మరో మారు (కథ)

Advertisement
Update:2023-08-01 15:20 IST

"ఆపు.. ఆపాపు." అతను సడన్ గా అన్నాడు.

నేను వెను తిరిగాను.

"ఆపు." అతను కంగారు పడుతున్నాడు.

నేను ఆటోను పక్కగా ఆపాను.

అతను నా చేతిలో ఇరవై నోటు పట్టేసి.. ఆటో దిగేసాడు.  అతను అదరాబాదరాగా అగుపిస్తున్నాడు.

"అన్నా. మిగతా డబ్బులు తీసుకో." అంటున్నాను.

అతను అప్పటికే అక్కడ నుండి గమ్మున పరుగు తీసేసాడు.

అప్పుడే ఒక పోలీస్ జీప్.. సైరన్ మోతతో అటుగా వచ్చి.. ముందుకు పోతుంది.

ఆ రొద లోంచి తేరుకున్నాను. ఐనా.. అతని సొద లోంచి బయట పడలేదు.

కొద్దిసేపటికి దాని నుండి తమాయించుకున్నాను. వెనుక్కు చూసాను.

వెనుక సీటు జారిపోయి ఉంది. ఆటో దిగి.. దానిని సరిగ్గా సర్దాను.

అప్పుడే.. అప్పుడే నా చూపున పడింది.. అక్కడ కింద పడి ఉన్న.. ఓ పర్సు.

దానిని తీసాను. అటు.. ఇటు తిప్పి చూసాను.

'బహుశా ఇది.. ఇందాక దిగిన అతనిదే కావచ్చు.' అనుకున్నాను.

అతను కంగారుగా వెళ్లిన వైపు చూసాను. 'ప్చ్. ఏమిటో ఆ మనిషి.' గొణుక్కున్నాను. 'ఇప్పుడు ఏం చేయాలి.' ప్రశ్నించుకున్నాను.

ఏమీ తోచడం లేదు. ఆ పర్సు లోకి చూసాను.. ఏమైనా వివరాలు తెలుస్తాయెమోనని. పర్సులోపల డబ్బు కట్ట ఉంది.. ఏవో కార్డులు కూడా ఉన్నాయి.కార్డులు తీసాను. డెబిట్ కార్డులు రెండు ఉన్నాయి. అవి వేరు వేరు బ్యాంకులవి. కాని వాటి మీది పేర్లు మాత్రం.. ఒకరివే. యం. రాంలింగం.

మిగతా కార్డులు చూశాను. అవి విజిటింగ్ కార్డ్స్. అవి అన్నీ ఒకరివే. పైగా.. యం. రాంలింగంవే.

మళ్లీ పర్సులో డబ్బు కట్టను చూసాను. పెద్ద మొత్తంలానే ఉంది. అయ్యో.. ఎలా పారేసుకున్నాడు.

ఐనా.. ఏమిటా మనిషి.. మరీ గందరగోళం పడ్డాడు. పర్సునే కాన రాలేక పోయాడు.

నాకై ఇరవై నోటు తీసినప్పుడు పర్సును జేబులో పెట్టుకోవడంలో తడబడినట్టు ఉన్నాడు. నోటును నా చేతిలో పెట్టేస్తూ.. పర్సును జార విడుచుకునుంటాడు.

పాపం. గుర్తించేక.. పర్సు పోయినందుకు ఎంత గాభరా అవుతున్నాడో.

బహుశా.. పర్సు కోసం.. ఇటు తిరిగి వస్తాడేమో.

'ఆగాలి.. వేచి ఉండాలి.' అనుకున్నాను.

ఆ పర్సును పాంట్ ఎడమ బేబులో పెట్టుకున్నాను. అప్పటికే ఒక విజిటింగ్ కార్డ్ తీసుకున్నాను.  

ఆటో దగ్గరే నిల్చుని ఉన్నాను. అతను పోయిన వైపునే చూస్తూ ఉన్నాను.

కాలం గడుస్తుంది. అతని జాడ లేదు. ఆకలనిపిస్తోంది. తలవిదిలించుకున్నాను.

ఆటో ఎక్కాను. స్టార్ట్ చేసాను. నేరుగా ఒక టీ కొట్టు వద్దకు వెళ్లాను.

రెండు ఇడ్లీలు తిన్నాను. ఒక టీ తాగాను. పాంట్ కుడి జేబులోంచి నా పర్సు తీసాను. బిల్లు చెల్లించాను. తిరిగి నా పర్సును జేబులోకి కుక్కేను.

రెండు చేతులతో.. రెండు వైపుల పాంట్ జేబులను తడిమాను. రెండింటిల్లో పర్సులు తగిలాయి. నెమ్మదిగా కుదురయ్యాను.

