ఆ ఆనందపు తరకలు
ఏవీ? ఎక్కడున్నాయి?
ప్రేమవెన్నెల గా కురిసి, మనసును తడిపేసిన ఆ క్షణాలు
ఏ కాలపు తెరలలో దాగాయో..
నాతో దాగుడుమూతలు ఆడుతూ...
జ్ఞాపకాల కన్నీటిపొరలుగా పేరుకున్నాయి.
ఆశలు రేగే అందమయిన వేళ
పన్నీరు చిలుకుతుంది ఒక తలపు
ఆశల పల్లకిలో ఊరేగించి,
మబ్బులు కమ్మిన వేళ ...
శ్రావణ మేఘమై కురుస్తుంది ఒక తలపు.
మెరుపై ఎదను మెరిపించి,
కెంజాయిరంగుల సంధ్య వేళలో
సన్నజాజి పరిమళమై గుప్పుమంటుంది .
మనసును మురిపించి,
చీకటి ముసిరిన వేళ
నిరాశాముల్లై గుచ్చుకుంటుంది.
మరులు రేపే మసక వెలుతురు గా మదిలో పరచుకుంటుంది.
నీ కఠినహృదయాన్ని నా ప్రేమతో ఎంత తడిపినా...
తడిలేని ఆకాశమై, బీటలు వారే వుంది
కనికరించని నీ మది.
అయినా నా ప్రేమ వర్షం కురుస్తూనే ఉంటుంది .
నా ప్రేమ వెన్నెల వెలుగుతూనే ఉంటుంది.
నీ మీద నా తలపులవాన అసిధారా వ్రతమై కురుస్తూనే వుంటుంది.
-భాగ్యశ్రీ ముత్యం ( కొవ్వూరు)