శ్లోకమాధురి..ధనమూలమిదం జగత్

Advertisement
Update:2023-10-20 22:45 IST

'ధనమూలమిదం జగత్’ అన్న మాట మనం చాలాసార్లు విన్నదే, అనుభవంలో రుచి చూసినది కూడా.

క్రీ. పూ ఒకటవ శతాబ్దంలోనే శతకకర్త భర్తృహరి ఏమన్నారంటే…..

“యస్యాస్తి విత్తం స నరః కులీనః,

స పండిత, స్స శ్రుతవాన్, విధిజ్ఞః,

స ఏవ వక్తా, స చ దర్శనీయః,

సర్వే గుణాః కాంచన మాశ్రయంతి”

అని .

ఎవరి దగ్గర డబ్బు వుంటుందో అతదే మంచి కుటుంబం లో జన్మించినవాడు,పండితుడు, విద్యావంతుడు, అన్ని శాస్త్రాలలో నిష్ణాతుడు ,దక్షుడు,వక్త, చూడచక్కని వాడు- ఇలా ప్రజలచే కొలవబడతాడు. . ఎందుకంటే ఈ సగుణాలన్నీ సంపదను ఆశ్రయించి దానికి లోబడి ఉంటాయి.

డబ్బులుంటే ఇవన్నీ మహోన్నత గుణాలు, మరి ఈ గుణాలన్నీ లేదా కొన్ని వున్నా డబ్బు లేకపోతే అవన్నీ గడ్డిపోచతో సమానం

ఎందుకంటే డబ్బు లేకపోతే బంధువులు,దారాపుత్రులు,స్నేహితులు,అందరూ వదిలివేస్తారు,ఇదే లోకరీతి .డబ్బున్నవాడే ఈ ప్రపంచాన్ని ,సమాజాన్ని పరిపాలిస్తారు, వారు చెప్పేది వేదం. ఇలా డబ్బులేనివాళ్ళు  భావిస్తూ వుంటారు. వాళ్ళు వేసే అసందర్భ జోకులకు నవ్వుతూ,ప్రతి చిన్న కదలికనూ మెచ్చుకుంటూ, గుడ్డిగా వాళ్ళనునమ్ముతూ,వెనకవెనకే తిరుగుతారే తప్ప వారెంత  శ్రమపడి,కష్టానష్టాలకోర్చి ఆ డబ్బు సంపాదించారని తెలుసుకోరు.

అందుకే డబ్బు సంపాదించాలి అని

ఉద్యోగినం పురుషసింహం ఉపయితి

దైవం ప్రధానమ్ ఇతి కాపురుషాః వదన్తి,

దైవం విహాయ కురు పౌరుషం ఆత్మశక్త్యా

యత్నే కృతే యది న సిధ్యన్తి కోత్ర దోషః ।

లక్ష్మి, శ్రమించే వారిని మాత్రమే ఆశీర్వదిస్తుంది. ధైర్యవంతులు మరియు సాహసవంతులు మాత్రమే జీవితంలో విజయం సాధిస్తారు. తాను స్వయంగా నిర్వహించాల్సిన వాటికి కూడా విధి నిర్ణయించినట్లుగా జరుగుతుందని భావించేవారిని ధనం చేరదు . స్వశక్తి మీద ఆధారపడిన వాడికి లక్ష్మీ దేవి శ్రేయో సంపదలను అందిస్తుంది. "విధి" అని సాకు గాక ప్రయత్నం చేస్తే  తప్పు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాడు కవి.

ధర్మార్థ కామమోక్షా లనే పురుషార్థాలలో అర్థం -ధనం కూడా ఒకటి కదా! ఊరికే తిని కూర్చొంటే ఏం ప్రయోజనం.

అయితే మరి డబ్బులున్న వాళ్ళు కూడా ఇలా తమ వెనుక ‘డబ్బా’ కొడుతూ తిరిగే వాళ్ళను కనిపెట్టుకోవాలి .

- డా. భండారం వాణి

Tags:    
Advertisement

Similar News