బేరాలకై పోక.. తిన్నగా.. విజిటింగ్ కార్డ్ లోని అడ్రస్ ప్రకారం.. యం.రాంలింగం ఇంటికి బయలుదేరాను.. ఆటోతో.

ఆటోవాణ్ణి కనుక.. దారులు తెలుసు కనుక.. ఆ ఇంటిని సులభంగా చేరగలిగాను.

ఆ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగి ఉంది. అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు.

అతణ్ణి అడిగాను.. "యం.రాంలింగం గారిల్లు ఇదేనా."

"అవును." అన్నాడు కానిస్టేబుల్.

నేను లోనికి వెళ్లబోయాను.

"ఆగు. లోపల ఎంక్వయిరీ నడుస్తుంది." చెప్పాడు కానిస్టేబుల్.

నేను సందిగ్ధంలో పడ్డాను.

తటపటాయిస్తూనే.. "అతన్ని కలవాలి." చెప్పాను.

"ఇప్పుడు కుదరదు."  చెప్పాడు కానిస్టేబుల్.

"అతనికి పర్సు ఇవ్వాలి." చెప్పేసాను.

"పర్సా." కానిస్టేబుల్ టక్కున అడిగాడు.

"అవును. నా ఆటో.." నేను ఇంకా చెప్పలేదు.

ఆ కానిస్టేబుల్.. చటుక్కున.. నా భుజాల చుట్టూ తన కుడి చేతిని చుట్టేసి.. నన్ను ఆ ఇంటిలోకి సుమారుగా లాక్కుపోయాడు.

"సార్. పర్సు దొరికేసింది." గబుక్కున చెప్పాడు.. అక్కడి ఇన్స్పెక్టర్ తో.

అక్కడి వారంతా ఒక్క మారుగా తలలు తిప్పేసి.. మా ఇద్దరినే చూస్తున్నారు.

"పర్సు ఇతని వద్ద ఉంది." చెప్పాడు కానిస్టేబుల్. ఇంకా నేను కానిస్టేబుల్ చేతి పట్టునే ఉన్నాను.

"వదులు." చెప్పాడు ఇన్స్పెక్టర్.

కానిస్టేబుల్ నన్ను వదిలి పెట్టాడు. నేను తమాయించుకున్నాను.

"పర్సు ఏది." అరిచాడు ఇన్స్పెక్టర్.

"యం.రాంలింగంగారిది. ఆయనకు ఇవ్వాలి." చెప్పుతున్నాను.

"చుఫ్. ఆయనే ఈ పెద్దాయన. ఇటు ఇవ్వు.." అరుస్తున్నాడు ఇన్స్పెక్టర్.

నా ఎడమ పాంట్ జేబులోంచి పర్సు తీసి.. దాని మీద.. తీసి అట్టి పెట్టుకున్న విజిటింగ్ కార్డ్ ను పెట్టి.. వాటిని ఇన్స్పెక్టర్ కు అందించాను.

ఆ పర్సును చూస్తూనే.. ఇన్స్పెక్టర్ ముందున్న ఆ పెద్దాయన.. "ఇది నాదే." అనేసాడు

ఇన్స్పెక్టర్ మాత్రం నన్నే చూస్తూ.. "చూస్తే ఆటో డ్రయివర్ లా ఉన్నావు. ఏంటి కత." గడగడా అన్నాడు.  

జరిగింది చెప్పాను.ఆ పర్సును తన ఎదురుగా ఉన్న ఆ పెద్దాయనకు అందించి.. "చూడండి సార్. డబ్బు సరిపోయిందో లేదో." అన్నాడు ఇన్స్పెక్టర్.

ఆ పర్సును లాక్కున్నట్టు తీసుకున్నాడు ఆ పెద్దాయన. పర్సు తెరిచి.. డబ్బు కట్టను తీసి.. లెక్కించుకున్నాడు.

"సరిపోయింది సార్." అన్నాడు.

"ఆ పారిపోయిన వాడు ఎవరు. గుర్తు పట్టగలవా." అడిగాడు ఇన్స్పెక్టర్.

"ఎవరో సార్. నాకు తెలీదు." చెప్పాను.

ఇన్స్పెక్టర్ ఏదో అనబోతున్నాడు.

ఆ పెద్దాయన అడ్డై.. "వదిలేయండి. పర్సు దొరికేసిందిగా. ఆ పిక్పాకెటర్ పోతే పోనీ." అనేసాడు.

"సరే సార్.. సదా మీ సేవలో."  అన్నాడు ఇన్స్పెక్టర్.

ఆ వెంబడే నన్ను చూస్తూ.. "వెళ్లిపో." అన్నాడు.

నేను వెను తిరిగాను.

నిజాయితీ మళ్లీ గుర్తింపబడలేదు. మరో మారు నొచ్చుకున్నాను.

-బి .వి .డి .ప్రసాద రావు

Tags:    
Advertisement

Similar News