“ఈరోజు ప్రేమికుల దినం కదా ! నువ్వింకా ఇంట్లోనే ఉన్నావేమే ? నా లెక్క ప్రకారం ఈపాటికి ఏ బీచ్ లోనో పార్క్ లోనో ఉండాలికదా? ఎవరినుండీ పిలుపు రాలేదా ? వ్యంగ్యంగా అంది శారద..
నీకేమి తల్లీ! అమ్మా ,నాన్నా! బ్రతికుండగానే, హాయిగా! పెళ్ళాడేసావు .అమ్మా నాన్న చక్కగాచదివించారు ,
చదువుకున్నావు . పెద్ద ఉద్యోగం వచ్చింది.. నీ ఉద్యోగం చూసి వెంటపడి పెళ్లి చేసుకున్నాడు బావ..
నా బతుకుకాభరోసా లేదు కదా?
అందుకే సంవత్సరానికి ఒకసారి వచ్చేది , ఈ పండుగ ఈ ప్రేమికుల పండుగ దినం సెలబ్రేట్ చేసుకుంటాను..
ఎవరైనా దొరక్కపోతాడా ! పెళ్లి కి ప్రపోజ్ చేయకపోతాడా అని ఐదేళ్ల బట్టి వెతుకుతున్నాను..
కనీసం ఈ ఏడాదైనా ఫ్లవర్ లు బొకేలు ఇచ్చి చెవిలో పువ్వులు పెట్టే వాడు కాకుండా,.చేయి పట్టుకొని
నన్ను నడిపించి పెళ్లి చేసుకునే వాడు వస్తాడేమో చూడాలి. ఒక ప్రయత్నం చేయాలి .
టెస్ట్ చేస్తే గాని కుదరదు కదా,అంటూ ఆఖరి సారి అందాన్ని అద్దంలో చూసుకుని, బై అని బయటకు వెళ్ళిపోయింది భామ….
దీని మొహం ఏడాదికి ఒకసారి ఎవడు దొరుకుతాడు? అలా వెతుక్కునే కంటే, ఏడాదికి ఒకసారి వచ్చేఆ పరీక్షలకు శ్రద్ధగా చదివితే ఈపాటికి కనీసం డిగ్రీ అయినా వచ్చి ఉండేది విసుగ్గా అనుకుని
పనిలో పడింది శారద.
పొద్దున్న సాయిబాబా మందిరానికి రమ్మని సందీప్ నుండి ఫోన్ వచ్చింది..
భామా! గుడికి వస్తున్నావా ?మనసు విప్పి బాబా ముందు మాట్లాడుకుందాం..
మన కోరికలు నెరవేర్చాలని మొక్కుకుందాం అన్నాడు …
సై అని బయలుదేరింది సత్యభామ…
బాబా భక్తునిగా సందీప్ చాలా రోజుల నుండి తెలుసు. సభ్యత సంస్కారం గలవాడు. హమ్మయ్య !బాబా నా మొర విన్నాడనుకుంది..
ప్రదక్షిణలు, దర్శనం అయిపోయాక, మండపంలో ఒక మూల కూర్చున్నప్పుడు, సందీప్ ని అడిగింది.
నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను, జీవితాంతం కళ్ళల్లో పెట్టుకుని
చూసుకుంటాను అంది నవ్వుతూ….
సందీప్ కంగారుపడి , టపటపా చెంపలేసుకుని, తప్పుడు మాటలు మాట్లాడితే భామా…బాగుండదు
మన మనసులో ఉన్నది బాబాకు చెప్పుకుందాం అన్నాను .నిన్ను చెప్పమన లేదు..
నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఏం చూసి చేసుకోవాలి? చదువా,సంధ్యా ?అందమా, చందమా?
ఏదో బాబా గుడికి వచ్చి వచ్చినప్పుడల్లా ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు , నీ వెనక నేను ప్రదక్షిణలు చేశాను
మంచి ఫ్రెండ్ గా ఉందాము అనుకున్నాను..కానీ! పెళ్లి పేరుతో జీవితమంతా నీ చుట్టూ ప్రదక్షిణలుచేయలేను..
తల్లీ!.. నీకో దండం …ప్రేమికుల దినం నాడు నా బుర్రంతా పాడు చేసావు అని వెళ్ళిపోయాడు..
నిశ్చేష్టురాలై నిలువునా కుంగిపోయింది భామ……
మార్నింగ్ షో కి రమ్మని ఫోన్ చేశాడు డిగ్రీ క్లాస్మేట్ మహేష్ .పరీక్షలన్నీ ఈరోజే పూర్తి చేయాలనుకుంది.
సినిమాలో “ఇంటర్వెల్ ముందు అడిగింది భామ. మనం పెళ్లి చేసుకుందామా ! అని ముద్దుగా….
అంటే ? అన్నాడు ఆశ్చర్యంగా
మహేష్..ఏముంది, మనం ఒకరికి ఒకరు చాలా బాగా తెలుసు కదా?
నీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది., నేను చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తున్నాను..
ఒకరంటే ఒకరికి తెలుసు కాబట్టి …….
ఈ ప్రేమించుకోవడం ఎందుకు? హాయిగా !పెళ్లి చేసుకుందాం అంది భామ.
"నిన్నా ప్రేమించడం? ఈరోజు అందరూ ఎంగేజ్ అయిపోయారు .నువ్వు ఖాళీగా ఉన్నావ్ కదా !
టికెట్ తీసి సినిమా ఫ్రీగా చూపెడతావని పిలిచాను..
