అతడొక
వ్యాధిపీడితుడైన ఉద్యోగి
అతని వ్యాధేమిటో
అతనికి తెలియదు.
ఇంక్రిమెంటు
అతని జీవన్మరణ సమస్య!
ప్రమోషన్
అతని జీవిత పరమావధి!
బాసుకు కాళ్ళొత్తడమే
అతని నిత్య కర్తవ్యం.
క్రిందిఉద్యోగిచేత
సేవలు చేయించుకోవడం
అతని హక్కు!
ఉద్యోగమే అతని ఉనికీ,మనికీ!
దాని కతీతమైన కాలం
బతుకులో ఉంటుందని ఎరగడతను!
ఏ అపరాత్రో
నరాల మెరమెర తృప్తించుకొని
పక్కకు పొరలడమేకాని
ఏనాడూ దోసిట్లోకి
తన సహచరి ముఖాన్ని తీసుకొని
ఆ కన్నుల్లోని అనంతాకాశాలనూ
సాగరాగాధాలనూ,
మేఘాల పింజలనూ
నక్షత్రాల దాగుడుమూతలనూ చూసుండడు!
మరీచికల మహాశూన్యాన్ని
తన ప్రేమ ప్రవాహంతో
ముంచెత్తుదామని
అనుకొని ఉండడు!
ఆ గృహిణి కూడా వ్యాధిబాధితే!
వంటింటినీ అలుగ్గుడ్డలనూ మరోసందులేకుండా
బ్రతుకులో పరచుకొని కూర్చుంటుంది!
లంచిబాక్సుల, స్కూలు సంచీల మీదినుంచి గమించి
సీరియళ్ళ చీకటిగుయ్యారంలో
ఐచ్ఛికంగా బందీ అవుతుంది
ఆ కృతక కూపాల అగాధ కశ్మలంలో అనుభూతిస్తుంటుంది
ఏనాడూ
భర్తతలను భావుకంగా
తనరొమ్ముల కదుముకొని
అతన్ని తన మనోహర మనోలోకంలోకి
ఆమనిరుతువుల అంగణంలోకి
పూలసౌరభాల్లోకి,వెన్నెలకెరళ్ళలోకి స్వాగతించి ఉండదు!
సౌందర్యమంటే ఏమిటో
తెలియదు వారికి
అసలు బ్రతుక్కు మించిన
మహా సౌందర్య మేమున్నది గనక!
జీవితమొక
మురళీరవప్రవాహంకదా!
ఒక మలయసమీరపు
వీచికా విలాసంకదా!
ప్రేమాశ్రువుల వానావానా వల్లప్పల జలదరింతకదా!
ఎవరిబ్రతుకును వాళ్ళేకదా
బతకాల్సింది
బ్రతుకులను పరిమళవంతం చేసుకోవలసింది ఎవరికి వారే గదా!
వారనే ఏముంది
ఈ లోకంలోని కోట్లాదిమందీ వ్యాధిపీడితులమని
ఎరుగని రోగులే!
కోవిడ్ కన్నా,మశూచికన్నా
సౌందర్యరాహిత్యమనే వ్యాధి
ఎంత భయంకరం!
- సి.హెచ్.వి.బృందావనరావు