శాశ్వత చిరునామా

Advertisement
Update:2023-07-05 17:31 IST

‘మరణం అనివార్యం.అది ఎప్పుడన్నదే అంతుపట్టని రహస్యం. చనిపోయాక శరీరాన్ని వదిలి వెళ్లిన ‘ఆత్మ’ అనంతర ప్రయాణం ఏంటన్నది ఊహకే తప్ప వాస్తవానికి అందని సత్యం. కానీ బ్రతుకు ప్రయాణం మాత్రం ఆగనిది. సాగిపోవాల్సిందే. ఎగసి పడే అలకు అలుపన్నది లేనట్ట్టు, లోకానికి వెలుగును పంచే సూరీడుకు విశ్రాంతి కరువైనట్టు పరిస్థితులు ఎలావున్నా పోరాడడమే మనిషి కర్తవ్యం. "

బతికుండగా రాజగోపాల్‌, ఇప్పుడు ఆయన భార్యా, పిల్లలు...అంతే తేడా. కుటుంబ పెద్ద దూరమైతే ఆ కుటుంబ జీవనయానం ఛిన్నాభిన్నమవుతుం

దనేందుకు ప్రభావతి ప్రత్యక్ష సాక్షి’...ఆలోచిస్తూ అడుగు వేస్తున్న సీతారామయ్యకు రాజగోపాల్‌తో పంచుకున్న జీవితానుభవాలు స్మరణకు వస్తున్నాయి.

‘ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు ఆత్మసంతృప్తి’...ఎక్కడో చదివిన గుర్తు. నిజమే !ఎంత గొప్ప అక్షర సత్యం.

ఉద్యోగం, హోదా, జీతం...ఇలా అన్నింటా తమకంటే ఓ మెట్టుపైనే ఉన్న రాజగోపాల్‌ ఒక్కనాడూ మనశ్శాంతితో ఉన్నట్టు చూడలేదు.

‘అర్థం చేసుకోని భార్య, అవసరాలు గురించి తప్ప బాధ్యతలు తెలుసుకోలేని పిల్లలు, అవసరార్థం ప్రేమ నటించి అవసరం తీరాక ముఖంచాటేసే బంధువులు తప్ప నా మనసు తెలుసుకుని నాకు తోడుగా నిలిచేవారు ఒక్కరూ లేరయ్యా’...ఆవేదన అణచుకోలేక అప్పుడప్పుడూ రాజగోపాల్‌ అన్నమాటలు గుర్తుకువచ్చి సీతారామయ్య కళ్లు చెమ్మగిల్లాయి.

భర్తంటే కేవలం డబ్బు రాల్చే చెట్టులా భావించే ప్రభావతికి, తండ్రంటే తమ అవసరాలు తీర్చే యంత్రంలా భావించే పిల్లలకు రాజగోపాల్‌ దూరమయ్యాకగాని ఆయన విలువ తెలిసిరాలేదు.

చుట్టుముడుతున్న అవసరాలు, ఆసరాగా ఉండాల్సి వస్తుందేమోనన్న భయంతో దూరం జరిగిన అయిన వాళ్లను చూసి శూన్యంలో చిక్కుకున్న భావనతో దిక్కుతోచని సితిలో చిక్కుకున్న ఆ కుటుంబాన్ని చూసి జాలిపడడం తప్ప, తాను మ్రాతం ఏం చేయగలడు.

ప్రభావతికి ఇప్పుడు వాస్తవం తెలిసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీన్ని సరిదిద్దుకునే అవకాశం ఎంతమాత్రం లేదు’ మనసులోనే అనుకున్నాడు సీతారామయ్య.

రాజగోపాల్‌ కాలం చేసి అప్పుడే ఏడాది పూర్తయింది. కుటుంబం పరిస్థితిపై ఎన్నో కథలు. ఆర్థిక పరిస్థితి తారుమారై కనీస జీవనానికి కూడా ఆ కుటుంబం నానా అవస్థలు పడుతోందన్న సమాచారం సీతారామయ్య గుండెను మెలిపెట్టాయి.

‘అది తెలిసిన తర్వాత మనసంతా అదోలా అయిపోయింది. వాటిని తీర్చే స్థాయి, స్థోమత తనకు లేదు. ఏదో చేయాలన్న భావన తప్ప. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాలేదు. వారం రోజుల వ్యవధిలో ఏదోలా చేసి తనకు తోచిన సాయం ప్రభావతి చేతిలో పెట్టి తిరిగి వచ్చాడు. ఆలోచిస్తూనే పడక కుర్చీలో వెనక్కివాలిపోయారు సీతారామయ్య.