వాలెంటైన్స్ డే రోజు వెటకారం ఆడుతున్నావా? నీతో నాకు పెళ్లి ఏంటి?నాకు ఆల్రెడీ 50 లక్షలు కట్నం తో ఎకరం పొలం తో, ఎంబీఏ చేసిన అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది.. ఎంటర్టైన్మెంట్ కోసం పిలవగానే వచ్చేవని సినిమాకు వచ్చాను. చాలు, చాల్లే! అని ఇంటర్వ్యూలో వెళ్లినవాడు.
మరి తిరిగి రాలేదు మహేష్…
సాయంకాలం బీచ్ కి వస్తావా అని ఫోన్ చేసాడు సారధి, అలాగే బీచ్ కి వెళ్లి…. "ఎన్నాళ్లు చెప్పు ఈ బీచ్ లో ఇసుకలో పేర్లు రాసుకునే సరదా !మనం.పెళ్లి చేసుకుందాం "అడిగింది భామ…..
“పాము పైన పడినట్లు ప్రేమగా పైన వేసిన తన చేతుల్ని తోసేసి, లేచి నిటారుగా నిలబడి ,
జవాబు చెప్పకుండా చరచరా వెళ్ళిపోయాడు సారథి..
“నువ్వంటే నాకు ప్రాణం .నువ్వు లేకపోతే చచ్చిపోతా. నీతోనే నా లోకం. అని ఆరేళ్లుగా చెబుతూ’, అప్పుడప్పుడు కనబడుతున్న పక్క వీధిలో నున్న ప్రణవ్ నుండి ఫోన్ రాగానే……..
పట్టువదలకుండా పార్కుకి బయలుదేరింది భామ..పాతికేళ్ల భామ పార్క్ లో ప్రణవ్ పక్కన కూర్చుని, దూరంగా పార్క్ లోకి వస్తున్న విశ్వహిందూ పరిషత్ వారిని, ఆర్ఎస్ఎస్ సభ్యులు చూసిఒక నిశ్చయానికి వచ్చి ప్రణవ్ కి మరింత దగ్గరగా జరిగి.అతడు వారిని చూడకుండా,, చున్నీతో కళ్ళకు కట్టిన ఆట ఆడదామనిఅతి చనువు గా ఆడింది..
వాళ్లకు దొరికిపోగా, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. అంటున్న ప్రణవ్ ను చూసి చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది భామ…
వాళ్లు గుంపులుగా వచ్చారు ...బలవంతంగా పార్క్ లో దొరికిన ప్రేమికులందరి చేత దగ్గరుండి తాముతెచ్చిన తాళిబొట్టు కట్టించి, పెళ్లిళ్లు చేశారు. దండలు మార్పించారు,, ఫోటోలు తీసి హమ్మయ్య కొందరు ఆడపిల్లల జీవితాలు కాపాడాం. అని గర్వంగా! నినాదాలు చేశారు .భారతీయ సంస్కృతి కీ జై! అని నినాదాలు చేస్తూ,,.
ఈ అమ్మాయిని వదిలేసినా ,వారికి అన్యాయం చేసినా తాటతీస్తాం….ఇప్పుడు ఈ ఫోటోలు పబ్లిక్ లో పెడతాం.ఈ రోజు మాకు దొరికిన ఈ.ఆడపిల్లలు మగ పిల్లలు చచ్చినట్లు నోరుమూసుకుని కాపురాలు చేయాల్సిందే!..మీలో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, కోర్టులో వేసి మీ అంతు తేలుస్తాము
పెళ్లి అయింది కదా!! తీరిగ్గా ప్రేమించుకోండి….
పెళ్లి మన సంప్రదాయం. పెళ్ళాన్ని ప్రేమించడం,ఆమెతో కాపురం చేయడం, మన సంస్కారం .
అని ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోయారు..
కార్పొరేట్ కామరాజు కొడుకు ప్రణవ్.అనవసరంగా పార్క్ లో కూర్చున్న మాకు పెళ్లి చేసేసారు దేవుడా !అని ఏడ్చినా,,,వాళ్ళ అమ్మానాన్న ఈ పెళ్లి చెల్లదన్నా,,,, భామ మాత్రం నా పెళ్లి చెల్లి తీరుతుంది..నాలుగేళ్ల బట్టి నా వెంటతిరుగుతున్నాడు.. పెళ్లి చేసుకోమని అడిగితే, కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత,
అప్పుడు చూద్దాం అన్నాడు.ఈరోజు పెళ్లి గురించి మాట్లాడుదామంటేనే పార్కుకి వచ్చాను .
అని అన్ని చానళ్ళ వారికీ చెప్పిందిభామ, ఏం తేడాగా ప్రవర్తించినా కోర్టుకెళతానని, నాదగ్గర సాక్ష్యాఉన్నాయని బెదిరిoచి ,హెచ్చరించి నిరాహారదీక్షకు పూనుకుంది భామ..
ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని చుట్టూ తిప్పుకుంటున్న ప్రణవ్ కు మాత్రం ,కక్కలేని మింగలేని పరిస్థితి వచ్చింది.
భామ నా భార్యని ప్రకటించాడు.. అతని తల్లి దండ్రులు తప్పనిసరై ఒప్పుకున్నారు .కథ సుఖాంతమైంది..
ఆరోజే ప్రేమికుల దినం, ఆరోజే వివాహ దినం,నా బతుకు పండిన దినం, అని సంతోషంగా పాటలు పాడుకుంది భామ.
- దామరాజు విశాలాక్షి
(కెనడా)