శ్లోకమాధురి : అతి పరిచయం -అనంతర గతి

Advertisement
Update:2023-10-07 12:54 IST

అతిపరిచయాదవజ్ఞా భవతి విశిష్టేఽపి వస్తుని ప్రాయః।

లోక: ప్రయాగవాసీ నిత్యం కూపే స్నానం సమాచరతి॥

అతి పరిచయం(దగ్గరితనం) విశేషమైన విషయాల పట్ల కూడా తిరస్కారానికి దారి తీస్తుంది. (ఎలాగంటే) ప్రయాగలోని ప్రజలు రోజూ బావిలో నీళ్ళతో స్నానం చేస్తారు.

మనకి ఎన్నో సందర్భాలలో ఎంతోమంది ప్రతి నిత్యం  తటస్థ పడుతూ వుంటారు. కొంతమంది ఏదో సామాన్యపరిచయంగా వుండిపోతారు. కొంతమంది చాల దగ్గరవుతారు .కానీ కొద్దిమంది మనకు స్ఫూర్తిదాయకులుగాను,అనుసరణీయులుగానుఅయి ,

వారితో పరిచయం అయిన కొద్దీ మనసులో ఆకర్షణ పెరిగి వాళ్ళని వదలలేకుండా అయిపోతాం .

పరిచయం పెరిగిన కొద్ది మనసు చంచలంగా మారుతుంది. వారి పట్ల ఒక రకమైన స్వార్ధం పెరిగిపోతుంది. వారు మనకే సొత్తు అన్న భావన చెలరేగుతుంది. వారు ఎవరితోనైనా మాట్లాడినా మనకన్న అధికంగా వేరేవరి నైనా, చివరికి వస్తువుని సైతం ప్రేమించినా ఈర్ష్య అసూయ ద్వేషం లాంటివి కలుగుతాయి. దానివల్ల మానవ సంబంధాలలో ఎక్కువ సమస్యలు కూడా మొదలవుతాయి.


అలాగే అధిక సాన్నిహిత్యం ఉన్న ఒకరి ఇంటికి పదేపదే  వెళ్ళడం కూడా ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని,విలువను తగ్గిస్తుంది, అగౌరవానికి కారణమవుతుంది. అతి చనువు తీసుకుని ప్రవర్తించడం వల్ల అవసరానికి మించి మాట్లాడుతాము.

“సత్యాయ మితభాషిణాం”అని రఘువంశరాజులని మెచ్చుకున్నాడు కాళిదాసు.

అతి సాన్నిహిత్యం వల్ల ఇతరులకు మనపై చెడు అభిప్రాయం కలిగే ప్రమాదముంది, అనర్థాలు వాటిల్లే ప్రమాదముంది. ఇంకో కవి కూడా ఇదే విషయాన్ని ఈ విధంగా చెప్పాడు:

అతిపరిచయాదవజ్ఞతా సన్తతగమనాదనాదరో భవతి I

మలయే భిల్లపురన్ధ్రీ చన్దనతరుకాష్ఠమిన్ధనం కురుతే

అతిగా పరిచయం అనేది అనాసక్తి మరియు అవిధేయతకు దారితీస్తుంది. భిల్ల జాతి ఆటవిక స్త్రీలు గంధపు చెట్టు కొమ్మలని వంట చెరుకుగా వాడతారు . అలా విలువైన గంధపుచెక్క విశేష మర్యాద సత్కారాలతో గౌరవింపబడవలసినది(ఉపయోగించుకోవాల్సినది)అంతటి నిరాదరణకు గురై అవజ్ఞతను అంటే లోకువై పోయింది. అదిదాని గోప్పతనంలో లోటు కాదు.

పై శ్లోకంలో చెప్పినట్లు ప్రయాగలోని గంగానది ఔన్నత్యానికి పాపరాహిత్యగుణానికి భంగం జరగడంలేదు. అయితే అతి పరిచయంవల్ల కలిగిన చులకన భావం. పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదు అంటాంగా, అంతమాత్రాన (అది)అతడు వైద్యానికి పనికిరాదని(డని) కాదు, అదంతా అతి దగ్గరితనం వల్ల కలిగిన ఫలితం.

అందుకే మాటలోనైనా, పనిలోనైనా ఏవిషయంలోనైనా సరే అవసరమైన దానికంటే అతి లంపటం మంచిది కాదు.

ఓ రాణి గారి దగ్గరికి ఆమె తమ్ముడు ఉద్యోగం కోసం వచ్చి చిన్నపాటి ఉద్యోగాలు చేయనని, ముందు  రాజుకు సన్నిహితుడుగా మెలగి ఆపైన తనకు నచ్చిన పెద్ద ఉద్యోగం కొట్టేస్తానంటాడు , ఇంతలో సైన్యాధిపతి పోస్ట్ ఖాళీ అవుతే రాజు ఇవ్వడు. అప్పుడు రాణి అంటుంది . ‘ఆయనతో సన్నిహితంగా మెలగమన్నాను. విశ్రాంతి సమయంలో అలరించమన్నాను. అంతేగాని నిన్ను ఇరవై నాలుగు గంటలూ ఆయన్ని అతుక్కుని ఉండమన్నానా? నువ్వు అతిగా ప్రవర్తించావు. ఆహారం, నిద్ర లాగానే నీ సాహచర్యం ఆయనకు అలవాటై పోయింది. అదొక వ్యసనం అయింది. ఇప్పుడు నువ్వు పక్కన లేకపోతే భరించలేడు, ఉద్యోగ సద్యోగం లేదు, విదూషకుడిగా ఉండు’ అని మందలిస్తుంది .

అత్యంత సన్నిహితంగా వుంటే ఎంతటివారైనా చులకనవుతారు. మీరు నుండి నువ్వు, నువ్వు నుండి ఒరేయ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేగా మహకవి  భారవికి తండ్రి వేసిన శిక్ష.

అలాగని అందరికీ దూరంగా వుండాల్సిన పని లేదు, మనిషినీ, వారి యొక్క విద్వత్తుని బట్టీ , వారి పాండిత్యాన్ని బట్టీ , నడవడికను బట్టి సముచిత  స్థానంలో ఉంచి గౌరవించాలి,గౌరవించబడేలా వుండాలి.

ఆయుర్వేద శాస్త్రంలో వాతపిత్తకఫాలకి చెప్పినట్లు పరిచయం వుండాలి కాని సమపాళ్లలో(బ్యాలెన్స్ డ్ గా) ఉండాలి. "రోగస్తు దోషవైషమ్యం దోష సామ్యం ఆరోగ్యతా"

’रोगस्तु दोषवैषम्यं दोषसाम्यमरोगता

- డాక్టర్ భండారం వాణి

Tags:    
Advertisement

Similar News