------------

‘రాజ్యం...రాజ్యం’

‘ఆ...ఏంటీ, ఎందుకా అరుపులు. ఇదొక్కటే మీకు తెలిసింది’...కాఫీ కప్పుతో వచ్చిన రాజ్యం భర్త ముందు టీ పాయిపై దాన్ని ఉంచి విసురుగా తిరిగి వెళ్లిపోయింది.సీతారామయ్య చిరునవ్వు నవ్వుకున్నాడు.

‘నా రాజ్యం ఎప్పుడూ అంతే. ఎవరైనా కోపం వస్తే మొగుడ్ని మాడ్చి చంపుతారు. నా రాజ్యం మాత్రం మరిన్ని సేవలు చేసి తన నిరసన తెలియజేస్తుంది. జపాన్‌లో కార్మికులు యాజమాన్యంపై నిరసన తెలపాలంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తారని ఎక్కడో చదివాను. నా రాజ్యం కూడా అదే తరహా. అందుకేగా తనంటే అంత ఆపేక్ష’ మనసులోనే అనుకున్నాడు.

సీతారామయ్య స్థానికంగా ఉండే ఓ కంపెనీలో సీనియర్‌ అసిస్టెంట్‌. రిటైర్‌ మెంట్‌కు ఇంకా ఆరేళ్ల సమయం ఉంది. పెద్దాయన అంటూ ఆఫీస్‌లో అందరూ గౌరవంగా పిలుచుకునే వ్యక్తిత్వం.

‘వీలైతే సాయం చేయి, లేదంటే వాళ్ల మానాన వాళ్లను వదిలేయ్‌, వారి తిప్పలేవో వారు పడతారు’ అన్న సూత్రం ముప్పై ఏళ్లుగా తూచాతప్పక పాటిస్తున్న వ్యక్తి. కష్టంలో ఆదుకోవడం మానవ ధర్మం అన్నది ఆయన అభిప్రాయం.

ఎవరికైనా కష్టం వస్తే తానే ముందుంటాడు. ఆదుకునేందుకు తాపత్రయపడతాడు.

‘ఎంతమందిని ఆదుకోగలమండీ !మనమేమైనా కోటీశ్వరులమా, జీతంతో బతికేవాళ్లం. ఇలా ప్రతి నెలా ఎవరికో ఒకరికి సాయం అంటే మన పరిస్థితి ఒక్కసారైనా ఆలోచించారా’ అంటూ అప్పుడప్పుడూ రాజ్యం విసుక్కోవడం తెలుసు.

నువ్వన్నది నిజమే రాజ్యం. కానీ ఎవరి కష్టాలు వారివే. ఒకరికి సాయం చేస్తే వారి అన్ని కష్టాలు తీరిపోతాయని కాదు. ఊహించని పరిణామంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి మనం చేసే సాయం కాస్త ఊరట అంతే’ అని సర్దిచెప్పడం తెలుసు.

సీతారామయ్యకు ఇద్దరు ఆడపిల్లలు. పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపాడు. బాధ్యతల బరువంటూ పెద్దగా ఏమీ లేదు. ఆడపిల్లలకు ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా అడిగే పరిస్థితి లేకపోవడం సీతారామయ్యకు కలిసివచ్చిన అంశం. సొంతింట్లో కాపురం, ఆరోగ్య సమస్యలు లేని జీవితం దేవుడిచ్చిన వరం. వార్థక్యంలో వీలైనంత వరకు ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్నట్టు గడిపేయాలని సీతారామయ్య కోరిక. కానీ, భార్య రాజ్యం మాత్రం ఈ వయసులో మీకెందుకీ పుర్రాకులూ అంటూ అప్పుడప్పుడూ సుతిమెత్తగా హెచ్చరిస్తూ ఉంటుంది.

‘అలా అనకు రాజ్యం! కష్టాలెప్పుడూ ఒక్కరితోనే ఉండవు. జీవితం క్షణభంగురం. రేపు అనుకోని పరిస్థితుల్లో నాకేమైనా అయితే ఈ సాయం విలువేంటో నీకే తెలుస్తుంది’ అంటే గయ్యమంటుంది.

‘అంటే...ఏమిటి మీ ఉద్దేశం. రేపు మీకు ఏదైనా అయితే నాకు వీరంతా అండగా ఉంటారని చేస్తున్నారా? మీరెంత పిచ్చివారండి. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలియకూడదనుకునే మీ మనస్తత్వానికి, ఇలా సాయం అందిన వెంటనే ,అలా సాయం చేసిన చేతిని మర్చిపోయే ఈనాటి మనుషుల తత్వం మీకు ఎప్పుడు అర్థం అవుతుందండి’ అంటూ మండిపడిన సందర్భాలెన్నో.

