భావన : విధి - సాధన

Advertisement
Update:2023-09-12 21:02 IST

స్థితిని బట్టి జీవన గతి, గతిని బట్టి సుగతి ఏర్పడటం, లేక దుర్గతి పాలవటం జరుగుతూ ఉంటుంది.

విధి విధానాన్ననుసరించి మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది. అంతా విధి విధానమే అయితే మనిషి చేయవలసింది గానీ, చేయగలిగిందంటూ గానీ ఏదీ ఉండదు. అహం బ్రహ్మాస్మి అనుకుని కాలం గడిపేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనేవారూ ఉన్నారు.

విధి లిఖితం, విధి బలీయం అంటూ అన్నీ వదిలేసి చేతులు ముడుచుకుని కూర్చోవడమే పని అయితే మానవ ప్రయత్నానికి విలువేముంది ? ఈ ప్రశ్నకు సమాధానం జీవితం ద్వారా రాబట్టుకోవాలి. విధికి తలవంచడమా, దాన్ని తలకెత్తుకోవడమా తేల్చుకోవాలి.

విధి అంటే కర్మ.

విధి అంటే నిబంధన.

మనిషికి జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు తన అస్తిత్వం గురించి ఈ లోకంలో తాను సాధించవలసిన దాని గురించి ఓ సంశయం ఎదురుకాక తప్పదు. తాను ఏం చేయాలో, చేయకూడదో, అర్థంకాని సందిగ్ధంలో పడకా తప్పదు. రెండు దారుల కూడలిలో ఎటు పోవాలో ఎరుక లేని బాటసారిలా అవుతాడు.

విధికి ఎదురీదడమా? ప్రవాహంతో పాటు తేలి పోవడమా? అన్న మీమాంస ఎవరికైనా ఎదురుకాక తప్పదు.

మహాభారత సంగ్రామంలో అర్జునుడు ఇలాంటి పరిస్థితినే చవి చూడవలసి వచ్చింది. “ఒక మనిషిగా తన వాళ్లనూ, గురువులనూ, బంధువులనూ, స్నేహితులనూ చంపాలా ? ఈ సంహారం సాగించి సాధించేదేమిటి.. ఇంత కన్నా అస్త్ర సన్యాసం చేసి, కురుక్షేత్ర రణక్షేత్రం నుంచి తొలగడమే మెరుగు కదా ?!” అని అనిపించిందా సవ్యసాచికి.'నేను, నాది’ అన్న భావన కర్తవ్యమూఢుణ్ని చేసింది. అర్జున విషాదయోగం కృష్ణ గీతామృతానికి మూల కారణమైంది. విధిని ఎదిరించమని గాని, లొంగి పొమ్మని గాని కృష్ణుడు చెప్పలేదు. కర్తవ్యం గుర్తు చేశాడు. ‘ఒక యోధుడిగా పోరు సలపడమే నీ ధర్మం. అదే నిన్ను కాపాడుతుంది. కర్మకు తగ్గ ఫలితం ఇస్తుంది’ అన్నాడు. అలా చేయడం నిష్కామ కర్మ యోగం. కర్మతో యోగించమని, కర్మఫలాన్ని గురించి ఆలోచించవద్దని పరమాత్ముడు ఆదేశించాడు.

'విధి’ అంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, లాభనష్టాలు, మంచి చెడ్డలు మాత్రమే కాదు. సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కుంగిపోవడం అంతకన్నా కాదు. భౌతిక జీవితంలో తారసపడే అనుభవాలు, అనుభూతులు, విధి విధానానికి కొలమానాలు కానేకావు. అవి కేవలం నీటి బుడగలు. జీవితంలో ఘటనలకు అతీతంగా శోధించి, సాధించ వలసిన పరమార్థం ఒకటున్నది. అదే గమ్యం. అదే పరమార్థ సాధన.

యోగ దృష్టికి సకల చరాచరాల్లో ఏకత్వం కనిపిస్తుంది. భూత భవిష్యత్‌ వర్తమానాలు కరతలామలకం అవుతాయి. ఏక కాలంలో మూడు మండలాలతో మమేకం కాగలడు. బ్రహ్మాది దేవతలకు అంతుపట్టని పరతత్వం ఒక యోగ దృష్టికి సామంతం నెరపుతుందని, మోక్ష సాధనకు యోగ మార్గమే శరణ్యమని గీత చెబుతున్నది.

భర్తృహరి సుభాషితంలో యతి నృపతి సంవాదం ఈ సత్యానికి తెరతీస్తున్నది. యోగాలకు రాజు రాజయోగం. రారాజు కరవాలం కన్నా యోగి రాజు యోగబలం చురుకైనది, కరుకైనదీ కూడా.

ఆచరణీయమైన ఆలోచనలకు సానపట్టడమే సాధన. ఒక గాజుపాత్రలో నీళ్లు పోసి నిదానంగా పరిశీలించితే అట్టడుగున నీటిలోని వ్యర్థాలు కనిపిస్తాయి. యోగి ఆలోచనల్ని వడగట్టి, బుద్ధిని ఏకాగ్రం చేయడం వల్ల మనసు నిలకడ పొందుతుంది. మబ్బు తొలగిన సూర్యుడిలా సత్యం అవగతం అవుతుంది.

చిత్త వృత్తులను నిరోధించడమే యోగం అని, నిశ్చలబుద్ధితో పనిచేయడమే కర్మ కౌశలం అని ఈ రెండింటి సంయోగమే విధి విధానమని మనమంతా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతేనీ ఉన్నది.

-శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

Tags:    
Advertisement

Similar News