి నీరు ఇచ్చే
ప్రకృతి లేదే అని
క్రిక్కటిల్లిపోవడం నావంతయ్యింది
ఒక్క కన్నీటి చుక్క
అప్పటి జ్ఞాపకాలతో
తాకి పోయింది...
అంతే గాక
ప్రకృతిపై ప్రేమ మరింత పెరిగింది...
-డా చిట్యాల రవీందర్
Advertisement