‘నా ఉద్దేశం అది కాదు రాజ్యం, మనల్ని అభిమానించే వారు నలుగురు ఉండడమే జీవితానికి పెద్ద భరోసా అని నా ఉద్దేశం. ఇప్పుడు నేనుచేసే మంచి రేపు హఠాత్తుగా నాకేదైనా అయితే నీకు భరోసాగా ఉంటుందన్న స్వార్థం అంతే. అర్థం చేసుకో’ అంటే రాజ్యం బుంగమూతి పెడుతుంది.

‘భర్త మనసు తెలుసుకుని నడుచుకునే తత్వం రాజ్యానిది. ఇన్నేళ్ల కాపురంలో ఏరోజూ భర్తకు ఎదురు చెప్పి ఎరుగదు. కోపం వస్తే అలా నిరసన తెలియజేయడం ఒక్కటే చేస్తుంది’

వాష్‌ రూం నుంచి వచ్చిన సీతారామయ్య ‘రాజ్యం’ అంటూ మరోసారి భార్యను కేకేసాడు.కోపం తగ్గిందో, కోపగించుకుని ఏం ప్రయోజనం అనుకుందో నెమ్మదిగా వచ్చి భర్తపక్కనే సోఫాపై కూర్చుంది రాజ్యం.

‘ఏంటి ఈ రోజు మేడం గారు గుంటూరు మిరపలా ఘాటుగా ఉన్నారు’... కవ్విస్తున్నట్టు అన్నాడు.

‘నేను గుంటూరు మిరపలా ఘాటుగా ఉంటే ఏంటి, కశ్మీర్‌ ఏపిల్‌లా తియ్యగా ఉంటే ?ఏంటి మీరు చేయాల్సింది చేస్తూనే ఉన్నారుగా, ఇక నేను ఎలావుంటే మీకు ఏం సంబంధం ఏముంది లెండి’ చిరాకు పడింది.

‘నిజమే రాజ్యం అది నా బలహీనత. కష్టాలను ఎవరూ కోరుకోరు. కానీ ఊహించనిది జరగడమే జీవితం. క్షణంలో పరిస్థితులు తారుమారు అయ్యే పరిస్థితులను అనుభవించిన వారికే ఆ బాధ తెలుస్తుంది. మన కాలనీలో ఉన్న కూర్మారావు కుటుంబాన్ని తీసుకో. ఎలా బతికింది, ఆయన దూరం అయ్యాక ఆ కుటుంబం పరిస్థితి ఎలావుంది. నిత్యం నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ కలివిడిగా ఉండే మనిషి. జాగింగ్‌, యోగా అంటూ ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ తీసుకునే వ్యక్తి గుండెపోటుతో చనిపోతాడని ఊహించామా చెప్పు.,ఆఫీస్‌కు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కృషమూర్తి కుటుంబాన్ని చూస్తే నాకు కన్నీళ్లు ఆగవంటే నమ్ముతావా? జీవితాన్ని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్న ఆ కుటుంబం కృష్ణమూర్తి మృతితో ఎన్ని అవస్థలు పడుతోందో నీకు తెలియదా? నిండా మూడు పదుల వయసు కూడా దాటని ఆ అమ్మాయిని, ఇద్దరు చిన్నపిల్లల్ని చూస్తుంటే నా మనసును ఎవరో మెలిపెట్టిన భావనకు గురవుతుంటాను.

నా ప్రాణస్నేహితుడు వంశీకృష్ణ దూరమవుతాడని ఎప్పుడైనా ఊహించామా! మాయరోగం వాడిని పొట్టన పెట్టుకుంది. వాడు పోయాక ఆ కుటుంబం అప్పులు, ఆస్తులు బయటపడ్డాక ముప్పైఏళ్లుగా ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న నేనే ఆశ్చర్యపోయాను. ఆస్తికంటే రెండింతలు అప్పు, రుణదాతల నుంచి పెరిగిన ఒత్తిడి తట్టుకోలేక ఆ తల్లీపిల్లలు ఒకేసారి ఈలోకాన్ని విడిచి వెళ్లిన ఘటన నాకళ్ల ముందు ఇప్పటికీ మెదులుతుంది తెలుసా!. నిజానికి తప్పుచేసింది వంశీకృష్ణ. శిక్ష అనుభవించింది అతని భార్యా, పిల్లలు. జీవితంలో ఇంతకంటే విషాదం ఏం ఉంటుంది చెప్పు.

మనిషి విలువ అతను ఉండగా తెలియదంటారు అందుకే. ఆడైనా, మగైనా ఎవరికైనా ఇది వర్తిస్తుంది. కొన్ని ఇళ్లలో భార్య దేవత అయితే భర్త దెయ్యం అవుతాడు. మరికొన్ని ఇళ్లలో భర్త దేవుడు అయితే భార్య దెయ్యంలా వ్యవహరిస్తుంది. అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు ఇటువంటి కుటుంబాలే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాయని చెప్పడం నా ఉద్దేశం.”

‘.......’

అంతెందుకు ?మన ప్రభావతినే తీసుకో. భర్త ఉన్నన్నాళ్లు అతన్ని పూచిక పుల్లలా చూసింది. ఇంట్లో సంపాదించింది ఆయన ఒక్కడే అయినా అదేదో తమ సంపాదనే అన్నట్లు భార్యా, పిల్లలు వ్యవహరించారు. రాజగోపాల్‌ స్థితప్రజ్ఞుడు కాబట్టి అప్పుడప్పుడూ నాలాంటి ఆత్మీయులతో తప్ప ఎవరివద్దా తన పరిస్థితి ఇదీ అని బయటపడని సంస్కారవంతుడు.

ఇప్పుడు ఆ భర్త లేని లోటేమిటో ప్రభావతికి తెలిసి వచ్చినా ఏం ప్రయోజనం? భగవంతుడు మనకు పరిపూర్ణ ఆయుర్ధాయం ఇస్తే సరే, లేకుంటే వారికంటే మనం ఏమీ గొప్పవాళ్లం కాదు కదా. నలుగురికీ కాసింత మంచి చేస్తే ఆ మంచి తనమే మనల్ని కాపాడుతుందన్నది నా నమ్మకం. ఇదేం కొత్త విషయం కాదు. నాకు ముందు కొన్ని లక్షల మంది నాలా ఆలోచించే వారున్నారు, ఇకపై కూడా కొన్ని లక్షల మందిలో నాలాంటి ఆలోచనలు కలగకుండా ఉండవు. కానీ ఈ దారిలో నడిచే వారికి ఆత్మసంతృప్తి ఉంటుంది అంతే. నీకది చాదస్తంగానో, చిరాకు తెప్పించేదిగానో ఉండొచ్చు. నా తత్వమని అర్థం చేసుకుని సహకిస్తున్నందుకు నేనెప్పుడూ రుణపడివుంటాను”

భర్త అంత ప్రాధేయపూర్వకంగా మాట్లాడేసరికి రాజ్యం కరిగిపోయింది.

‘ఊరుకోండి! అవేం మాటలు. మన స్థోమతకు మించిన ఆలోచనలు చేస్తున్నారన్న భావన తప్ప, మీరు తప్పు చేస్తున్నారని నేను మ్రాతం ఎలా అనగలను’ అంటూ అతనిపట్ల

ఆరాధన తో చూసింది రాజ్యం.

‘రాజ్యం !ఒక్క మాట చెప్పనా, ఎవరికి ఎంత సాయం చేసినా వారి అవసరాల్లో నేను తీర్చే వాటా -వెయ్యిలో ఒక వంతు కూడా ఉండకపోచ్చు. కానీ మనిషిగా మనవంతు బాధ్యత వహించామన్న తృప్తికలుగుతుంది అంతే !ఒక్కోసారి చిన్న సాయం కూడా అవతలి వారికి గొప్ప ఊరట అవుతుందన్నది నా నమ్మకం. అందుకే ఒక్కోసారి నా తలకు మించిన భారం అన్న భావన కలిగినా అడుగు వెనక్కువేయను’...భార్య భుజం మీద చెయ్యివేస్తూ చెప్పాడు సీతారామయ్య.

భర్తవైపు అభిమానంగా చూసింది రాజ్యం.

‘మీతో ఇన్నేళ్ల కాపురంలో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని అనుకున్నానండీ. కానీ ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలావుందని ఇప్పుడే అర్థమవుతోంది. మీరు మంచి చేస్తే నాకు మాత్రం సంతోషం కాదా చెప్పండి’ అంది రాజ్యం.

‘సో...నీ కోపం తగ్గిపోయినట్టేగా. ఆకలి వేస్తోంది, భోజనం చేద్దాం పద’ అంటూ లేచాడు సీతారామయ్య.

----------------

ఆ రోజు సీతారామయ్య సంస్మరణ సభ.

కంపెనీ సిబ్బంది అంతా కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన తోటి ఉద్యోగులే కాదు, ఎంతోమంది కాలనీ వాసులు, ఇతరులు ఉన్నారు. కారు దిగి కూతురు, అల్లుడు సాయంతో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ భర్త చిత్రపటం వద్దకు వచ్చింది రాజ్యం. కాసిన్ని పూలు చిత్రపటం ముందుంచి భర్త ముఖాన్ని చూస్తూ అలాగే నిల్చుంది.

"నడిచాను ఏడడుగులు నీతో... అదో ఆనందపు క్షణం...ఇన్నేళ్ల కాపురంలో నీ ప్రేమ వర్షపు జల్లులో తడిసి ముద్దయ్యాను...నీ వెచ్చని ఓదార్పులో ఎన్నోసార్లు సేదదీరాను...నీవు అలిగితే నాకు సరదా...నీవు కోపగించుకుంటే నాకు వినోదం...సందర్భం ఏదైనా అన్ని వేళలా నీ సాన్నిహిత్యమే నాకు కొండంత అండ...నీ ఆత్మీయ చుంబనంతో ఆనందపు వెన్నెలలో విహరించాను...నీ ఆనందభాష్పాలు చూసి కరిగిపోయాను...చెలీ! ఎప్పటికీ నువ్వే నా తోడు...నా నీడ. నన్ను వదిలి వెళ్లవు కదా’...తాను అలిగినప్పుడల్లా భర్త వల్లెవేసే కవిత్వం రాజ్యానికి గుర్తుకు వచ్చింది.

ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. అంతటి విషాదంలోనూ... ‘భర్త భుజం తట్టి నేను ఎక్కడికీ వెళ్లలేదు, నీతోనే ఉన్నాను’ అని చెప్పిన భావన కలిగింది రాజ్యానికి.

‘సీతారామయ్య అమర్‌ రహే’ నినాదాలతో ఈలోకంలోకి వచ్చింది ఆమె.

సర్వీస్‌ ఇంకా రెండేళ్లు ఉందనగా సీతారామయ్య గుండెపోటుతో చనిపోయారు. అంతిమ సంస్కారానికి ఊరు ఊరే వచ్చింది. భర్త పట్ల తోటి ఉద్యోగుల్లోనే కాదు, తాముంటున్న కాలనీవాసుల్లో ఎంత ఆప్యాయతాను రాగాలు ఉన్నాయో తొలిసారి తెలిసి వచ్చింది రాజ్యానికి.

‘చేసిన మంచి ఊరికే పోదంటారు. ఇందుకు ఆయన ఉదాహరణ’ మనసులోనే అనుకుంది రాజ్యం.

కాసేపటికి సభ పూర్తయ్యింది. ఎప్పుడూ భర్తతోపాటు చేదోడుగా ఉండే నలుగురైదుగురు ఆయన సహచరులు రాజ్యం వద్దకు వచ్చారు.

‘మాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడం సీతారామయ్యగారి అలవాటు. ఊహించనిది జరగడమే జీవితం. ఈ రోజు వాళ్లు, రేపు మనం అని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. ఆయన చనిపోయినా మాలో ఎప్పటికీ జీవించే ఉంటారు. మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యుల్లా భావించి అవసరమైతే మీకు అండగా ఉంటామని భావించండి’ అంటూ కోరారు.

‘మీ అందరి మనసు గెల్చుకున్న నా భర్త ధన్యులు. వారి ఆలోచన, ఆశయం గొప్పదే అనుకునేదాన్ని తప్ప ఇంతగొప్పదని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన మనమధ్య లేకున్నా ఆయన ఆశయాన్ని బ్రతికే ఉంచాలన్నది నా ఉద్దేశం. నా అవసరాలు చాలా పరిమితం. ఆ అవసరాలు తీర్చేందుకు నా బిడ్డలున్నారు. అందుకే ఆయన ఉద్యోగం ద్వారా అందిన మొత్తాన్ని మీకు ఇస్తున్నాను. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో ఆయన ఆశయాన్ని సదా బ్రతికించే ప్రయత్నం చేయాలన్నదే నా కోరిక. ఈ సాయం చేసి పెట్టండి చాలు’ అంటూ అందరివద్దా సెలవు తీసుకుని కూతురు, అల్లుడితోపాటు కారువద్దకు చేరుకుంది రాజ్యం.

కాసేపటికి కారు బయలుదేరింది. ‘సీతారామయ్య అమర్‌ రహే’ నినాదాలు చాలా సేపటి వరకు ఆమెకు వినబడుతూనే ఉన్నాయి.

- బి.వి.రమణమూర్తి

Tags:    
Advertisement

Similar News